సైకోలాగా టార్చర్‌ చేసేది

12 Dec, 2019 15:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాది విజయనగరం జిల్లాలో ఒక చిన్న గ్రామం. నా చిన్నప్పటినుంచి మా ఇంటి దగ్గరలో ఉండే అమ్మాయంటే తెలియని ఇష్టం. కానీ, చిన్న వయసులోనే వాళ్లు మా ఊరు వదిలివెళ్లిపోయారు. 8 సంవత్సరాల తర్వాత ఊహించని విధంగా వాళ్లు మా మళ్లీ మా ఊరికి వచ్చారు. నేను అప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. ఆ వయసులో తన మీద ఉన్న ఫీలింగ్స్‌ను ప్రేమ అని అనుకోలేకపోయా. నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరినపుడు తను పదవ తరగతి. తనను చూడాలనిపించి వాళ్ల ఇంటికి వెళ్లాను. తెలిసిన వాళ్లే కనుక ఇబ్బందిపడలేదు. నాకు చదువు మీద ఆసక్తి చాలా తక్కువ. కానీ, ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. తను ఇంటర్‌కు రాగానే ఓ రోజు ఫోన్‌ చేసి ‘నేనంటే నీకు ఇష్టమా’ అని భయపడుతూ అడిగాను. అప్పుడు తను ఏమీ చెప్పలేదు. కొద్దిరోజుల తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లాను.

అప్పుడు తను డైరెక్ట్‌గా అడిగింది ‘నేనంటే నీకు ఇష్టమా!’ అని. నేను అవునని చెప్పాను. తనకు కూడా నేనంటే ఇష్టం అని చెప్పింది. తనను పెళ్లి చేసుకోవటానికి కష్టపడి గల్ఫ్‌లో జాబ్‌ సంపాదించా. జాబ్‌లో జాయిన్‌ అయిన తర్వాత తనతో ఒకసారి మాట్లాడాను. తను చాలా హ్యాపీగా ఫీలయింది. నన్ను చూడాలనిపిస్తోందని అనే సరికి ఆరునెలల్లో ఇండియా వచ్చాను. వాళ్ల ఇంట్లో, మా ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పాం. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇంకో మూడు, నాలుగు సంవత్సరాల్లో పెళ్లి కూడా చేస్తామన్నారు. చాలా ప్రేమగా ఉండేవాళ్లం. రోజూ ఫోన్‌లో చాలా సేపు మాట్లాడుకునే వాళ్లం. సంవత్సరం అయ్యేసరికి తను నాతో మాట్లాడటం తగ్గించేసింది. ఒక రోజు నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని చెప్పింది. ప్రాణం పోయినట్లు అనిపించింది. నేను మళ్లీ జాబ్‌కు వెళ్లిపోయాను. తన జ్ఞాపకాలతో గడిపేవాన్ని. ఆరునెలల తర్వాత మళ్లీ కాల్‌ చేశాను.

తన మాటలను బట్టి తను వేరేవాళ్లను లవ్‌ చేస్తోందని అర్థం అయ్యింది. కానీ, తన మీద ఉన్న ప్రేమని చంపుకోలేకపోయాను. మా బ్రేకప్‌ అయి మూడు సంవత్సరాలు అవుతోంది. తనను తలుచుకోని రోజు లేదు. తన కోసం బాధపడని నిమిషం లేదు. ఒకరోజు వాళ్ల తమ్ముడికి కాల్‌ చేసి మాట్లాడుతున్నపుడు తను సడెన్‌గా ఫోన్‌ తీసుకుని మాట్లాడింది. ఆ రోజు నా సంతోషానికి అంతులేదు. ఆ రోజు మా కొలీగ్స్‌ అందరికీ చాలా పెద్ద పార్టీ ఇచ్చాను. అలా కొద్దిరోజులు తనకు కాల్‌ చేస్తూ ఉండేవాడ్ని. ఒకరోజు తను నాతో ఉండాలనిపిస్తోందని చెప్పింది. నేను మళ్లీ ఆక్సెప్ట్‌ చేశాను. ఎందుకంటే తనే నా ప్రాణం. ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసింది తనకోసమే కాబట్టి.  మా బ్రేకప్‌ తర్వాత మా రెండు ఫ్యామిలీస్‌ మాట్లాడుకోలేదు. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం అని తెలిసి మళ్లీ మా ప్రేమను అంగీకరించారు. వాళ్ల నాన్న మా పెళ్లి గురించి మాట్లాడినపుడు కట్నం అడిగారని నాకు ఫోన్‌ చేసి చాలా బాధపడింది.

 ‘నాకు ఎలాంటి కట్నం అవసరం లేదు! నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండవు’ అని చెప్పా. వాళ్లు చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ఒకరులేకుండా మరొకరం బ్రతకలేము అనుకునే వాళ్లం. 18 నెలలు అలానే ఉన్నాం. కానీ, మధ్యలో ఒకరోజు తను గతంలో లవ్‌ చేసిన అబ్బాయితో ఇంకా టచ్‌లో ఉందని తెలిసింది. చాలా బాధపడ్డాను. తనని అడిగితే ‘ కాంటాక్ట్‌లో ఉండకతప్పలేదు. నా ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ అయ్యేవరకు అవసరం ఉంటుంది. ఆ వెంటనే అతడి కాంటాక్ట్‌ డిలేట్‌ చేస్తాను. లేకపోతే కాలేజ్‌లో ఇబ్బంది పెడతాడు’ అని చెప్పింది. సరే అన్నాను. తను నాతో ఉంటే చాలు అని చెప్పాను. తన ఇంజనీరింగ్‌ అయిపోయాక అడిగాను తన కాంటాక్ట్‌ డిలేట్‌ చేయమని. తను నా మాట వినలేదు. రోజుకు ఒకరకంగా టార్చర్‌ చేసింది. నా ఫ్రెండ్స్‌ అందరూ తను నీకు కరెక్ట్‌ కాదు, వదిలేసెయ్‌ అని చెప్పారు.

అయినా తన మీద ఉన్న ప్రేమ తగ్గేది కాదు. ఒక సైకోలాగా టార్చర్‌ చేసేది. అన్నిటిని తట్టుకున్నా. తనకు నేనంటే ఇష్టం లేదని చెప్పేటప్పుడు చాలా బాధపడేవాడ్ని. ఆ తర్వాత తను నన్ను పూర్తిగా అవాయిడ్‌ చేసింది. కొన్ని రోజుల తర్వాత తన కోసం మా అమ్మానాన్నలను ఎంత బాధపెడుతున్నానో అర్థం చేసుకున్నా. వాళ్లు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నా పెళ్లికి నెల రోజుల ముందు తను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అలా తను నన్ను లైఫ్‌లో రెండుసార్లు మోసం చేసింది. తను నన్ను మోసం చేసినందుకు ఎప్పుడో చనిపోవాలనుకున్నా. మనల్ని వద్దు అనుకునే వాళ్లకోసం చనిపోవటం కంటే, మనల్ని నమ్ముకున్న వాళ్లకోసం బ్రతకాలి అని తెలుసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయికంటే ఎక్కువ ప్రేమగాఉంది. 
- బాలు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు