అక్రమార్కుల గుండెల్లో దడ!

9 Feb, 2018 11:45 IST|Sakshi

చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్, జేసీ  

ఇటీవల ఒకేసారి ఆరుగురు వీఆర్‌వోల సస్పెన్షన్‌

తాజాగా ఆలూరు తహసీల్దారుపై సస్పెన్షన్‌ వేటు

త్వరలో మరో ముగ్గురు తహసీల్దార్లపై చర్యలు?

కర్నూలు(అగ్రికల్చర్‌): రెవెన్యూ అక్రమాలను కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. రైతుల భూము ల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడంలో వీఆర్‌వో మొదలుకొని తహసీల్దారు వరకు అక్రమాలకు పాల్పడుతుండటంపై కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ దృష్టి సారిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు నమోదు చేయడంతో అక్రమాలకు పాల్పడిన ఆరుగురు వీఆర్‌వోలను ఇటీవల ఒకే రోజు సస్పెండ్‌ చేయగా..  తాజాగా ఆలూరు తహసీల్దారుపై సస్పెన్షన్‌ వేటు వేశారు. 

పకడ్బందీ విచారణ..
ఆలూరు తహసీల్దారు అక్రమాలపై లోతుగా విచారణ జరిపించారు. తహసీల్దారు అక్రమాలపై ఉన్నతాధికారులే అవాక్కయ్యారు. అటవీ భూములకు ఏకంగా పాస్‌ బుక్‌లు ఇవ్వడంతో పాటు వెబ్‌ల్యాండ్‌లోనూ నమోదు చేయడం గమనార్హం. అటవీ భూములు ప్రభుత్వ భూముల కిందకు వస్తాయి. అంటే తహసీల్దారు అటవీ భూములను అమ్మకానికి పెట్టినట్లు విమర్శలున్నాయి. అంతేగాక బినామీ పేర్లపై రెండు చౌకదుకాణాలు కూడా కలిగి ఉన్నట్లు సమాచారం. తహసీల్దారు అవినీతిపై ఫిర్యాదులు భారీగానే వచ్చినట్లు సమాచారం. అక్రమాలకు కేంద్ర బిందువైన తహసీల్దారును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే అక్రమాలను సహించేది లేదనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది.

మరి కొంతమంది వీఆర్‌వోలు, మరో ముగ్గరు తహసీల్దార్లపై త్వరలో వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  కల్లూరు మండలం చిన్న టేకూరు రెవెన్యూ గ్రామానికి చెందిన ఓ రైతుకు 69 సెంట్ల భూమి ఉంది. అయితే సంబందిత వీఆర్‌వో వెబ్‌ల్యాండ్‌లో 50 సెంట్లు మాత్రమే నమోదు చేశారు. మిగిలిన 19 సెంట్లు ఉద్దేశ్యపూర్వకంగా నమోదు చేయలేదని పిర్యాదులు వచ్చాయి. అంతేగాక వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలంటే జాయింట్‌ కలెక్టర్‌ అనుమతి అవసరం. నమోదు చేసిన 50 సెంట్లు కూడ జేసీ ఆమోదం లేకుండా నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ కారణాల చేత సంబందిత వీఆర్‌వోను సస్పెండ్‌ చేశారు.

మామూళ్లు ముట్టకపోతే తిరస్కరణలే..
రెవెన్యూలో చేయితడిపితేనే పనులు జరుగుతాయనే అభిప్రాయం ఉంది. మీసేవ కేంద్రాలను వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఇది వాస్తవమేనని తెలుస్తోంది. భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకునేందుకు, సవరణలకు  మీసేవ కేంద్రాల ద్వారా చేసుకున్న దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణలకు గురవుతున్నాయి. తిరస్కరించిన వాటిలో సరైన కారణాలు కలిగినవి 5 నుంచి 10 శాతం వరకు ఉండగా, మామూళ్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో తిరస్కరించినవే ఎక్కువగా ఉంటున్నాయి. అడంగల్‌ సవరణల కోసం ఇప్పటి వరకు 2,69,849 దరఖాస్తులు మీసేవ కేంద్రాల నుంచి రాగా 1,93,923 దరఖాస్తులను తిరస్కరించారు. మ్యుటేషన్‌లు, ఈ పాసుపుస్తకాల కోసం 1,47,898 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 99982 దరఖాస్తులను ఆమోదించారు. 47,128 దరఖాస్తులను తిరస్కరించారు. ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తులు 65,587 దరఖాస్తులు రాగా 12,793 తిరస్కరించారు.  

ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌తో గడువులోపే తిరస్కరణ..
భూముల కొనుగోలు, అమ్మకాలు జరుగుతుంటాయి. భూములను కొనుగోలు చేసిన వారు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, ఈ–పాసు పుస్తకాలకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. విధిగా 30 రోజుల్లో తహసీల్దారు ఆ దరఖాస్తులను ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాలి. ఏ నిర్ణయం తీసుకోకపోతే 31 రోజున ఆటోమేటిక్‌గా మార్పులు జరిగిపోతాయి. మ్యుటేషన్‌ దరఖాస్తులపై గడువులోపు చర్యలు తీసుకోవాలని, ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ జరిగితే తహసీల్దార్లపై చర్యలు ఉంటాయని జేసీ హెచ్చరించిన నేప«థ్యంలో గడవులోపు తిరస్కరిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు