దివికేగిన సినీ దిగ్గజాలు

26 Dec, 2019 14:56 IST|Sakshi

రౌండప్‌- 2019

2019లో సైరా నరసింహారెడ్డి, మహర్షి, ఓ బేబీ లాంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలతో కళకళలాడిన టాలీవుడ్‌ వెండితెర... పలువురు సినీ దిగ్గజాలు కన్నుమూయడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. వారిలో తెలుగు పరిశ్రమలో గ్రాఫిక్స్‌ ట్రెండ్‌ సృష్టించిన కోడి రామకృష‍్ణ, తన ప్రతిభతో గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్నతెలుగు దర్శకురాలు విజయనిర్మల, హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వేణుమాధవ్...ఇలా ఎందరో ప్రముఖులు కన్నుమూశారు. సినీ పరిశ్రమలో 2019 నింపిన విషాదాలను ఓసారి గుర్తుచేసుకుందాం.    

-కోడి రామకృష్ణ
తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రాఫిక్స్‌తో కొత్త ట్రెండ్‌ సృష్టించిన దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు తెరకెక్కించిన ఆయన ఫిభ్రవరి 22న తుదిశ్వాస విడిచారు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో దర్శకునిగా ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో వందల సినిమాలకు దర్శకత్వం వహించారు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కిస్తూనే మరోవైపు ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ లాంటి గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే చిత్రాలు తీసి  కోడి రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో నటించారు. చివరిగా క‌న్నడలో ‘నాగరహవు’ అనే చిత్రాన్ని తీసారు.

-రాళ్లపల్లి
విలక్షణ నటన, హాస్యంతో సినిమా తెరపై నాలుగు దశాబ్దాలకుపైగా అలరించిన విలక్షణ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా..నటనపై ఉన్న ఆసక్తి ఆయన్ని సినిమారంగం వైపు నడిపించింది. తెలుగులో 1973లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ నటుడిగా, ప్రతినాయకుడిగా 850కిగా పైగా సినిమాల్లో నటించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై తనదైన ముద్ర వేశారు. దాదాపు 8 వేల నాటకాల్లో నటించిన రాళ్లపల్లి.. చాలా నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణికి గురువు రాళ్లపల్లి. రంగస్థలమైనా, వెండితెర అయినా, టెలివిజన్‌ రంగం అయినా  తన నటనతో ఆ పాత్రలకి ప్రాణం పోస్తారు. హాస్యానికి కొత్త మెరుగులు, విలనిజానికి  వ్యంగాన్ని జోడించడం, క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలకు కొత్త విరుపులు, విచిత్రమైన చమత్కారాలు చేయడంలో  ఆయనకు ఆయనే సాటి. తన నటనతో, డైలాగులతో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న రాళ్లపల్లి మే 17న కన్నుమూశారు. 

-గిరీశ్‌ కర్నాడ్‌
భాషతో సంబంధం లేకుండా  బహుభాషా నటుడిగా చిత్రపరిశ్రమల ప్రజలకు గుర్తుండిపోయే నటుడు గిరీశ్‌ కర్నాడ్‌‌. అనారోగ్యంతో జూన్‌ 10న  కన్నుమూశారు. చారిత్రక, జానపద ఇతిహాసాలను సమకాలీన సామాజిక రాజకీయ అంశాలతో మిళితంచేస్తూ వైవిధ్యభరిత నాటకాలు రచించిన అపూర్వమైన కలం కర్నాడ్‌ది. దాదాపు ఐదు దశాబ్దాలపాటు నటుడిగా, దర్శకుడిగా, సామాజిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 1998లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్‌ 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ అవార్డులు ఆయన్ని వరించాయి. ఇవి కాకుండా ఏడు ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు అందుకున్నారు.

-విజయనిర్మల
వెండితెరపై ‘విజయ’కేతనం ఎగురవేసిన తెలుగింటి వనిత విజయనిర్మల. చిన్నతనం నుంచే వెండితెర ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె ప్రయాణం ఎంతో సుధీర్ఘమైనది, ఘనమైనది కూడా. అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ‘సాక్షి’ సినిమాతో మెదటిసారి కృష్ణతో జతకట్టి 47 సినిమాల్లో కలిసి నటించారు మెప్పించారు. అలా కృష్ణ- విజయనిర్మల జోడీ హిట్‌ పెయిర్‌గా నిలిచింది. అతి సాధారణ కుటుంబం, అంతంత మాత్రం చదువు కలిగిన ఆమె.. జీవితాన్ని ఎంతో సమర్థంగా, విజయవంతంగా నడిపించారు. సినిమారంగంలో ఎందరో నటీమణులకు ఆమె ధైర్యం, మార్గదర్శి. జూన్‌ 27న ఈ లోకాన్ని వదిలివెళ్లినా..ప్రజల గుండెల్లో ఆమె ఎప్పటికీ ధీర ‘విజయ’గానే గుర్తుంటుంది.

- దేవదాసు కనకాల
ఎంతో మందికి నటనలో శిక్షననిచ్చి తీర్చిదిద్దిన నట శిక్షకుడు దేవదాస్‌ కనకాల. వందకి పైగా చిత్రాల్లో సహ నటుడిగా, ప్రతినాయకుడిగా, హస్యనటుడిగా నటించారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, సహాసిని లింటి అప్పటితరం నటులనే కాకుండా శివాజీరాజా, సూర్య, రామ్‌చరణ్‌, మంచుమనోజ్‌, అల్లరి నరేష్‌ లాంటి ఈతరం నటుల వరకు ఎంతోమంది దేవదాస్‌ దగ్గరే శిష్యరికం చేసినవాళ్లే. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించడంతోపాటు.. దర్శకత్వం కూడా వహించారు. హైదరాబాద్‌లో యాక్టింగ్ స్కూల్ స్థాపించి ఎంతో మందికి నటనలో మెళకువలు నేర్పించి తీర్చిదిద్దిన దేవదాస్‌ కనకాల ఆగస్టు 2న కన్నుమూశారు.

-వేణుమాధవ్‌
హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వేణుమాధవ్‌..అనారోగ్యంతో సెప్టెంబర్‌ 25న కన్నుమూశారు.  ఏ పాత్ర చేసినా అందులో లీనమై తానో నవ్వుల వేణువై ఎన్నో కితకితలు పెట్టేవారు. కానీ 39 ఏళ్ల వయస్సులోనే ఆయన నవ్వుల ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. మిమిక్రీ ఆర్టిస్టు నుంచి కథానాయకుడి మారి నవ్వుల రాజుగా అందరి మనసులు చూరగొన్నారు వేణుమాధవ్‌. ‘సంప్రదాయం’ సినిమాతో నటుడిగా మొదటిసారి వెండితెరకు పరిచయమై దాదాపు 600 సినిమాల్లో నటించారు. వేణుమాధవ్‌కి నటుడిగా అవకాశం ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్వకత్వంలోనే ‘హంగామా’ సినిమాలో హీరోగా నటించారు. ఎన్నో చిత్రాల్లో పేరడీ సన్నివేశాలతో వినోదం పంచి..ఆయన మరణంతో అందర్నీ ఏడిపించారు. 

-గీతాంజలి
ప్రముఖ నటి గీతాంజలి అక్టోబర్‌ 31న తుదిశ్వాస విడిచారు. 14 ఏళ్ల ప్రాయంలోనే సీతారామ కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేసి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు. ‘మణి’ పేరుతో పరిచయమైన ఆమె.. గీతాంజలిగా కథానాయుకగా, చెల్లిలిగా, డాన్స్‌ టీచర్‌గా ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. వివాహం అనంతరం సినిమాలకి దూరం అయిన గీతాంజలి.. పెళ్లైన కొత్తలో సినిమాతో బామ్మగా రీ ఎంట్రీ ఇచ్చారు. 72 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కన్నుమూశారు. 

-గొల్లపూడి మారుతీరావు
నటుడు, రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత, బహుముఖ ప్రఙ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు క్యాన్సర్‌తో బాధపడుతూ డిసెంబర్‌ 12న కన్నుమూశారు. మధ్యతరగతి తండ్రి పాత్రలతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. తెలుగు తెరపై కొత్త తరహా విలనిజాన్ని ఆవిష్కరించిన ఘనత ఆయనది. 290 చిత్రాల్లో నటించిన ఆయన.. ఆరు నంది పురస్కారాలను అందుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే ‘ఆశాజీవి’ అనే కథను రాశారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు పలు వర్సిటీల్లో పాఠ్యాంశాలయ్యాయి. చేసింది చాలు అని ఏనాడు అనుకోకుండా చేయాల్సింది చాలా ఉంది అనే ఆయన తత్వం ఎందరికో ఆదర్శం. గొల్లపూడి మారుతీరావు అనే నూరు కెరటాల హోరు ఇక మీదట కనపడకపోవచ్చు, కానీ ఆయన వదిలి వెళ్లిన గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవు, చెదిరిపోవు. 

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు