అతడికి ఫోన్‌ చేస్తే మేము చస్తాం!

3 Jan, 2020 10:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

2014 నుంచి తనను ఇష్టపడ్డా. ఈ స్మార్ట్ యుగంలో కూడా లవ్ లెటర్ ఇచ్చా. ఎందుకంటే మన మనసులో ఉన్న భావాలు తేలికగా, అందంగా చెప్పడానికి ప్రేమ లేఖ ఉత్తమమైనది. 2015లో లెటర్ ద్వారా నా ప్రేమను తెలియ జేస్తే! ఆ లెటర్ కాస్తా ఆ అమ్మాయితో సహా వాళ్ల అక్కలు కూడా చూశారు. ఈ కాలంలో కూడా ఈ లెటర్ ఏంది అని కామెడీ చేశారు. తర్వాత నేను ఏంటీ? ఏం చేస్తాను? అని ఎంక్వైరీ చేశారు. ఓ వైపు  చదువుతూ ఇంటి ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టు తాపీ మేస్త్రీ పని చేస్తున్న నన్ను హేళన చేస్తూ ‘ఛీ తాపీ పని చేస్తాడా’ అన్నట్టు చూశారు! కొందరితో అన్నారు కూడా. అలా అన్న మరు క్షణమే నాకు అర్థమైంది. తనకు దగ్గర కావాలంటే నేను చేసే పని మారాలి అని.

నాకు తెలిసిన అన్నయ్య వాళ్లతో చెన్నై షిప్ యార్డులో సూపర్‌ వైజర్‌గా చేరా. కానీ, తనను విడిచి దూరంగా ఉండలేక నెల రోజులకే తిరిగి వచ్చేశా. ఈ మధ్యలో సరిగ్గా జూలై 26న తన పుట్టినరోజున ప్రపోస్ చేశా.. ఒప్పుకుంది. 2016లో నా డిగ్రీ పూర్తయింది. ఆ వెంటనే ఎన్ఎసీ(నాక్‌) హైదరాబాద్‌లో మూడు నెలలు ట్రైనింగ్‌ తీసుకుని అపర్ణ కన్స్ట్రక్షన్లో జాబ్ సెలెక్ట్ అయ్యా. కొద్ది రోజుల తర్వాత తనే ఫోన్ చేసి ఎలా ఉన్నావ్? ఏంటి? అని అడిగింది. తను నాకు ఫోన్ చేయడాలు, మళ్లీ నేను తనకు చేయడాలు. వాళ్ల అక్కలు గమనించి ఇంట్లో చెప్పారు. ‘అతడికి నువ్వు ఫోన్‌ చేస్తే మేము చస్తాం!’ అని బెదిరించారు.

అప్పటి నుండి మా ప్రేమ ముగిసింది. ఆ క్షణం నుండి నేను నాలో లేను. ఓ ఆరు నెలలు తను కూడా బాగా డిస్ట్రబ్‌ అయిందట.. తిండి తినలేదట. నాకు తెలిసిన కొందరు చెప్పారు. కొన్నాళ్లకు నన్ను మరచిపోయింది. ఒక రోజు నా దగ్గరకు వచ్చి ‘నన్ను మరచిపో’ అని చెప్పి వెళ్లిపోయింది. నేను మాత్రం తన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నా. చావడానికి కూడా సిద్ధ పడ్డా కానీ, నా ఫ్యామిలీ గురించి ఆలోచించినపుడు చావాలనుకున్న కారణం చాలా చిన్నగా అనిపించింది.
- శ్రీనివాస్‌, తాండూరు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు