సూపర్‌ ఫుడ్‌తో కోవిడ్‌-19 రిస్క్‌కు చెక్‌

5 Jun, 2020 11:16 IST|Sakshi

జీర్ణవ్యవస్థకు మేలుచేసే ఆహారం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తూ మానవాళికి పెనుసవాల్‌ విసిరిన క్రమంలో మహమ్మారిని ఎదుర్కొనే మందు, వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో స్వీయ నియంత్రణే పరమౌషధంగా ముందుకొస్తోంది. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇమ్యూనిటీకి దోహదపడే జీర్ణవ్యవస్ధను మెరుగుపరిచే ఆహారం తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణసంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ ముప్పు అధికమని వీరు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్‌ యురోప నివేదిక హెచ్చరించడం మన ప్రేవులను సురక్షితంగా ఉంచుకోవడం కీలకమని సూచిస్తోంది.

కోవిడ్‌-19 ఊపిరితిత్తులనే కాకుండా జీర్ణవ్యవస్థ సహా కీలక అవయవాలపై పెనుప్రభావం చూపుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఫైబర్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ, విటమిన్‌ కే పుష్కలంగా ఉండే ఆకుకూరలను అధికంగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక ఫైబర్‌తో పాటు ప్రొటీన్‌, బీ విటమిన్‌, ఒమెగా 3 ఆమ్లాలు అధికంగా ఉండే తృణ ధాన్యాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటితో బరువు తగ్గడంతో పాటు టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె జబ్బులు, ఒబెసిటీ, కొన్ని క్యాన్సర్ల ముప్పును నివారించవచ్చు.

బెర్రీ పండ్లు, ఆరంజ్‌, ద్రాక్ష వంటి అధిక ఫైబర్‌, తక్కువ ఫ్రక్టోజ్‌ కలిగిన పండ్లను నిత్యం ఆహారంలో తీసుకుంటే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. జీవర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు అరటిపండ్లు కూడా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక తక్కువ కొవ్వుతో కూడిన చికెన్‌, చేపలు వంటి లీన్‌ మీట్‌నూ ఆహారంలో భాగం చేసుకోవాలని పేర్కొంటున్నారు. వీటన్నింటితో పాటు జీర్ణ సంబంధ సమస్యలకు దారితీసే డీహైడ్రేషన్‌ను నివారించేందుకు ప్రతిఒక్కరూ మంచినీటిని అధికంగా తీసుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు. అధికారులు సూచించే మార్గదర్శకాలను పాటిస్తూ ఈ ఆహారం తీసుకుంటూ కోవిడ్‌-19 వ్యాధికి గురయ్యే ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చదవండి : కరోనా విజేతగా 80 ఏళ్ల వృద్ధురాలు

మరిన్ని వార్తలు