నా జీవితంతో తెగిపోని అనుబంధమా... ఓ నా ప్రియతమా!

28 Jan, 2020 15:05 IST|Sakshi

విరించి, తెగ తపించి, మలచిన అందమా , నా జీవితంతో తెగిపోని అనుబంధమా, ఓ నా ప్రియతమా.  నీకోసమే ఈ పలుకులు , నా మది వర్షించిన తేనే చినుకులు.  ఇలా చాలానే రాసుకున్నాను తన గురించి. మాది చిన్ననాటి నుంచి  మొదలైన ప్రేమ.  మా వయసులా మా ప్రేమ కూడా  పెరిగి పెద్దదయ్యింది.  అప్పుడు మా వయ​సులు 25. కులం జులం నాకు తెలిసొచ్చిన రోజులు అవి. 

మా ప్రేమ గురించి వాళ్ళ పెద్దలతో మాట్లాడాను. అందరిలానే కులాలు కలవవు అని కాదన్నారు.  నా కులం, నా అప్పటి ఆర్థిక స్థితినే వాళ్లు చూశారు, తూలనాడారే కానీ, నా చదువు, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. తనని అడిగాను నాతో వచ్చేయమని పెద్దల్ని ఎదిరించే  ధైర్యం లేదో  మరింకేమో తెలియదు కానీ  నాకు నువ్వూ కావాలి మావాళ్లు కావాలి ఇదే తన సమాధానం. కొన్నాళ్లకు కబురొచ్చింది తనకు పెళ్లి అని, మళ్లీ అడిగి చూశాను తనని. నీ సంపాదనతో నువ్వే బ్రతకలేవు(అప్పటికే నేను ఒక ప్రభుత్వ విభాగంలో ఉద్యోగం చేస్తున్న) నన్ను ఏమి పెట్టి పోషిస్తావు అంది. 

 తనమాటలు నాలో పట్టుదల, సాధించాలి అనే కసిని రగిలించాయి. రెండు సంవత్సరాలు సమయం ఇవ్వు అని అడిగా, సరే అన్న తనే పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి చేసుకొని తన మాటను  తుంగలో తొక్కింది. అయినా తనమీద కోపం లేదు.  మంచి స్థాయికి చేరుకోవాలి అనే కోరిక తప్ప. ఉద్యోగం వదిలి, విదేశాలకు కదిలి , ఉన్నత స్థితికి చేరాను. 

ఇప్పటికీ  తనంటే నాకు అదే ఇష్టం, అదే ప్రేమ. ఎందుకంటే నేను  ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం తనే. అందుకే తను నా జీవితంలో  ఒక మలుపు, నా గెలుపు, తొలివలపు. తను ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడ్ని కోరుకుంటూ... సెలవు

పుల్లారావు నక్కా (అబూదాబి)

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు