అందుకే చాలామంది ప్రేమికులు విడిపోతున్నారు

17 Oct, 2019 14:27 IST|Sakshi

నా పేరు ఆహిల్‌ ! మాది కడప. నేనో అంతర్ముఖున్ని(ఇంట్రావర్ట్‌) ఎవరితోనూ ఎక్కువగా కలవను! పైగా కోపంకూడా ఎక్కువే. అలాంటి నాకు.. నేను ఎంబీఏ చదవటానికి విజయవాడ వెళ్లినపుడు ప్రత్యూష అనే అమ్మాయి పరిచయం అయ్యింది. తను చాలా మంచి అమ్మాయి.. ఓపిక ఎక్కువ. ఈ రెండు కారణాలు నన్ను ఆమెతో ప్రేమలో పడేలా చేశాయి. అంతే! తనతో వెంటనే చెప్పేశా ‘‘నువ్వంటే నాకు ఇష్టం’’ అని. తనకు కూడా నేనంటే ఇష్టం. అలా నా ప్రేమకు ఓకే చెప్పింది. కానీ, ఎక్కడో ఓ చిన్న భయం నన్ను వెంటాడేది. అదేంటంటే, నేను ముస్లిం అబ్బాయిని, తను ఒక హిందువు అమ్మాయి. మా ప్రేమకు పెద్దలు అంగీకరిస్తారా అని చిన్న సందేహం. అలా మా ప్రేమ ఎంబీఏలో ఉన్న రెండేళ్లపాటు కొనసాగింది. తను నన్ను ప్రతి విషయంలో అర్థం చేసుకునేది. నా కోపాన్ని భరించేది.

అలా తన ప్రేమలో 2 ఏళ్లు రెండు రోజుల్లా గడిచిపోయాయి. తర్వాత నేను జాబ్‌ కోసం బెంగళూరు వెళ్లాను. తను ఇంటికి వెళ్లింది. ఒక రోజు ఫోన్‌చేసి ‘‘ నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు’’ అంది. నాకు చాలా భయం వేసింది. కొన్ని సంబంధాలు నా కోసం తను రిజెక్ట్‌ చేసింది. తర్వాత నాకు ఓ పెద్ద కంపెనీలో జాబ్‌ వచ్చింది. ఒక వైపు జాబ్‌ వచ్చిందని సంతోషం.. మరో వైపు తను ఎక్కడ దూరం అవుతుందోనన్న బాధ. తను కూడా జాబ్‌ పేరుతో బెంగళూరు వచ్చింది. కానీ, తను వచ్చింది నాకోసం. కొద్దిరోజుల తర్వాత నాకు చెన్నై ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. తర్వాత తను కూడా బెంగళూరు నుంచి ఇంటికి తిరిగివెళ్లిపోయింది. వాళ్ల నాన్నకు తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంది. అందుకే ఎలాగైనా ప్రత్యూష పెళ్లి చూడాలని ఆయన కోరిక. మళ్లీ తను బెంగళూరు నుంచి ఇంటికి తిరిగి వెళ్లగానే పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.

వాళ్ల ఫాదర్‌ హెల్త్‌ ప్రాబ్లమ్.. మా ప్రేమ! ఈ రెండిటి మధ్య ఆ అమ్మాయి నలిగిపోయింది. మా ఇంట్లో పరిస్థితులు కూడా పెళ్లికి తగ్గట్టు లేవు. మా మతాలు వేరవటం వల్ల మా ఇళ్లలో ప్రేమ గురించి చెప్పుకోవటానికి భయపడ్డాం. అందులో ప్రత్యూష వాళ్ల నాన్న ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు. వాళ్ల నాన్నకు తన పెళ్లి మీద ఎన్నో కలలు ఉన్నాయి. ఇన్ని ఆలోచనల మధ్య తను ఓ సంబంధానికి ఓకే చెప్పింది. ఈ మధ్య తన పెళ్లి కూడా అయిపోయింది. ఆ రోజు నా మనసు ముక్కలుగా పగిలిపోయింది. అలాంటి అమ్మాయిని నా లైఫ్‌లో మిస్‌ చేసుకున్నందుకు నేను జీవితాంతం బాధపడతా.. ఈ సమాజంలో కులమతాల వల్ల చాలా మంది ప్రేమికులు విడిపోతున్నారు. అందులో నాప్రేమ కూడా ఒకటి..మిస్‌ యూ ప్రత్యూష
- ఆహిల్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు