కళ్లల్లో వత్తులేసుకుని చూడండి

22 Oct, 2019 13:33 IST|Sakshi

నవ్వింతల తుళ్లింతల చిన్నారి ఆమె. పదేళ్ల వయసు. కళ్లు చెదిరే అందం. మెటికెలు విరవాలనిపించేంత కళ్ల మెరుపు. ఆ వయసుకు ఉండే చురుకు. దీపావళి సందడిలో అందరు పిల్లల్లాగే ఆమె కూడా నిమగ్నమైంది. పటాసును అంటించేసి పక్కకు తొలిగింది. చురచురమనే మంటకు దూరంగా చురుగ్గా కదిలింది. కానీ ఆమె వెనకాలే కాలుతున్న ప్రమిద. చిదిమి దీపం పెట్టుకునేంత అందానికి ఆ దీపం తగిలింది. వెలుగు మంటయ్యింది. ఒంటిని కాల్చేసింది. అగ్గిపుల్ల అంటితేనే గబుక్కున వేలిని వెనక్కు తీసుకునే మనమందరం ఆమె భరించిన ఉష్ణాన్ని ఊహించవచ్చు. కొన్నాళ్ల పాటు భగభగను భరించింది. ప్లాస్టిక్‌ సర్జరీల పేరిట ఒలిచేసే చర్మం... కలిచేసే బాధ. ఎన్నో సార్లు చర్మాన్ని తీసి కాలిన చోట అంటించారు. బొబ్బలు మానాక అతికించారు. ఎన్నెన్నో చికిత్సలతో ఎట్టకేలకు ఆ పాపాయి ఇప్పుడు పూర్తిగా మామూలయ్యింది. ఆ చిన్నారి మా ఆఫీస్‌ కలీగ్‌ కూతురే. కానీ స్కూలుకు వెళ్లినప్పుడల్లా ఆమెనూ, మేనినీ గమనించి చూస్తారు. గాయాల మచ్చలు ఇంకా ఉన్నాయేమోనని పరిశీలిస్తారు. ఒంటి గాయాలు మానినా మనసుపై మచ్చలు పరుస్తుంటారు. ఇలాంటి కష్టం ఏ పాపకూ రాకూడదు. ఏ చిన్నారికీ ఇలాంటి చేటు కలగకూడదు. పసి మనసులు చెదరకూడదు. అందుకే అందరూ అప్రమత్తం వహించండి. ఈ కొన్ని జాగ్రత్తలు పాటించండి. కళ్లలో ఒత్తులు వేసుకొని పిల్లలను చూసుకోండి...

సాధారణ జాగ్రత్తలు
►ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని పంచి ఇచ్చే పండుగ వెనక పరమార్థం కూడా ఉంది. సరిగ్గా వర్షరుతువులోని వానలు తెరిపి ఇచ్చాక వచ్చే పండగ ఇది. వానల తర్వాత ఇళ్లల్లోని చెమ్మకు విరుగుడుగా సున్నంవేస్తారు.
►బాణాసంచా నుంచి వచ్చే పొగల వల్ల ఈ సీజన్‌లో స్వతహాగా పెరిగే అనేక రకాల హానికారక సూక్ష్మజీవులు నశించిపోయేలా పెద్దలు రూపొందించిన పండగ ఇది. టపాకాయలు కాల్చడం వల్ల వెలువడే గంధకం, పొటాషియం వంటివి కీటకాలను, క్రిములను దూరంగా ఉంచుతాయి.
►ఇదే సీజన్‌లో విస్తరిల్లే మలేరియా, డెంగ్యూల నుంచి స్వాభావిక రక్షణ కల్పించేలా చేస్తాయి. అంటువ్యాధులను వ్యాపించజేసే అనేక క్రిములను తుదముట్టించి అరికట్టేందుకు బాణాసంచా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి పాజిటివ్‌ అంశాలు కాగా... ఇక దీంతో వచ్చే కొన్ని నెగెటివ్‌ అంశాలివి...
►పండగ అనగానే పిండివంటలు, స్వీట్లతో హైక్యాలరీ ఫుడ్‌ తినేసే అవకాశాలుంటాయి. క్యాలరీ ఇన్‌టేక్‌ తగ్గించుకోవాలి.
►ఆహార విషయాల్లో డయటరీ ఇర్రెగ్యులారిటీలు వచ్చే అవకాశం ఉంటుంది. అది డయాబెటిస్, హైపీడీ ఉన్న రోగులను. ప్రభావితం చేసే అవకాశం ఎక్కువ. ఎంత రుచిగా ఉన్నా మితంగా తినడం మంచిది.
►గంధకం వంటి రసాయనాల ప్రభావంతో వాయుకాలుష్యంతోపాటు అది కొన్ని అలర్జీలను మరింత ప్రజ్వరిల్లేలా చేసే అవకాశమూ ఉంది.
►టపాకాయల నుంచి వచ్చే పొగతో ఉబ్బస వ్యాధులు (అలర్జిక్‌ ఎయిర్‌వే డిసీజెస్‌) ఉన్నవారికి అకస్మాత్తుగా అటాక్‌ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు పొగకు దూరంగా ఉండాలి.
►దీపావళి అయిన మర్నాడు చూస్తే రోడ్లపై టపాకాయల చుట్టేందుకు ఉపయోగించిన కాగితాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. ఇది మరోరకం కాలుష్యం.

కళ్లు
►మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రభావం.  
►ఇక పరోక్షంగా కూడా... సల్ఫర్, గన్‌పౌడర్‌ లాంటి రసాయనాల విషప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు.
► తీక్షణమైన వెలుగును నేరుగా చూడవద్దు. దాని వల్ల కార్నియల్‌ బర్న్స్‌ రావచ్చు. అందుకే బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు.
 ►కొన్ని రకాల బాణాసంచా నుంచి నిప్పురవ్వల వంటివి కంటికి తాకే అవకాశం ఉన్నందున అలాంటి వాటిని కాల్చే సమయంలో... కాల్చగానే వీలైనంత దూరం పోవాలి.
 కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు.
 ►బాణాసంచా కాల్చేసమయాల్లో కంటికి రక్షణగా ప్లెయిన్‌ గాగుల్స్‌ వాడటం మంచిది.
 ►వెలుగులు, రవ్వలతో పాటు వేడిమి వల్ల కూడా కన్ను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లడం మంచిది.
► రాకెట్‌ వంటివి పైకి వెళ్లకుండా కంటిని తాకితే దానికి గాయం (మెకానికల్‌ ఇంజ్యూరీ) కూడా అయ్యే అవకాశం ఉంది. గాయం వల్ల ఒక్కోసారి కంటి లోపల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
► డైరెక్ట్‌ మంట కంటికి తగిలి కన్నుగాని, కనురెప్పలుగానిక తాగే అవకాశం ఉంది. ఫలితంగా కార్నియా దెబ్బతింటే శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది.
► అలాంటిదే జరిగితే కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్ప ఇతర చికిత్సలతో ఫలితం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి.
► గాయం ఎలాగైనప్పటికీ ఒక కన్ను మూసి విజన్‌ పరీక్షించి చూసుకోవాలి. చూపులో ఏమాత్రం తేడా ఉన్నా వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌ను కలిసి చూపించుకోవాలి.

చర్మం
►దీపావళి బాణాసంచాతో గాయం అయ్యేందుకు చర్మానికే ఎక్కువ అవకాశం. కారణం... చర్మం మానవ శరీరాన్నంతా కప్పి ఉంచే అత్యంత పెద్ద అవయవం కావడమే.
►బాణాసంచా కేవలం లైసెన్స్‌డ్‌ షాప్‌లోనే కొనాలి.
►ఇంట్లో ఓ కార్డ్‌బోర్డ్‌ బాక్స్‌ వంటి దాన్లో పెట్టాలి.
►ఆ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి.
►బాణాసంచాను చెల్లాచెదురుగా ఉంచకూడదు.
►సాయంత్రం వాటిని కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి.   
►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి.
►వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది.
►నిత్యం నీళ్లు ఎక్కువగా తాగడం చర్మానికి ఎంతో మంచిది. అయితే దీపావళి సందర్భంగా ఆ నిబంధనను మరింత శ్రద్ధగా పాటించాలి. ఎందుకంటే... పొరబాటున చర్మం కాలితే ఆ ప్రక్రియలో చర్మం నీటిని కోల్పోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే  గాయం తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.
►బాణాసంచా కాల్చేప్పుడు ఎప్పుడూ ఒకే సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు.
►కాల్చే సమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది.
►కాల్చేప్పుడు టపాకాయ నుంచి మనం దూరంగా ఉండటానికి వీలుగా మోచేతిని వంచకుండా పూర్తిగా సాగదీయాలి. మోచేతిని ఎంతగా వంచితే టపాకాయకు అంత దగ్గరవుతాం.
►టపాసు నుంచి తలను వీలైనంత  దూరంగా ఉంచాలి.
►ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు.
►నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి.  
►గాయానికి తడి టవల్‌ను చుట్టి డాక్టర్‌ వద్దకుతీసుకెళ్లాలి.
►వేడి సోకడం వల్ల చర్మానికి అయ్యే గాయాన్ని మూడు విధాల వర్గీకరించవచ్చు. మొదటిది పైపైన (సూపర్‌ఫీషియల్‌), ఓమోస్తరు లోతుగాయం (మీడియన్‌ డెప్త్‌), మూడో రకం తీవ్రంగా కాలిన గాయాలు (డీప్‌ బర్న్స్‌).
►వీటిల్లో మీడియన్‌ డెప్త్, డీప్‌ బర్న్‌ గాయాల వల్ల చర్మంపై మచ్చ (స్కార్‌) మిగిలిపోయే అవకాశం ఉంటుంది.
►గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి.
►గాయాన్ని కడగడానికి సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీళ్లను మాత్రమే ఉపయోగించాలి.
►ఐస్‌ వాటర్‌ ఉపయోగించడం మంచిది కాదు.
►డాక్టర్‌ దగ్గరికి వెళ్లేవరకు తడిగుడ్డతో గాయాన్ని కప్పి ఉంచవచ్చు.
►కాలిన గాయలు తీవ్రమైతే ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి.
►కాలిన గాయం అయిన సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు.
►కాలి, చేతుల వేళ్లకు తీవ్రమైన మంట సోకితే అవి ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది.
►అలాంటప్పుడు వాటి మధ్య తడిగుడ్డ ఉంచి డాక్టర్‌ దగ్గరికి తీసుకుపోవాలి.
►బాణాసంచా ఎప్పుడూ ఆరుబయటే కాల్చాలి.
►ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన కాల్చకూడదు. మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు.
►టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్‌ బాక్స్‌ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు.
►మరింత శబ్దం వస్తుందని కుండల వంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది.
►చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు.

ఈఎన్‌టీ
►శబ్దం :  శబ్దం వల్ల నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువ.
►మనకు హాని కలిగించే శబ్దాలను రెండురకాలు విభజించుకోవచ్చు. మొదటిది... అకస్మాత్తగా వినిపించే శబ్దం... దీన్ని ఇంపల్స్‌ సౌండ్‌ అంటారు. రెండోది... దీర్ఘకాలం పాటు శబ్దాలకు అలా ఎక్స్‌పోజ్‌ అవుతూ ఉండటం. ఈ రెండోరకాన్ని క్రానిక్‌ అకాస్టిక్‌ ట్రామా అంటారు. మనం దీపావళి సందర్భంగా ఎదుర్కొనే శబ్దం మొదటిదైన ఇంపల్స్‌ సౌండ్‌. అకస్మాత్తుగా ఎక్స్‌పోజ్‌ అయ్యే శబ్దం నుంచి హాని ఈ కింద పేర్కొన్న ఏదో విధంగా కనిపించే  (మ్యానిఫెస్ట్‌ అయ్యే) అవకాశం ఉంది.
►అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు (ఇయర్‌ బ్లాక్‌) కావడం.
►చెవిలో నొప్పి, గుయ్‌... మంటూ శబ్దం వినిపిస్తూ ఉండవచ్చు.
►లోన ఇయర్‌ డ్రమ్‌ (టింపానిక్‌ పొర) దెబ్బతిని కొన్నిసార్లు కాస్తంత రక్తస్రావం కావడం.
►నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి నష్టం కూడా జరగవచ్చు.
►గర్భిణుల్లో 140 డిసిబుల్స్‌కు మించిన పెద్ద శబ్దం వల్ల ఒక్కోసారి నొప్పులు వచ్చి ప్రసూతి అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. లోపలి పిండంపైనా శబ్దం తాలూకు దుష్ప్రభావం ఉంటుంది.
►వయోవృద్ధులు కూడా మానసికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. 

మరి ఏం చేయాలి:
►మన ఆనందం పొరుగువాళ్లకు (ఆ మాటకొస్తే మనకు కూడా) హానికరం కాకూడదు. కాబట్టి కాస్తంత చైతన్యంతో మరికాస్త సంయమనంతో వ్యవహరించాలి. శబ్దాలతో ప్రభావితమయ్యే గ్రూప్స్‌కు దూరంగా బాణసంచా కాల్చాలి.
►పెద్ద శబ్దాలు వచ్చి పేలిపోయే టపాకాయలకు బదులు శబ్దాలేవీ రాకుండా పూల వర్షం కురిపించే చిచ్చుబుడ్లు, కాకరపూవత్తులు, పెన్సిళ్లు, భూచక్రాలు... వంటివి కాల్చాలి.
►ఒకవేళ శబ్దానికి ఎక్స్‌పోజ్‌ అయితే చెవిలో ఎలాంటి ఇయర్‌ డ్రాప్స్, నీళ్లూ, నూనె వెయ్యకుండా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించాలి. మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చికిత్స చేస్తారు.
►పొగకూ, రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. లేదంటే అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆస్తమాతో పాటు అనేక రకాల సమస్యలు తీసుకురావచ్చు.
►బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం వంటివి చేయకూడదు.
►రసాయనాలు అంటిన చేతుల్తో ముక్కు దగ్గర రుద్దితే దాని నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చేతులను ముఖానికి, కళ్లకూ, ముక్కుకూ, చెవులకూ దూరంగా ఉంచండి.

మానసిక ప్రభావాలు
►మంచి మ్యూజిక్‌తో ఆహ్లాదం వంటి పాజిటివ్‌ ఎఫెక్ట్‌ ఉన్నట్లే పెద్ద శబ్దాలతో నెగెటివ్‌ ప్రభావాలూ ఉంటాయి.
►బాణాసంచా శబ్దాలతో మానసికంగా కూడా దుష్ప్రభావాలు ఉండే అవకాశాలున్నాయి.
►పెద్ద శబ్దం వల్ల అగ్రెషన్‌ (ఉద్రేకం, పోట్లాటకు ముందు ఉండే స్థితి) పెరుగుతుంది.
►ఇది గర్భిణులు, వృద్ధులు వంటి వారిలో మరీ ఎక్కువ.
►గర్భంలో ఉన్న పిండంపై కూడా ఈ దుష్ప్రభావాలు ఉంటాయి.
 కారణం... పిండానికి 20 వారాలప్పుడే దృష్టి కంటే ముందుగా వినికిడి శక్తి ఏర్పడుతుంది. అందుకే వాటిపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది.
►యాంగై్జటీ, డిప్రెషన్‌ వంటివి ఉన్నవారు ఈ పెద్ద చప్పుళ్లు భరించలేరు.
►వారిలో ఆందోళన, చికాకు, కోపం, విసుగు మరింత పెరుగతాయి.
►కాలుష్యం వల్ల నేరుగా కాకపోయినా పరోక్షంగా కూడా మానసిక ప్రభావం పడుతుంది. ఇది మానసిక రుగ్మతలకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదు.
►మామూలు వాళ్లలో శబ్దాల వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
►అలాంటప్పుడు ఇక హృద్రోగం వంటివి ఉన్నవారిలో ఇది మరెంత పెరుగుతుందో దాని వల్ల హాని ఎంతో ఊహించుకోవచ్చు.
►ఎలాంటి పరిణామాల వల్ల అనటామికల్‌ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది.
►భావోద్వేగాలకు త్వరగా లోనయ్యే అవకాశలు ఎక్కువ.
►ఈ శబ్దాల తీవ్రత వల్ల కొన్ని భ్రాంతులు (ప్రైమరీ హ్యాలూసినేషన్స్‌) ఏర్పడే అవకాశం కూడా ఉంది.

జంతువుల సంరక్షణకు సూచనలు...
►పెంపుడు జంతువుల్లో కుక్కలు ఎక్కువ. బాణాసంచా మోతలకు అవి బెదిరే ప్రమాదం ఎక్కువ.  అప్పుడే పుట్టిన పసికూనలు పటాసుల శబ్దంతో బెదిరిపోతాయి.
►పెద్దగా పేలే శబ్దాలతో కుక్కలకు సౌండ్‌ ఫోబియా వచ్చి అన్నం తినడం మానేస్తాయి. ఆ తర్వాత చాలా రోజులు దిగులుగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి పెంపుడు జంతువులను, పేలుళ్లు వినిపించే ప్రాంతం నుంచి  శబ్దాలు తక్కువగా వినిపించే గదుల్లోకి తీసుకెళ్లాలి.
►పాడి గేదెలు వాటి పిల్లలపైన లేగదూడలు సైతం శబ్దాల ప్రభావానికి గురవుతాయి. పాడిగేదెలు కట్లు తెంపుకొని పారిపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఒకేసారి కట్లు తెంపుకున్న జంతువులు వీధుల్లోకి వస్తే ప్రమాదమే.
►వీధుల్లో తిరిగే కుక్కలు పిల్లుల వంటి స్ట్రే యానిమల్స్‌ విషయంలోనూ ఇదే జరుగుతుంది.
►ఒక్కోసారి థౌజెండ్‌వాలా లాంటి టపాసులు చాలా సేపు అదేపనిగా చిటపట మోగుతూనే ఉంటాయి. దాంతో పెంపుడు జంతువులు మాత్రమే గాక... చెట్లపై ఉండే పక్షులూ బెదిరిపోతాయి. అవి బెదిరి ఎగిరే సమయాల్లో ఒక్కోసారి బైక్స్‌ మీద వెళ్లేవారిని ఢీకొంటే మనుషులకూ ప్రమాదం.
►ఒక్కోసారి పక్షుల గుండె ఆగిపోయి చెట్టు మీది నుంచి నేల మీదికి రాలిపోవచ్చు.
►రాకెట్ల వంటి బాణాసంచాను చెట్లపైకి వదలకూడదు. అవి తాకి వాటి పక్షుల ప్రాణాలు పోవచ్చు.
►బెదిరి చెల్లాచెదురయ్యే వేళల్లో జంతువులో ఫెన్సింగ్‌లలో చిక్కుకుపోవడం, గాయపడటం జరగవచ్చు.
►చెట్ల మీద గూటిలో ఉండే తల్లిపిట్టలు రాలిపోతే గూళ్లలో కళ్లుతెరవని పిట్టపిల్లలకు పేరెంట్స్‌ను దూరం చేసినట్లే. పెద్ద పక్షుల ఉసురు తీసి పిల్లపక్షులను అనాథలను చేసి ఆ ఉసురు మనం పోసుకున్నట్లే!

మరిన్ని వార్తలు