నిజమైన ప్రేమ ఓడిపోదు!

5 May, 2020 18:03 IST|Sakshi

దేవుడు ఎవరికి ఎవరితో ముడివేస్తాడో పెళ్లి జరిగే వరకు ఎవరికీ తెలియదు. నా పేరు నవీన. నేను చాలా అల్లరి పిల్లని. నా చిన్నప్పటి నుంచి మా బంధువులందరూ బావని పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఏడిపించేవారు. నాకు మా బావ అంటే ఇష్టం ఉన్నా... కావాలని చేసుకోను అని చెప్పేదాన్ని. మా బావతో నేను ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదు. తనతో మాట్లాడాలి అని ఉన్న తనని చూస్తే భయంతో మాట్లాడలేకపోయేదాన్ని. నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు తనని వాళ్ల అన్న పెళ్లిలో చూశాను. చాలా సరదగా ఉండేవాడు. తన ఫ్రెండ్స్‌ అందరూ తన మీద ఎంతో అభిమానం చూపించేవారు. అది చూసి నాకు చాలా ముచ్చట వేసేది. నేను ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నప్పుడు నేను వాళ్ల అన్నయ్య పెళ్లికి వెళ్లాను. అక్కడ తనని మరోసారి కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. కానీ భయంతో ఈసారి కూడా మాట్లాడలేదు. మేం ఒకేఊరిలో ఉన్న కూడా ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. తరువాత తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నాకు తెలిసింది. నా ప్రేమను చెప్పడం ఆలస్యం అయ్యినందుకే ఇలా జరిగిందని ఎంతో బాధపడ్డాను. ఆ బాధలో నా పరీక్షలు కూడా ఫెయిల్‌ అయ్యాను. తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తనని మాత్రం నా మనస్సులో నుంచి తీసేయలేకపోతున్నాను. నేను కాలేజీకి వెళ్లేటప్పుడు రోజు తను పేపర్‌ చదువుతూ కనిపించేవాడు. నేను తనని చూస్తూ ఉంటే తన మీద ప్రేమ పెరుగుతూ ఉండేది. నేను పై చదువుల కోసం వేరే ఊరికి వెళ్లాను. నా పుట్టిన రోజు నాడు తన ఫోన్‌ నుంచి మొదటి మెసేజ్‌ వచ్చింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు మరదల్‌ అని పెట్టాడు. ఆ మెసేజ్‌ చూడగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న విషయం కూడా మర్చిపోయాను. థ్యాంక్యూ బావ అని రిప్లై ఇచ్చాను. తను నువ్వు నన్ను బావ అని పిలవడం ఇదే మొదటిసారి కదా అని స్మైలీ సింబల్‌ పెట్టాడు. తరువాత నాతో రోజు మాట్లాడేవాడు. నేను తను ప్రేమించిన అమ్మాయి గురించి అడిగితే తను చెప్పే మాటల్లో తను ఆ అ‍మ్మాయిని ఎంతలా ఇష్టపడుతున్నాడో అర్థం అయ్యేది. (తను చనిపోయాడు అనుకున్నాను, కానీ...!)

కొన్ని రోజులకు మా ఇంట్లో ఒక సమస్య వస్తే తను మాకు అండగా నిలబడ్డాడు. మాకు సాయం చేశాడు. అప్పుడు మా ఇంట్లో వాళ్లు బావని పెళ్లి చేసుకుంటావా? బావ నిన్ను చేసుకుంటా అంటున్నాడు అని అడిగారు. నా మీద జాలితో నన్ను చేసుకోవాలనుకుంటున్నాడని నాకు చాలా కోపం వచ్చింది. నేను చేసుకోను అని చెప్పాను. తరువాత వాళ్ల అక్క నా దగ్గరకు వచ్చి బావ ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయిందని మా బావని చేసుకోమని అడిగింది. అది తెలిసి నేను మా బావ దగ్గరకి వెళ్లి తనని ఓదార్చాను. కొన్ని రోజులు ఫ్రెండ్స్‌గా ఉన్నాం. తరువాత మా బావ కూడా నన్ను ఇష్టపడటం మొదలు పెట్టాడు. నా ప్రేమ నిజం కాబట్టే మా బావని పెళ్లి చేసుకోగలిగాను అనిపిస్తోంది. 
ఇట్లు
నవీన( కరీంనగర్‌)  
    

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు