మీ పార్ట్‌నర్‌తో ఇవి చర్చించకండి

7 Dec, 2019 12:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఓ జంట మధ్య బంధం ధృడంగా ఉండాలంటే వారి మధ్య చక్కని కమ్యూనికేషన్‌ అవసరం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిలేషన్‌లో ఉన్నపుడు మనకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను ఎదుటి వ్యక్తితో పంచుకోవాలనిపిస్తుంది. అయితే కొన్ని కొన్ని విషయాలను భాగస్వామితో చర్చింకపోవటమే మంచిదంటున్నారు సైకాలజిస్టులు. ఎదుటి వ్యక్తికి బాధ కలిగించే లేదా కోపం తెప్పించే విషయాలను చర్చించటం ద్వారా బంధం బలహీనపడుతుందంటున్నారు. నోటిలో ఫిల్టర్‌ లేకుండా.. ఏదీ దాచుకోకుండా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందంటున్నారు.

1) కుటుంబసభ్యులు
భాగస్వామి కొన్ని కొన్ని సార్లు మనకంటే ఎక్కువగా తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నపుడు కొద్దిగా కోపం రావటం సహజం. రోజులు గడుస్తున్న కొద్ది అది మనలో ఏదో తెలియని అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. ఆ ఫ్యామిలీ మనకు బొత్తిగా నచ్చకపోవచ్చు కూడా. అలాంటి సమయంలో పార్ట్‌నర్‌ కుటుంబసభ్యుల గురించి, వారిలో మీకు నచ్చని విషయాలను గురించి వారితో చర్చింకపోవటం మంచిది. ఒకవేళ వారి గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే మటుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది. 

2) బెస్ట్‌ ఫ్రెండ్‌ రహస్యాలు
మనకో బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉన్నాడంటే మన కష్టమైనా, సుఖమైనా వారితో పంచుకుంటాం. మన జీవితంలో చోటుచేసుకునే ప్రతి చిన్న విషయాలను వారికి చెబుతాం. ఆ విధంగానే మన ఫ్రెండ్‌ మనతో వారి జీవితానికి సంబంధించిన ఏవైనా రహస్యాలు మనతో పంచుకున్నపుడు వాటిని భాగస్వామితో చర్చింకపోవటం ఉత్తమం. ఎందుకంటే బంధం అనేది నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. మనల్ని నమ్మిన వాళ్ల రహస్యాలను ఇతరులతో పంచుకోవటం అంటే ఒకరకంగా నమ్మక ద్రోహం చేయటమే. ఏదైనా సందర్భంలో మన బెస్ట్‌ ఫ్రెండ్‌ రహస్యాలను పార్ట్‌నర్‌తో షేర్‌ చేసుకుంటే. మన భాగస్వామికి మనపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఎందుకంటే రేపటిరోజు తమ జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పక్కవారితో చర్చిస్తారనే భావన వారికి కలుగుతుంది.

3) ఆర్థిక విషయాలు
ఎదుటి వ్యక్తికి సంబంధించిన ఆర్థిక విషయాలు ముఖ్యంగా సంపాదన లేదా వారి ఖర్చుల గురించి చర్చించకండి. ఎందుకు ఖరీదైన వస్తువులు కొంటున్నారు? బయటికెళ్లినపుడు డబ్బును నీళ్లలా ఖర్చుపెడుతున్నారెందుకు? అంటూ క్లాసులు పీకి వారికి విసుగు తెప్పించకండి. పరిస్థితులను బట్టి ముందుకు సాగండి

4) మాజీలు 
గతం తాలూకూ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రస్తుతమనే తీపిని కోల్పోవద్దు. మీ పార్ట్‌నర్‌కు గతంలో ఓ లవర్‌ ఉండి ఉంటే మీకు కోపం వచ్చినపుడుల్లా వారిని గుర్తుచేస్తూ సూటిపోటి మాటలతో వేధించకండి. పదేపదే వారిని గుర్తు చేస్తూ విలువైన మీ ఇద్దరి సమయాన్ని వృధా చేసుకోకండి. 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు