మరణం మరణించిన వేళ...

12 Apr, 2020 15:38 IST|Sakshi

ఈస్టర్‌

నేడు ప్రపంచంలోని క్రైస్తవులంతా ఈస్టర్‌ పండుగను భక్తి పారవశ్యంతో జరుపు కొంటున్నారు. సమాధిని గెలిచి లేచిన క్రీస్తు శక్తిని తలపోసుకుంటూ ఆయన దివ్యనామాన్ని స్మరించుకొంటూ తరిస్తున్నారు. యేసును మదిలో నిలుపుకుంటే ఇక కొరతేదీ లేదు అంటూ ఆయన ఘననామాన్ని కీర్తిస్తున్నారు. యేసు ప్రభువును సమాధిచేసి ఎవరి గృహాలకు వారు వెళ్లిపోయారు. రోమన్‌ సైనికులంతా సమాధి ముందు కాపలాగా ఉన్నారు. శిష్యులు వచ్చి యేసు దేహాన్ని ఎత్తుకుపోయి మృతులలోనుండి యేసు లేచాడని ప్రచారం చేసే అవకాశానికి అడ్డుగా నిలుచున్నారు. ఆదివారం ఉదయాన్న ప్రపంచ మానవ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన ఉత్కృష్టమైన వైభవమైన కార్యం జరిగింది. అదే యేసు పునరుత్థానం. ఉత్థానము అంటే లేపబడుట. పునః అనగా తిరిగి. పునరుత్థానము అనగా మరణాన్ని జయించి తిరిగిలేచుట. 

యేసు పునరుత్థానము జరిగిన ఆ రోజు... ఎన్నో ఏళ్ళుగా తన కబంధ హస్తాలలో  బంధించి, నిష్కర్షగా మనుషులను కబళిస్తున్న మరణం మరణించింది. మరణ మృదంగం మూగబోయింది. మనుష్యులను వారి కలలను, వారి ఆశయాలను మూసిపెడుతున్న సమాధి శాశ్వతంగా తెరవబడింది. తాండవమాడుతున్న దుష్టశక్తుల మీద ఖచ్చితంగా ఏనాటికైనా పైచేయి సాధించవచ్చని ఋజువుచేయబడింది. సకల చరాచర సృష్టిని చేసిన దేవునికి అసాధ్యమైనదేదీ ఉండదని తేలిపోయింది. సత్యాన్ని సమాధిలో పెట్టగలం కానీ దానిని ఎక్కువకాలం దానిలో ఉంచలేమన్న ద్విగుణీకృతమైన విషయం బట్టబయలైంది. నిరాశలోనుండి నిరీక్షణ యుగంలోనికి మానవజాతి అడుగుపెట్టింది.

ఆవేదనాభరితమైన ప్రతి ప్రశ్నకు సర్వలోకనాథుని పునరుత్థానం అత్యున్నత సమాధానాలను అనుగ్రహించి తన భక్తులను ఆనంద పారవశ్యంతో నింపింది. అంతరంగంలో అద్వితీయమైన కాంతి వింతవింతగా నిండి బతుకంతా నిత్యనూతనమయ్యింది. మానవత్వం దైవత్వంతో నిర్విరామంగా సహవసించడానికి పునాది పడింది. నాలుగు సంవత్సరాలు చాలా కష్టపడి చదివి యూనివర్సిటీలోనే మొదటి స్థానంలో నిలిచి తన కష్టానికి ప్రతిఫలంగా తనచేతికి అందిన సర్టిఫికెట్‌ను చేతపట్టుకొని తన ఆనందాన్ని కడుపు కట్టుకొని ఈ స్థానానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులతో పంచుకోవాలన్న ఆశతో గ్రామానికి ప్రయాణమయ్యాడు ఓ ఇంజనీరు. ఫోన్లు పెద్దగా అందుబాటులోనికి రాని ఆ రోజుల్లో ఎర్రబస్సెక్కి ప్రయాణం ప్రారంభించాడు. ఓ మంచి ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి, పిల్లలతో హాయిగా గడుపుతున్నట్టుగా ఊహించుకొంటూ మెల్లగా నిద్రలోనికి జారుకున్నాడు. కాసేపటికి కఠోరమైన బస్సు హారన్‌ శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు.

మామూలుగా కన్నా ఇంకొంచెం వేగంగా తన ఇంటివైపు అడుగులు వేయసాగాడు. తన తాత కట్టించిన చిన్న పెంకుటిల్లు ముందు జనాలు గుమిగూడి ఉన్నారు. చాలా కాలం తర్వాత నా కుమారుడు వస్తున్నాడని తల్లి చెప్పడం ద్వారా తనను చూడడానికి ప్రజలు వచ్చియుండొచ్చు అని అనుకుంటూ ఇల్లు సమీపించే సరికి తన ముద్దుల చెల్లి విగతజీవిలా పడివుంది. గుండెలవిసేలా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ‘‘అన్నయ్యా త్వరగా వచ్చేయి. నిన్ను చూడాలని ఉంది’’ అని చెల్లి రాసిన ఉత్తరం మూడు రోజుల క్రితమే అందింది. బరువెక్కిన గుండెతో వెక్కి వెక్కి ఏడ్చాడు. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఏదో తెలియని నిశ్శబ్దం ఇంటినంతా కమ్మేసింది. తమకు తోచినట్టుగా ఆదరించిన బంధువులు ఒక్కొక్కరిగా తమను విడచి వెళ్లిపోతున్నారు. 

తన మనసులో కొన్ని ప్రశ్నలు గిర్రున తిరుగుతున్నాయి. తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్న చదువులు తన ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. తల్లిదండ్రులను అడిగాడు. వారి దగ్గర కూడా సమాధానాలు లేవు. ‘‘మనిషిని ఎవరు పుట్టిస్తున్నారు? మనిషి ఈ భూమ్మీద ఎందుకు బతుకుతున్నాడు? చనిపోయిన తరువాత మనిషి ఎక్కడకు వెళ్తున్నాడు?’’ ఈ మూడు ప్రశ్నలు ఆ యువకుని తొలిచేస్తున్నాయి. కలవరంతో, భారమైన హృదయంతో, మానసిక సంఘర్షణతో ఇల్లు విడచి బయలుదేరాడు. జవాబులు తెలిస్తే తిరిగొస్తా లేకపోతే నన్ను శాశ్వతంగా మర్చిపోండి అని కన్నవారికి చెప్పి పయనమయ్యాడు. బహుశా చాలామంది ఎన్నో విషయాలను గూర్చి ఆలోచిస్తారు గాని ఈ మూడు విషయాలు గూర్చి ఆలోచించరేమో. వాటిని ఆలోచించేంత సమయం నేటి మనుష్యులకు ఉందా? వాటి సమాధానాలు తెలుసుకోవడమే పరమార్థమని గ్రహించిన యువకుడు మార్గంలో తనకు తారసపడిన ఉపాధ్యాయులను, ఆధ్యాత్మిక గురువులను నిర్మొహమాటంగా ప్రశ్నించాడు. ఒక్కొక్కరి దగ్గరనుండి ఒక్కో విధమైన సమాధానం. బుర్ర వేడెక్కిపోయే విషయాలను కూడా ఓపికతో విన్నాడు. 

చివరకు ‘‘వీటికి ఈ భూమ్మీద సమాధానం లేదు. అందుకే ప్రపంచమంతా మాయ అంటారు కొందరు’’ అని తనలో తాను గొణుక్కొంటూ మార్గాయాసంతో అటుగా వెళ్తున్న ఓ ఎద్దులబండిని ఆపి కొంతదూరం వెళ్లడానికి సహాయపడమని అడిగి బండెక్కి కూర్చుంటాడు. ఆ బండి నడుపుతున్న వ్యక్తి ముఖంలో ఏదో తెలియని ప్రకాశం, ప్రశాంతత. ఇతడు బహుశా భౌతికంగా ధనవంతుడు కాకపోవచ్చు గాని ఇతడు విశిష్టమైన ఆధ్యాత్మిక కుబేరుడుగా ఉన్నాడు. ‘‘మీ ముఖంలో అగుపిస్తున్న ఆనందానికి కారణం తెలుసుకోవచ్చా?’’ అని ప్రశ్నించాడు. ‘‘తాను ఒకొప్పుడు సప్త వ్యసనాలకు బానిసగా ఉంటూ కుటుంబాన్ని ఛిద్రం చేసుకొంటున్న వేళలో యేసు జీవితం మరియు ఆయన మధురమైన ప్రేమ తనను ఎలా రక్షించాయో సవివరంగా వివరించాడు’’. తాను వెదకుచున్న ప్రశ్నలకు సమాధానాలు లభించే చోటు దొరికిందన్న సంతోషంతో కొన్ని రోజులు మీ ఇంటిలో ఉండవచ్చా? అని అడిగాడు. తప్పకుండా ఉండవచ్చు అన్న సమాధానం ఆ యువకునికి ఊరటనిచ్చింది. 

ఇంటికి చేరగానే చాలాకాలం తరువాత కడుపునిండా తృప్తిగా అన్నం తిన్నాడు. తనకున్న ప్రశ్నలను వారితో పంచుకున్నాడు. ఏదీ దాచుకోకుండా వారు తమకు తెలిసినది యువకునికి వివరించిన పిదప పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ను అతని చేతిలో ఉంచారు.  నీ మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యములో సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది అని వారు చెప్పడంతో రాత్రంతా దైవగ్రంథాన్ని భక్తితో ఆసక్తితో పఠించడం మొదలుపెట్టాడు. కృపకు రాజబాటలు వేసిన యేసు జనన మరణ పునరుత్థానములు తన మనసును హత్తుకున్నాయి. దేవుడు ఈ లోకానికి వచ్చి ఏవేవో చిన్న చిన్న బహుమానాలు కాదు ఇచ్చింది, తన విలువైన ప్రాణాన్నే బలిదానంగా సమర్పించి, మరణాన్ని జయించి తిరిగిలేచాడు. తాను చెప్పిన మాటలు మరియు తన బల్యర్పణ వాస్తవమైనవని ఆయన పునరుత్థానము ఋజువు చేసిందని విశ్వసించాడు. 

మానవుని సృష్టించినది ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నాడు. ‘మానవుడు దేవుని సృష్టి. సర్వశక్తిగల దేవుడు తన రూపములో తన పోలికలో మనిషిని కలుగచేశాడు. ఆ కారణాన్ని బట్టి సృష్టిలో గ్రహాల కన్నా, నక్షత్రాల కన్నా, పాలపుంతల కన్నా మనిషే గొప్పవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నియు మనిషి కోసమే సృష్టించబడ్డాయి. మానవుడు కలుగచేయబడిన విధానం చాలా విలక్షణమైనది. మహిమా ప్రభావములు అనే కిరీటాన్ని మనిషికి తొడిగి నీవు ఈ విశ్వాన్ని ఏలుబడి చేయాలని దేవుడు ఆదేశించాడు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం మనిషి కోతి నుండి పరిణామం చెందినవాడు కాదు. లేదా ఏదో రసాయన చర్యల ద్వారా ఉద్భవించినవాడు కాదు. దేవుని రూపంలో ఆయన దివ్య ప్రణాళికలను నెరవేర్చడానికి çసృష్టించబడినవాడు. మనిషి ఈ భూమ్మీద ఎందుకు బతుకుతున్నాడు? అనే ప్రశ్నకు సయితం సమాధానం కనుగొన్నాడు. మానవుడు జీవించే డెబ్బయి లేదా ఎనభై సంవత్సరాలు తనకు తాను ఏదో కూడబెట్టేసుకొని సంపాదించుకొని ఏదో ఒకరోజు మరణించడం కానేకాదు. మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఒక పరమార్థం ఉంటుంది. దానిని తెలుసుకొని మహోన్నతమైన దైవచిత్తానికి లోబడి పదిమందికి ఆశీర్వాదకరంగా, ఆదర్శంగా బతకడమే ఆ పరమార్థం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే దైవాజ్ఞకు లోబడడంలోనే అమితమైన ఆనంద సంతోషాలు దాగియుంటాయి. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడకు వెళ్తున్నాడు? మరణం అందరికి వస్తుంది. 

సామంతులైనా  సామాన్యులైనా, రాజులైనా రోజువారి కూలీలైనా, స్వాములైనా, సోగ్గాళ్ళైనా, ధనికులైనా, దరిద్రులైనా, అక్షరాస్యులైనా  నిరక్షరాస్యులైనా, స్త్రీలైనా  పురుషులైనా, ఒంటిచేత్తో ప్రపంచాన్ని గడగడలాడించిన వారైనా మరణం ముందు తల వంచాల్సిందే. మరణం తర్వాత ఏం జరుగుతుంది? క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఒక మనిషి మరణించిన తరువాత కూడా జీవిస్తాడు. ఈ భూమ్మీద తాను చేసిన పాపాలకు క్షమాపణ పొంది విశ్వాసం ద్వారా దేవుని నీతితో నింపబడితే మోక్షరాజ్యంలో ప్రవేశించి యుగ యుగాలు దేవుని రాజ్యములో అమరుడుగా జీవిస్తాడు. లేని పక్షంలో తన పాపాలకు శిక్షగా నరకములో వేదనను అనుభవిస్తాడు. మరణం తరువాత ఏమి జరుగుతుందో మనుష్యులకు తెలియకపోవచ్చు గాని ఆదిమధ్యాంతరహితుడైన పరమాత్ముడు ఆ విషయాలను తెలిపినప్పుడు మనిషి నమ్మాల్సిందే. ఎంతో కాలంగా చెప్పులరిగేలా ఈ ప్రశ్నలకు సమాధానాలను వెదకుచున్న ఆ యువకుని మనసు కుదుటపడింది. పరమాత్ముని గూర్చిన సత్యం బోధపడింది. సంతోషంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన సత్యాన్వేషణ ఏవిధంగా కొనసాగిందో, సత్యాన్ని ఏవిధంగా కనుగొన్నాడో చెప్పాడు. 

యేసు పునరుత్థానం చెందుట వలన తన భక్తులకు విజయానికి సంబంధించిన అనిర్వచనీయమైన భరోసా దొరికింది. ఏ దేవుడైతే తమ గుండెల్లో కొలువుతీరాడో ఆయన మరణాన్ని జయించినవాడు అని జ్ఞప్తికి తెచ్చుకొన్న ప్రతిసారి జీవితం పునీతమౌతుంది. జీవితకాలం ఆయన తమతో తోడుగా ఉంటాడన్న సత్యం వారిని ఆనంద పారవశ్యంలోనికి నడిపిస్తుంది. దుఃఖం నాట్యంగా మారుతుంది. ఓటమిలాగా కనిపించిన పరిస్థితులలో దేవుడు అసాధారణరీతిలో వారికి విజయమిస్తాడనే నమ్మకం స్థిరపడుతుంది. మరణాన్నే జయించగలిగిన దేవుడు కష్టపరిస్థితుల్లో స్మరించుకుంటే పట్టించుకోకుండా ఎందుకుంటాడు? 

దుష్టశక్తులు కొన్నిసార్లు ఊహించని రీతిలో స్థాయిలో చెలరేగిపోతుంటాయి.  అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకొనే ప్రయతాన్ని కొందరు నిర్విరామంగా చేస్తూనే ఉంటారు. శారీరకంగా, మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తుంటారు. జీవితం ముగింపు దశకు వచ్చేసిందని హేళన చేస్తారు. యేసుక్రీస్తు జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగింది. అంతా తామనుకున్నట్టుగా జరిగించారు. అబద్ధ సాక్ష్యములు పెట్టి, న్యాయం యేసు వైపు ఉన్నప్పటికి పిలాతు మనసును తమవైపు తిప్పుకొని మరణ శాసనాన్ని లిఖించారు. ఆయన మరణాన్ని కన్నుల పండువగా వేడుకగా చూశారు. విపరీతమైన బాధను అనుభవిస్తుంటే ఏదో ఘనకార్యం చేస్తున్నామన్నట్టుగా ఉప్పొంగిపోయారు. సమాధిలో పెట్టబడినప్పుడు ఒకే ద్వారం కలిగిన సమాధిముందు బరువైన రాయిని అడ్డుగా ఉంచారు. వందలాదిమంది సైనికులను కాపలాగా ఉంచారు. అయితే చివరకు ఏమయ్యింది? వారి పన్నాగాలన్ని ఏమయ్యాయి? యేసు ప్రభంజనాన్ని సమాధిముందు ఉంచిన రాయిగాని, రాటుతేలిన రాణువవారుగాని ఆపగలిగారా? అరచేతులతో సూర్యకాంతిని అడ్డుకోవడం తేలికకాదు అనే విషయం ఆదివారం ఉదయాన్నే క్రీస్తు పునరుత్థానంతో ఋజువు చేయబడింది. పైశాచికంగా తమ నోళ్లవెంబడి వడిగా వెలువడిన మాటల పిడుగుల సవ్వడి సద్దుమణిగింది. ప్రగల్భాలు పలికిన నోళ్లు మూతలుపడ్డాయి. 

ఒంటరిగా మూడురోజులు సమాధిలో ఉన్న యేసు మరణ సంకెళ్ళను తెంచుకొని బయటకు వచ్చాడు. అంతవరకు విరుచుకుపడిన అల్లరిమూకలు మూర్ఛిల్లి పడిపోయారు. అఖండ విజయం ఆయన పాదాక్రాంతమయ్యింది. దుమ్మునిండిన మనిషి హృదయదారుల్లో విజయ ప్రవాహం పరవళ్లు తొక్కింది. బంధాలకు, అప్యాయతలకు, ప్రేమకు చోటులేని సమాజంలో మనిషి కలలు కూడా సమాధిచేయబడుతున్నాయి. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిపోతున్న వారి ఆశయాలను సమాధిలో కుక్కేస్తున్నారు. యేసు పునరుత్థాన చరితను ఆకళింపు చేసుకోగలిగితే సమాధిలో కూరుకుపోయిన ఆశయాలు, ఉన్నత లక్ష్యాలు మరలా తిరిగి లేస్తాయనే భరోసా వస్తుంది. ఎంతమంది అదిమిపెట్టి పాతాళానికి తొక్కేసినా ఒకానొకరోజు అవి భూమిలోతులను చీల్చుకొని వచ్చే మహాబీజంగా శాఖోప శాఖలుగా పల్లవిస్తాయి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలగడమే నిజమైన విజయానికి నిర్వచనం. నాగలితో జీవితమనే పొలాన్ని అందరూ దున్నేసారని బాధపడడం కంటే ఆ దున్నబడిన పొలంలో విత్తనాలు వేసుకొంటూ పోవడమే సహృదయుల విశిష్ట లక్షణం. సమయం వచ్చినప్పుడు పనలు కోసుకొంటూ ముందుకు సాగిపోవడమే విజయవీరులు ప్రపంచానికి నేర్పించే పాఠం.

‘‘భయపడకుడి, ఆయన ఇక్కడ లేరు. తాను చెప్పినట్లే లేచి యున్నారు.’’ ఇదే మాట నేటికి యెరూషలేములోని యేసుక్రీస్తు సమాధిలోపల చూడగలం. ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాది. ఆ ఖాళీ సమాధి కోట్లాదిమంది హృదయాలలో ఉన్న ఖాళీని పూరించింది. చీకటిని పారదోలింది. ప్రపంచ పోకడ పరుగులోనుండి పరిశుద్ధుని జాడలోనికి మానవాళిని నడిపింది. దౌర్భాగ్యపు కన్నీళ్ళు ఆనందబాష్పాలుగా పరిణామం చెందాయి. శుభప్రదమైన నిరీక్షణ విప్పారింది. 

డా.జాన్‌వెస్లీ 
(యువ రచయిత, వక్త)
క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్, రాజమండ్రి

మరిన్ని వార్తలు