వజ్రాలు, బంగారు నిక్షేపాల కోసం...

9 Jan, 2018 10:44 IST|Sakshi

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న తవ్వకాలు

సాక్షి, తుగ్గలి : గుప్త నిధుల కోసం అన్వేషణలో ప్రభుత్వం  పట్టు వీడటం లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. తన పని తాను చేసుకుపోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గత ఏడాది డిసెంబర్‌ 13న గుప్త నిధుల కోసం వేట ప్రారంభించిన విషయం విదితమే.

శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో వజ్రాలు, బంగారం పెద్దఎత్తున ఉందంటూ ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామ అభివృద్ధి కమిటీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మరంగా తవ్వకాలు జరగ్గా ఏనుగు దంతాలు, జంతు కళేబరాల అవశేషాలు లభ్యమయ్యాయి. 

కోటలోని బండరాళ్ల కింద,  బురుజులో తవ్వకాలు చేశారు. నిధి ఆచూకీ కోసం ఎన్నెన్నో పూజలు, మంత్రాలు, స్కానర్లు, జియాలజిస్టులతో సర్వేలు.. ఇలా అన్నీ చేశారు.  కోటలో అనుమానం వచ్చిన చోట, స్వామీజీలు గానీ, ఇంకా ఎవరైనా గానీ చెప్పిన చోటల్లా తవ్వకాలు చేస్తూ పోతున్నారు. మొదట్లో బండరాయి కింద 18 రోజుల పాటు తవ్వకాలు చేపట్టిన తరువాత కోట బురుజులోకి మార్చారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు తవ్వకాలు చేశారు. బండ రాళ్లు పడడంతో వాటిని కూలీలతో పగులగొట్టి తొలగిస్తున్నారు.

అలాగే రెండు రోజులుగా కోట ప్రధాన ద్వారం ఊరు వాకిలి పక్కనున్న పాతాళ గంగ బావిలోనూ తవ్వకాలు చేపట్టారు. ఇందులో భాగంగా బావిలోని నీటిని మోటారు సాయంతో బయటకు తోడేశారు. బావిలో మూడు తలల నాగపడగ, ప్రాచీన కాలంనాటి వస్తువులు బయటపడ్డాయి.   తహసీల్దార్‌ గోపాలరావు, వీఆర్‌ఓ కాశీరంగస్వామి, పత్తికొండ సీఐ విక్రమసింహ, జొన్నగిరి ఎస్‌ఐ నజీర్‌అహ్మద్‌ తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు