నాన్న నా ప్రేమను తిరిగిచ్చాడు!

26 Dec, 2019 14:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఉన్న తరంలో ప్రేమించడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది తరచుగా జరుగుతోంది. అందులో కొన్ని ప్రేమ జంటలు మాత్రమే పెళ్లి వరకు వెళ్లి జీవితాంతం కలిసి ఉంటున్నాయి. కానీ, కొన్ని మాత్రం పెళ్లి వరకు రావడం లేదు. దానికి కారణం కొన్ని వాళ్లే అవ్వడం, మరి కొన్ని వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం. అలా తల్లితండ్రులు ఒప్పుకోకపోవడం వల్ల కొన్ని ప్రేమ జంటలు వాళ్ల తల్లిదండ్రులను బాధపెట్టలేక, ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ కూడా అలాంటిదే. నా పేరు అంజలి. మాది ఒక చిన్న కుటుంబం. నా తండ్రి ఒక ఉపాధ్యాయుడు. నేను, నాకు ఒక తమ్ముడు. మా తండ్రి ఉపాధ్యాయుడు కావడం వల్ల చిన్నతనం నుండి పద్ధతిగా, చదివే లోకంగా ఉండేలా మమ్మల్ని పెంచాడు. మేము కూడా మా తండ్రి గారి బాటలోనే మంచి ఉద్యోగం చెయ్యాలి, మా తండ్రి పేరు నిలబెట్టాలని, సమాజంలో ఆయనకి ఉన్న గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పెరిగాం.  

అలాగే ఉన్నాం. నేను నా డిగ్రీ పూర్తి చేసుకున్నాక, పీజీ కొరకు ఒక మంచి కళాశాలలో మా తండ్రి గారు అడ్మిషన్ తీసుకున్నారు. నేను కళాశాలలో చేరడానికి కావలసిన ధ్రువపత్రాలను సమర్పించడం కోసం ఆ కళాశాలకి మొదటి సారిగా వెళ్లాను. నాకు ఆ కళాశాల కొత్తది కాబట్టి ఎక్కడికి వెళ్లి ఆ పత్రాలను ఇవ్వాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక అక్కడే అటు ఇటు తిరుగుతూ ఎవరిని అడగాలో తెలియని సందేహంతో ఉన్నాను. ఇంతలో ఎవరో సహాయం కోసం పిలిచినట్టుగా, ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి ‘మీరు ఈ కళాశాలకు కొత్తగా వచ్చినట్టున్నారు..! ఏదో సందిగ్ధంలో ఉన్నట్టున్నారూ...!! మీరు ఏమీ అనుకోకపోతే నేను మీకు ఏ విధంగా సహయపడగలను’ అని అన్నాడు. తను అలా అడిగే సరికి కొంచెం సందేహంతోనే నేను వచ్చిన పని ఏంటో చెప్పేశాను. తను నా గురించి ఆ నిమిషం ఏం అనుకున్నాడో నాకు తెలియదు కానీ, దగ్గర ఉండి మరీ నా పని మొత్తం పూర్తి చేపించాడు.

నా పని పూర్తి కాగానే తనకి ధన్యవాదాలు చెప్పాలని తన దగ్గరికి వెళ్లే లోపు తన స్నేహితుడు వచ్చి పిలిచే సరికి అతను మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. ఆ అబ్బాయిని నేను మొదటి సారిగా చూడడం అక్కడే!! చూడగానే మంచి వాడిలానే అనిపించాడు. తనలోని ఇతరులకి సహాయం చేసే ఆ గుణం, మాటల్లో చెప్పకున్నా ఎదుటి వారి భావోద్వేగాలను అర్థం చేసుకునే అతని స్వభావం నన్ను అతని వైపు ఆకర్షితురాలిని చేశాయి. ఆలాంటి వ్యక్తికి ధన్యవాదాలు చెప్పలేదు కదా! అతని పేరు కూడా అడగనందుకు కొంచెం బాధగా కూడా అనిపించింది. కానీ, ఏదో ఒక రోజు అతనిని మళ్లీ కలుస్తా అనే నమ్మకంతో వెళ్లిపోయాను. ఇక నేను యధావిధిగా కళాశాలకు వెళ్లడం ప్రారంభించాను. అనుకోకుండా ఒక రోజు కళాశాలలో అతనిని చూశాను. తనని చూడగానే నాలో ఏదో తెలియని కల్లోలం అంతేకాకుండా మళ్లీ కలిశాను అనే సంతోషం కలిగింది. వెంటనే తన దగ్గరికి వెళ్లి మాట్లాడాను.

తను నన్ను చూడగానే గుర్తు పట్టాడు. తను చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పి మాట్లాడాను. అప్పుడే తన పేరు సిద్దార్థ్ అని, అదే కళాశాలలో పీజీ పూర్తి చేసుకుని ఒక మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరాడని, సర్టిఫికెట్స్ కోసం ఆ కళాశాలకు వచ్చాడని తెలిసింది. ఇక తను వచ్చిన పని అయిపోయింది అని వెళ్తూ మీరు ఏమి అనుకోకపోతే మీ నంబర్ ఇస్తారా అని అడిగాడు. నేను నా నెంబర్ ఇవ్వడంతో మెల్ల మెల్లగా మా ఇద్దరి మధ్యా పరిచయం చాటింగులు, టాకింగుల ద్వారా పెరగసాగింది. తను కూడా అప్పుడప్పుడు నన్ను కలుస్తూ ఉండేవాడు. తన మాటల్లో ప్రవర్తనలో తనకి నాపై ఉన్న ప్రేమ కనిపించేది. అలా అలా మా ఇద్దరి మధ్యా స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఒకసారి తను నన్ను గుడికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ దేవుడి సాక్షిగా తను నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పి ‘‘నీతో ఏడు అడుగులు వేసి, ఏడు జన్మల వరకు తోడుగా, నీ నీడనై నీ వెంటనే ఉంటాను, నన్ను పెళ్లి చేసుకుంటావా.!?’ అని అడిగాడు.

తను అలా అడగగానే నాకు ఏమి చెప్పాలో తోచలేదు. నేను వెంటనే సిద్దార్థ్‌తో ‘నువ్వంటే నాకు ఇష్టమే కానీ, మనం పెళ్లి చేసుకోవాలంటే మన తల్లితండ్రులు ఒప్పుకోవాలి కదా! అందుకే నువ్వు మీ ఇంట్లో ఒప్పించు నేను మా ఇంట్లో ఒప్పిస్తా’ అని చెప్పాను. అందుకు తను సంతోషంగా ఒప్పుకున్నాడు. అనుకున్నట్టుగానే తను తన ఇంట్లో వాళ్లని ఒప్పించాడు. నేను నా ఇంట్లో ఒప్పిద్దాం అని మా నాన్న గారికి జరిగింది అంతా చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాను. కానీ తను ఒప్పుకోలేదు. అంతేకాకుండా తను నాకు ఒక మంచి పెళ్లి సంబంధం తెచ్చానని, అతనినే పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. ఇక నాకు ఏమి చెయ్యాలో అర్థం కాక సిద్దార్థ్ దగ్గరికి వెళ్లి జరిగింది అంతా చెప్పాను. ‘మా తండ్రిని కాదని నేను నీతో ఏడు అడుగులు వెయ్యలేను. అలా అని నిన్ను వదులుకోను’ అని అన్నాను. దానికి సిద్దార్థ్ ‘మన పరిచయం 2 సంవత్సరాలే కావచ్చు, కానీ మీ ఇద్దరికీ ఉన్న తండ్రి కూతుళ్ల అనుబంధం ముందు మన ప్రేమ ఎందుకూ సరిపోదు. 

నువ్వు వెళ్లి మీ నాన్న చూసిన అతనినే పెళ్లి చేసుకో’ అన్నాడు. ఆ మాటలు విన్నాక నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఇక తనతో ఏమీ మాట్లాడకుండా బాధతో అక్కడి నుండి వెళ్లిపోయి సిద్దార్థ్ చెప్పినట్టుగా మా తండ్రిని బాధ పెట్టడం ఇష్టంలేక ఆ పెళ్లికి ఒప్పుకున్నాను. నేను ఒప్పుకోవడం ఆలస్యం అంతలోనే పెళ్ళిచూపులు పెట్టించారు. అందరు అమ్మాయిల లాగానే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాననే అనే బాధతోనే వెళ్లి పెళ్లి చూపుల్లో కూర్చున్నాను. అక్కడ నేను ఊహించనిది జరిగింది. అదేంటంటే ఆ అబ్బాయి మరెవరో కాదు "సిద్దార్థ్". నేను నా తండ్రి గౌరవ మర్యాదల కోసం, తనని భాదపెట్టలేక సిద్దార్థ్‌ని వద్దు అనుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానని, నాకు నచ్చిన వాడినే ఇచ్చి పెళ్లి చెయ్యాలని నా తండ్రి సిద్దార్థ్ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాడు. ఇక నేను ఊహించని మలుపుతో సిద్దార్థ్‌తో నా పెళ్లి నిశ్చయం అయింది. తండ్రి కోసం నేను నా ప్రేమని వదులుకుంటే నాకోసం మా నాన్న నా ప్రేమని నాకు తిరిగిచ్చాడు. ఇష్టం అయిన వాళ్ల కోసం ప్రేమని ఇవ్వడంలో ఎంత సంతోషం ఉంటుందో, ఆ ప్రేమని వదులుకోవడంలో కూడా అంతే సంతోషం ఉంటుంది.
- అంజలి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు