అనుభవం నేర్పే ప్రేమ పాఠాలు

16 Dec, 2019 10:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ ఒక స్వార్థంలేని భావోద్వేగం. ప్రేమలో పడ్డ ఇద్దరు వ్యక్తులు తమ ప్రేమను కాపాడుకోవటానికి ఎలాంటి కష్టాన్నైనా భరిస్తారు. అయితే ప్రేమను సక్రమంగా ఉంచుకునే జ్ఞానం అందరికీ పుట్టుకతో రాదు. బాల్యం, యవ్వనం.. ఇలా అన్ని దశల్లో మనం సాధించుకున్న జ్ఞానం ఇందుకు సహకరిస్తుంది. ప్రతీ మనిషి జీవితంలో ఒక భాగమైన ప్రేమను పాఠాలుగా ఏ స్కూల్లోనూ చెప్పకపోవటం గమనార్హం. బడి నేర్పని ఎన్నో పాఠాలను అనుభవం మనకు నేర్పుతుంది. అది ప్రేమ విషయంలోనూ వర్తిస్తుంది.

1) షరతులు లేని నమ్మకం
నిజమైన ప్రేమ అంటే షరతులు లేకుండా ఎదుటివ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మటమే. అయితే మనం తెలిసీతెలియని వయసులో ఆకర్షణకు గురై ప్రేమకు, నమ్మకానికి మధ్య ఉన్న సంబంధాన్ని మర్చిపోతాము. దీంతో ఆ బంధం ఎక్కువకాలం నిలబడకుండా వీగిపోతుంది. నమ్మకంతో కూడిన ప్రేమ బంధం మాత్రమే ఇద్దరు వ్యక్తులను కలిపి ఉంచగలుగుతుంది. 

2) ప్రేమ ఓ బలం
ప్రేమించిన వారితో సమయం గడుపుతున్నపుడు అది మనకు ఎంతో మానసిక బలానిస్తుంది. నిజమైన ప్రేమ బంధంలో ఉన్నట్లయితే ఎటువంటి కష్టనష్టాలనైనా ఎదుర్కునే శక్తిని ఇస్తుంది. మరో అద్భుతమైన పాఠం ఎంటంటే మన భాగస్వామిలోనే గైడ్‌ను వెతుక్కోవటం. మనం కష్టాల్లో ఉన్నపుడు మనకు తోడుగా ఉండేవారే మనవారు. 

3) తియ్యటి మాటలు, పైపై మెరుగులు
ఎదుటి వ్యక్తి తియ్యటి మాటలకు, పైపై మెరుగులకు ప్రాధాన్యతనిచ్చేది నిజమైన ప్రేమ కాదు. ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రాన మనసు పారేసుకోకూడదు. ఎదుటి వ్యక్తి బలాలు, బలహీనతలు, లోపాలు తెలిసికూడా ఒక్కటయ్యే బంధమే కలకాలం నిలబడుతుంది. 

4) మచ్చలేని చంద్రుడి కోసం వెతుకులాట
ఈ సృష్టిలో లోపాలులేని వ్యక్తంటూ ఎవరూ ఉండరు. అలాంటి వ్యక్తుల కోసం వెతకటం మచ్చలేని చంద్రుడి కోసం వెతుకులాటలాంటిది. అదో దండగ పని. మన లోపాలు తెలిసి కూడా మనల్ని ప్రేమించే వ్యక్తులు దొరకటం నిజంగా మన అదృష్టం. మన భాగస్వామి ఓ అద్దంలా ఎల్లప్పుడూ మనల్ని ప్రతిబింబిస్తూ ఉండాలి. 

5) గొడవలులేని బంధం?
గొడవలు పడని ప్రేమ జంట అంటూ  ఈ సృష్టిలో ఏదీ ఉండదు. ఎదుటి వ్యక్తిలో నచ్చని కొన్ని అలవాట్లు మనకు కోపం తెప్పించవచ్చు. ఆ కోపం ఇద్దరి మధ్యా గొడవకు దారి తీయవచ్చు. అయితే ఆ గొడవ ద్వారా ఇద్దరిమధ్యా బంధం మరింత బలపడాలేతప్ప బలహీనపడకూడదు. అంగీకరించటం లేదా అంగీకరించకపోవటం అన్నది బంధంలో సర్వసాధారణం. కాలం ఎప్పడూ నిజమైన ప్రేమకు పరీక్షలాంటిది. 

6) వ్యక్తిగత స్పేస్‌
ఓ నిజమైన ప్రేమ సమయాన్ని, అలసటను ఎరుగదు! నిబంధనలు, హద్దులు అంటూ ఏవీ ఉండవు. అయితే ప్రపంచం మొత్తం మనమై ఎదుటివ్యక్తిని సంతృప్తిపరచటం కష్టమైన పని. వారికంటూ వ్యక్తిగత స్పేస్‌ ఇవ్వాలి. మనం మన స్నేహితులతో, కుటుంబసభ్యులతో గడపటానికి సమయాన్ని కేటాయించగలగాలి. ఒకరి వద్దే మన ప్రపంచం ఆగిపోవద్దు.    


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు