ప్రేయసికి స్నేహితుడితో పెళ్లని తెలిసినా..

29 Oct, 2019 17:15 IST|Sakshi

నాలుగో తరగతి చదువుతున్న రోజులవి. మా స్కూల్‌లో ఓ కొత్త అమ్మాయి చేరింది. ఊహ కూడా తెలియని ఆ వయసులో ఏంటో తెలియదు కానీ తొలిచూపులోనే ఆమె తెగ నచ్చేసింది. రోజులు గుడుస్తున్న కొద్ది మేము మంచి స్నేహితులుగా మారాము. ఆమె మా ఇంటికి కూడా వచ్చేది. చదువు విషయంలో ఒకరికి ఒకరం సహాయం చేసుకునే వాళ్లం. ఎందుకో ప్రతి రోజు ఆమెను చూడాలనిపించేది. పదో తరగతి తర్వాత పైచదువుల కోసం నేను హైదరాబాద్‌ వెళ్లాను. ఆమె స్థానికంగా ఉన్న కాలేజీలోనే చదువుకుంది. నేను ఆమెను, ఆమె నన్ను ఒకరిని ఒకరం చాలా మిస్సయ్యే వాళ్లం. ఫోన్‌లలో గంటల తరబడి మాట్లాడుకునే వాళ్లం. కొన్ని ఏళ్ల తర్వాత, ఆమెపై నాకున్న ప్రేమను మెసేజ్‌ రూపంలో వ్యక్తపరిచాను. నువ్వు నాకుతోడుగా లేకపోతే బతకలేనని చెప్పా. ఆ మెసేజ్‌ చూసినా ఆమె నుంచి బదులు రాలేదు. నాకు చాలా బాదేసింది. అయితే ఆదే రోజు రాత్రి తన నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. నాకు కూడా నువ్వంటే ఇష్టమే కానీ, మన కులాలు వేరు. మన ప్రేమ వ్యవహారాన్ని ఇద్దరి కుటుంబాల్లో ఒప్పుకోరు అంది.


తను కూడా నన్ను ప్రేమిస్తుందని, నన్ను ఎప్పటి మర్చిపోలేనని మెసేజ్‌ చేయడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కులాలు వేరైనా మన వివాహం జరుగుతుందని తనతో చెప్పా. దానికి తను కూడా సరేనంది. మరో మూడేళ్లు గడిచిపోయాయి. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దానికి ఆమె ఎంతగానో సంతోషించింది. వివాహం విషయమై తన తండ్రితో మాట్లాడాలంది. నువ్వే మందు మీ ఇంట్లో ఈ విషయం గురించి మాట్లాడు, తర్వాత నేనే వచ్చి నచ్చచెబుతా అని చెప్పా.

తన తండ్రి మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ కూడా. ఆయనగనుక ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి ఇద్దరం కలిసి పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పా. కానీ, దానికి ఆమె అంగీకరించలేదు. అప్పటికే వాళ్ల నాన్న ఆమెకి పెళ్లి సంబంధాలు తేవడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసి, మీ నాన్నతో ఎందుకు మన విషయం చెప్పడంలేదని, కోపంతో గట్టిగా అరిచా. అప్పటి నుంచి దాదాపు నాలుగు నెలలు మేమిద్దరం మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఓ రోజు తను ఫోన్‌ చేసి ఇంటికొచ్చి వాళ్ల నాన్నతో మాట్లాడమని చెప్పింది. ముందుగా నువ్వే మీ నాన్నతో మన విషయం చెప్పు, ఆ తర్వాత నేనొచ్చి మాట్లాడతా అని తేల్చి చెప్పా. ఏడుస్తూ ఫోన్‌ కట్‌ చేసింది.  


కొన్ని రోజుల తర్వాత ఆమె పెళ్లి ఫిక్స్‌ అయింది. అది కూడా మా ఇద్దరికి బాగా పరిచయం ఉన్న స్నేహితుడితోనే అని తెలిసింది. మా ప్రేమ వ్యవహారం వాడికి తెలియదు. వారం రోజుల్లో పెళ్లి అనగా, ఆమె నుంచి ఫోన్‌ వచ్చింది. మా నాన్నతో మన విషయం చెబుతా, ఒకవేళ ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకుందాం అని అంది. ఆ క్షణంలో నా నోట్లో నుంచి మాటలు రాలేదు. ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగాయి. సరే అని చెప్పలేక ఏడుస్తూ ఉండిపోయా. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా కానీ, నా స్నేహితుడికి కాబోయే భార్యతో పారిపోయి పెళ్లి చేసుకోలేనని చెప్పా. దాదాపు నాలుగు గంటలకుపైగా ఏడుస్తూనే ఇద్దరం మాట్లాడుకున్నాం. నా స్నేహితుడితోనే తన వివాహం అయింది. ఆ తర్వాత వాళ్లు టెక్సాస్‌ వెళ్లిపోయారు. అప్పుడప్పుడూ ఆమెతో జరిగిన మెసేజ్‌ సంభాషణలను చూస్తూ సరదాగా గడచిన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఏడిచేవాడిని. 

కొన్ని రోజులయ్యాక మా బంధువుల సంబంధం వచ్చింది. పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే వద్దని చెప్పా. వాళ్ల నాన్న సలహాతో తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడా, నా గతం ఏదైనా తనకు అవసరం లేదు అంది. భవిష్యత్తులో మాత్రం తనతో బాగా ఉంటే అదే చాలు అంది. తర్వాత కొన్ని నెలలు గడిచాక నన్ను భరించే ఓపిక ఉంటే పెళ్లి చేసుకుందామని తనతో చెప్పా. గత ఆగష్టులో మా ఇద్దరి వివాహం జరిగింది. అన్ని కోల్పోయాను అనుకున్న నాకు జీవితం మీద ఆశ చిగురించేలా చేసింది తను. ఇప్పుడు మాకో అందమైన బాబు కూడా ఉన్నాడు.

లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు