దీపావళి : ఉత్తర, దక్షిణ భారతాల్లో తేడాలు

22 Oct, 2019 14:34 IST|Sakshi

సాక్షి : దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. హిందువుల పండుగలలో  దీపావళి ప్రత్యేకమైనది. చెడుపై మంచి గెలిచిన దానికి ప్రతికగా ఈ దీపావళిని జరుపుకుంటారు. దీపావళి పండుగ పేరు వినగానే టక్కున గుర్తోచ్చేవి టపాసులు, స్వీట్స్‌, దీపాలు, కొత్త బట్టలు. కానీ అవే కాకుండా వ్రతాలు, పూజలు అని ఇంకా చాలా ఉన్నాయ్‌. దీపావళి అంటే చిన్న, పెద్ద, పేద, ధనిక,  అనే వర్గం లేకుండా భారత ప్రజలంతా ఉత్సహంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో నాలుగు నుంచి ఐదు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా మన దక్షిణా భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో దీపావళిని జరుపుకోవడంలో కొన్ని తేడాలున్నాయి.

తేడాలు - పోలికలు
ఉత్తర భారతంలో ఈ పండగను ఐదు రోజులు జరుపుకుంటే దక్షిణంలో నాలుగు రోజులు జరుపుకుంటారు. పేరు కూడా ఉత్తరంలో దీవాళి అంటే దక్షిణంలో దీపావళి అని అంటారు. రెండూ ఒకటే పండుగను సూచిస్తాయి. ఉత్తరంలో ధన్‌తెరాస్‌ పండుగకు బంగారం కొనడం సెంటిమెంట్‌. ధన్‌ అంటే ధనము. తేరాస్‌ అంటే పదమూడో రోజు అని అర్థం. పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చే క్రమంలో పదమూడో రోజు దీపావళి పండుగ ప్రారంభమవుతుందని దాని అర్ధం. దక్షిణంలో ఆ సంస్కృతి మొదట్లో లేదు. కానీ ఇప్పుడిప్పుడే సౌత్‌లో కూడా బంగారం కొంటున్నారు. దీనికి ఉత్తరాది ప్రజలు దక్షిణాదికి వలస రావడం కారణం కావచ్చు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆత్మీయులను, బంధువులను పిలిపించి ఆతిథ్యమివ్వడం, స్వీట్లు, తినుబండారాలు, పిండివంటలు, ఇంట్లో దీపాలు వెలిగించడం వరకు అంత ఒకేలా ఉంటాయి. దాంతో పాటు టపాసులు, చిచ్చుబుడ్లు పేల్చడం నేడు దేశమంతా సాధారణమైపోయింది.
 
అసలు దీపావళి పండుగను మొదటినుంచీ ఉత్తర భారతంలోనే చాలా ప్రత్యేకంగా జరపుకుంటారు. లక్ష్మీదేవీకి నిష్టగా పూజలు,  వ్రతాలు చేసుకుని ఆ తర్వాత వారి బంధుమిత్రులను పూజలకు, వ్రతాలకు ఆహ్వానించడం, ఆ తర్వాత అంతా కలిసి ఒక చోట చేరి సాయంకాలం టసాసులు పేల్చి ఆనందోత్సహాలతో దీపావళి వేడుకను జరుపుకుంటారు. అలాగే మన దక్షిణ భారతంలో కూడా మొదటినుంచి పూజలు, వ్రతాల సంస్కృతి ఉన్నప్పటికీ బంధుమిత్ర సమేతంగా ఉత్తర భారతీయులు జరుపుకనేంత ప్రత్యేకంగా జరుపుకునే వారు కాదు. బంధుమిత్రులతో కలిసి కాకుండా వారి కుటుంబాలతో మాత్రమే జరుపుకునే వారు. మన దక్షిణాదిన దీపావళి పండుగకు చేసుకునే నోములు, వ్రతాలు వంటి వాటికి వారి కుటుంబీకులు తప్ప వేరే వారు ఉండకూడదన్న నమ్మకంతో ఉంటారు. కానీ ఇప్పుడు  కాలానుగుణంగా ఉత్తర భారతీయులను చూసి వారి సంస్కృతిని మన దక్షిణాది ప్రజలు కూడ అవలంబిస్తున్నారు. 

అయితే మార్వాడి వంటి కొన్ని తెగల్లో దీపావళికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఉత్తర భారతదేశంలో వీరి లాంటి జాతులు, తెగల వారికి దీపావళి రోజునే కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. దక్షిణ భారతదేశం, పశ్చిమ బెంగాల్‌ వంటి ప్రాంతాల్లో దసరాకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఉత్తరాది వారికి దీపావళి అలాంటిది. ఆహారం విషయానికొస్తే సాధారణంగా ఏ పండుగకైనా ఇంట్లో మాంసాహారంతో విందు చేసుకుంటారు. కానీ, దీపావళి పండుగకు మాత్రం ఉత్తర భారతంలో పూర్తి శాఖాహారానికే పరిమితమవుతారు. దక్షిణాదిలో కూడా శాఖాహారానికే ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే దీపావళి పండుగ రోజు ప్రతీ ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తారు. దీపాలు వెలిగించి లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇదీగాక, దీపావళి ముగిసిన తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దక్షిణాదిలో ఈ మాసం ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైనది. 

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసలు ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అంటే ఏంటి?

దీపావళి: పూర్వీకుల ఆత్మలు స్వర్గం చేరేలా..

ఆనందాల వెలుగులు నిండాలి

ఇవి లేకుంటే దీపావళి అసంపూర్ణం

వెలుగు పువ్వుల దిబ్బు దిబ్బు దీపావళి