లాగిపెట్టి కొట్టి ‘పిచ్చిదానిలా కనిపిస్తున్నానా?’..

20 Feb, 2020 15:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజుల్లో మా ఇంటి పక్క ఇంట్లో ఓ అమ్మాయి ఉండేది. తను ఏడవ తరగతి చదువుతుండేది. ఒకే ఊరు కనుక కలిసి ఆడుకుంటూ ఎప్పుడూ సరదాగా ఉండేవాళ్లం. నేను మా ఇంట్లో అమ్మకు సహాయం చేసే వాడిని, తను నాకు సహాయం చేసేది. అలా మా మధ్య ఇష్టం చాలా పెరిగింది. తనెప్పుడూ నా కోసమే ఆలోచించేది. తనంటే ఇష్టంగా ఉండేవాడిని కానీ, ప్రేమ అని అనుకోలేదు. తను నా మీద పెంచుకుంటున్న ఇష్టం అందరూ గమనించారు! నేను తప్ప. ఆమె మా పేర్లు ఫ్లేమ్స్‌ వేసుకుని, ఆ పేపరు బ్యాగులో ఉంచుకుంది. నాకు సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా దాచుకునేది. అవన్నీ గమనించిన వాళ్ల ఇంట్లో వాళ్లు తనని నా నుండి దూరం పెట్టారు. అప్పుడు అర్థమైంది నాకు, తనని నేను ఇష్టపడతున్నానని. ఇక అప్పటినుంచి తనకు దూరంగా ఉండటం నరకంలా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నా పక్కనే కూర్చునేది. ఊర్లో అందరూ మేము భార్యాభర్తలం అనుకునేలా ఉండేది. కొద్ది రోజులకి తనని నాతో పూర్తిగా మాట్లాడకుండా చేశారు. వాళ్ల పిన్ని ఆ అమ్మాయిని కొట్టి నాకు దూరం చేసింది. 

అలా రెండేళ్లు మేము దూరంగా ఉన్నాం. తర్వాత మళ్లీ మాట్లాడింది. కానీ, ఇక మీదట మేము అందరిలో కలిసి ఉండకూడదు అని నిశ్చయించుకున్నాం. ఎవరికీ తెలియకుండానే మాట్లాడుకునేవాళ్లం. అందుకు వాళ్ల చెల్లెలు కూడా మాకు హెల్ప్‌ చేసింది. మెసేజెస్‌, కాల్స్‌ చేసుకునేవాళ్లం. మాకు ఆస్తిలేని కారణంగా తనని దూరం చేశారు. వాళ్ల మామయ్యకు ఇచ్చి పెళ్లి చేయటానికి ఖాయం చేశారు. తను అప్పటినుంచి ఏడుస్తూ ఉండేది. ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నా వయసు 19 తనను తీసుకుని వెళ్లలేను. అలా అని ఆపలేను. చచ్చిపోవాలనుకున్నా. తను కూడా అలానే అనుకుంది. ఆస్తి, వయసు కారణంగా నా ప్రేమ నాకు దూరం అయింది. ఒకసారి అడిగా నేనంటే అంత ఇష్టమా అని తను లాగిపెట్టి కొట్టింది. ‘నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎందుకు అలా అడిగావు.

ఇంకెప్పుడూ అలా అడగకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం! ఇలా అడుగుతావని నేనెప్పుడూ అనుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోను. నా ప్రాణం పోయేటప్పుడు నిన్ను తలుచుకుని చచ్చిపోతాను. ఎప్పటికీ నీ కోసమే ఆలోచిస్తూ బ్రతుకుతాను’ అంది. ఒక్కసారిగా నన్ను పట్టుకుని ఏడ్చింది. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒక అమ్మాయిని పట్టుకోవటం అదే మొదటిసారి. నా లైఫ్‌లో ఆరోజుని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అడిగా ‘మరి నాతో వచ్చేయొచ్చు కదా’ అని. తను రాను అంది. ఏం అంటే ‘మా ఇంట్లో వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. నా మూలంగా వాళ్లు అవమానపడకూడదు.’ అంది. ‘మరి నన్ను ఎందుకు ఇష్టపడ్డావు’ అన్నాను. ‘ నా లైఫ్‌ అంతే! ఈ జన్మకు ఇలా అవ్వాలని రాశాడేమో దేవుడు’ అంది.

చాలా బాధగా అనిపించింది. అప్పుడు తనో కోరిక కోరింది. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని. ‘అదేంటీ?’ అన్నా. ‘ఎవరికీ తెలియకపోయినా నువ్వు నా వాడివి అనే ఫీలింగ్‌ నాకు చాలు. నువ్వు నన్ను చేసుకో’ అంది. తన బర్త్‌డే రోజు బొట్టు పెట్టించుకుంది. ‘నా బర్త్‌ డే అని కాకుండా నువ్వు బొట్టు పెట్టిన రోజుగా గుర్తుంచుకుంటా’ అని ఏడ్చింది. ‘ఇలానే ఉండిపోవాలని ఉంది. ఇంకో జన్మంటూ ఉంటే నీతో ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా’ అని అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రేమంటే ఎదుటి వ్యక్తి కళ్లల్లోనే తెలుస్తుంది. తన కళ్లు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నాయని నాకు చెబుతాయి. తన కళ్లు చూస్తే ఆ కళ్లు నా కోసం బాధపడుతున్నాయని నాకు అర్థం అవుతుంది. ఇంకో లైఫ్‌ ఉంటే నువ్వు నాతో లైఫ్‌ లాంగ్‌ ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ప్రేమించే నీ ప్రేమని, ఐ మిస్‌ యూ బంగారం!
 - స్వామి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు