మావాడికి ధైర్యం ఎక్కువ! పారిపోయారంటే..

18 Dec, 2019 14:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మా అక్కవాళ్ల ఊర్లో ఫంక్షన్‌ అప్పుడు మొదటిసారి తనని చూశా. మొదటి చూపులోనే పడిపోయా. ఎవరీ అమ్మాయని ఆలోచిస్తుంటే మా అక్క వచ్చి ‘ఏంట్రా! అలా చూస్తున్నావ్? మన వనపర్తి అత్తమ్మ కూతురు’ అని అనగానే నాలో ఏదో తెలియని అలజడి స్టార్ట్ అయ్యింది. తను నాతో క్లోజ్‌గా మాట్లాడటం స్టార్ట్ చేసింది. బావ, బావ అంటూ ఎప్పుడూ నా వెంటే తిరిగేది. మా బంధువులు కూడా ‘జంట చాలా బాగుంది. పెళ్లి చేసుకోండి!’ అని సరదాగా అనేవారు. ఫంక్షన్ అయిపోయినా కూడా నేను అక్కడే ఉన్నా కాబట్టి తను కూడా అక్కడే ఉంది. చాలా క్లోస్ అయ్యాం. ఇంక ఊరు వెళ్ల వలసిన టైం వచ్చింది. తను వెళ్తుంటే ఏదో తెలియని బాధ! ఏం చెయ్యాలో అర్థం కాలేదు, ధైర్యం చేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చా! హ్యాపీగా తీసుకుంది. ఒకవారం తర్వాత ఫోన్లు స్టార్ట్ అయ్యాయి. ఒకసారి ధైర్యం చేసి లవ్ ప్రపోజ్ చేశా.

ఈ మాట కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అని అనేసరికి నా ఆనందానికి అవధుల్లేవ్. అప్పటి నుంచి వనపర్తిలో కలవడం వాళ్ల ఇంటికి కూడా వెళ్లడం స్టార్ట్ అయ్యింది. మా అత్తమ్మ కూడా నన్ను చాలా ఆప్యాయతగా చూసుకునేది. నాకేమో నేను తప్పు చేస్తున్నానేమో అనిపించేది. ఆమె ఆప్యాయత చూసి. నాకు అమ్మ నాన్న లేకపోవడం వల్ల వాళ్ల ఇంట్లో చెప్తే పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అని చాలా ఆలోచించే వాడిని. ఒక సారి ధైర్యం చేసి మా అత్తమ్మకు చెప్పాను. ‘మొదట మీ మామను, మీ అక్కాబావను ఒప్పించు. వాళ్లు ఒప్పుకుంటే నాకు ఓకే’ అంది. 3ఏళ్లు గడిచిపోయాయి. ఇలా అయితే కష్టం అని చెప్పి మా అక్కకు బావకు విషయం చెప్పేశా. వాళ్లు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. మా ఆలోచన కూడా అదే అని చెప్పారు. కానీ అందరిలాగే నా ప్రేమ కూడా ప్రాబ్లమ్‌లో పడింది.

వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. ‘అమ్మానాన్న లేనివాడికి ఇవ్వను. అందులో వాడు డ్రైవర్ పని చేస్తుంటాడు కాబట్టి అస్సలు ఇవ్వను’. అని తేల్చి చెప్పేశాడు. ఇంక ఏం చేస్తాం. అందరిలాగే పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు మా బావ వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి ‘మావాడికి ధైర్యం ఎక్కువ! వాడికి బయటి ప్రపంచం చాలా తెలుసు. వాళ్లు పారిపోయారంటే దొరకడం చాలా కష్టం. అప్పుడు మీ పరువు పోతుంది, మా పరువు పోతుంది. వాళ్లకు పెళ్లి చేద్దాం’ అని ఒప్పించాడు. వాళ్లందరూ ఒప్పుకున్నారు. మా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. నా జీవితంలో నేను సాధించిన గొప్పవిజయం ఏదైనా ఉందంటే నా ప్రేమను సాధించుకోవడమే.
- అన్ను మహేష్‌, వనపర్తి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు