ఆమెకు షాక్‌ ఇద్దామనుకున్నా! కానీ..

2 Dec, 2019 16:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎలా వచ్చిందో తెలియదు కానీ, నా జీవితంలోకి వెలుగులా వచ్చింది తను. అప్పటికే లవ్‌ ఫేయిల్యూర్‌ అయి అంధకారంలో ఉన్న నన్ను తను వెలుగులోకి తీసుకొచ్చింది. నేను డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ అయిపోగానే ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కి వెళ్లి వచ్చా.  అయితే అక్కడ మొదలైంది నా లవ్‌ స్టోరీ. అప్పటి వరకు ఫ్రెండ్‌ అనుకున్నా తనని కానీ, ఆ చివరి నిమిషంలో నన్ను వదలి వెళ్లిపోయింది. తను వదలి వెళ్లిపోయిన తర్వాత నాకు అర్థం అయ్యింది. తనను నేను ప్రేమిస్తున్నానని. తను వెళ్లిపోయిన తర్వాత నాకు ఫోన్‌ కూడా చేయలేదు. కానీ, నేను తన లోకంలో తప్ప ఇక ఏ లోకంలో లేను. సడెన్‌గా అప్పుడు మెసేజ్‌ చేసింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదు. తర్వాత తనతో రోజూ మాట్లాడేవాడిని.

తన ఫోన్‌ మాట్లాడకుండా నాకు రోజు ముగిసేది కాదు. అది అలా వుండగా ఇక తనకి నేను ఫిబ్రవరి 14న ప్రపోజ్‌ చేద్దామనుకున్నా. తనకు కాల్‌ చేశాను. నా ప్రపోజల్‌తో తనకు షాక్‌ ఇద్దాం అనుకుంటే తనే నాకు పెద్ద షాక్‌ ఇచ్చింది. వేరే ఎవరో తనని లవ్‌ చేస్తున్నాడంట. అతడికి ఒకే చెప్తున్నానని అంది. ఇక ఆ క్షణం నాకు ఏడుపు ఆగలేదు. చచ్చిపోదాం అనుకున్నా. కానీ, మా అమ్మకు నేను ఒక్కడినే.. తను నా మీద పంచ ప్రాణాలు పెట్టుకుంది. అంతే చావును క్యాన్సిల్‌ చేశా. కానీ, తనతో మాట్లాడకుండా ఉండలేకపోయా. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఇక అక్కడ ఉండలేక జాబ్‌ చేసుకుందామని హైదరాబాద్‌ వచ్చేశా. కానీ, తనంటే ఇష్టాన్ని మాత్రం తగ్గించుకోలేకపోయా. సరే ఎప్పటికయినా అర్థం చేసుకుంటుందిలే అని ఒక చిన్న ఆశతో ఎదురు చూశాను.

ఇక ఆ పరిస్థితిలో నేను కోలుకోలేని స్థితికి చేరిపోయా. అయినా ఎలా చెప్పను తనకు‘నువ్వంటే నాకిష్టం’అని. పగిలిన నా హృదయాన్ని అతికించి మరీ పగుల గొట్టిన తన గురించి ఏమని చెప్పాలి. అప్పటినుంచి తను నాకు పరిచయం చేసిన నవ్వులను ఎవరో నానుంచి లాక్కొని వెళ్లిపోయినట్లు అనిపించింది. తరువాత తను వాళ్ల లవర్‌ చెప్పినట్లు వింటూ నా నెంబర్‌ను బ్లాక్‌ చేసింది. నన్ను ఒక క్యారెక్టర్‌ లేని వాడ్ని చేసింది. ఇక ఆ క్షణం మొదలైన నా కన్నీటి ధార ఇంత వరకు ఆగలేదు. నన్ను అవాయిడ్‌ చేస్తోంది. నా కాల్స్‌ లిఫ్ట్‌ చెయ్యడం లేదు. ఒక రోజు తనను మర్చిపోవటానికి డ్రింక్‌ చేశాను. ఇక నా రాత అంతే! నేను ఎవరిని ఇష్టపడినా నాకు దూరమవుతుంటారని ఫిక్స్‌ అయ్యా.

ఇక అందరితో కలవడం మర్చిపోయా. నా పనిలో నేను ఉన్నా కానీ, తనని మర్చిపోలేకపోయే వాడిని. తనని లవ్‌ చేసుంటే మర్చిపోయేవాడిని. కానీ, తనను మా అమ్మ అనుకున్నాను. కొంత కాలానికి తను మళ్లీ కాల్‌ చేసింది. చాలా హ్యాపీగా చాలా అంటే చాలా. అంతలోనే అనుమానం. మళ్లీ తను నానుంచి దూరంగా వెళ్లిపోతుందేమో అని భయం. అది గుర్తుకు రాగానే భయం వేసింది. అయిష్టంగానే మాట్లాడా కానీ, ఉన్న ప్రేమ దాచుకోలేకపోయా. నా ప్రేమను తనకు ఎలా చూపించాలో నాకు తెలియదు. అప్పుడు తను నన్ను ఓ మాట అడిగింది. ‘నేను లవ్‌ చేస్తున్న అబ్బాయి అంటే నీకు ఎందుకు కోపం’ అని.. 
నేను మౌనంగా ఉండిపోయా... 
- దేవీ ప్రసాద్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు