బుల్లెట్లను కూడా అడ్డుకోగలకొత్త పదార్థం!

27 Dec, 2017 12:16 IST|Sakshi

గ్రాఫీన్‌ గురించి మీరెప్పుడైనా విన్నారా? వినకపోయినా ఫర్వాలేదు లెండి... పెన్సిల్‌ తీసుకుని కాగితాన్ని నలుపు చేయండి... ఆ నలుపు రంగు పొరనే గ్రాఫీన్‌ అంటారు. అయితే ఏంటి అంటారా? చాలానే ఉంది. ఈ రకమైన గ్రాఫీన్‌ పొరలు రెండింటిని సక్రమంగా అతికిస్తే చాలు... బుల్లెట్లను కూడా తట్టుకోగల వినూత్న పదార్థం రెడీ అయిపోతుంది! ఆశ్చర్యంగా ఉందా? కొంచెం వివరంగా చూద్దాం. వజ్రం మాదిరిగానే గ్రాఫీన్‌ కూడా కార్బన్‌తోనే తయారవుతుంది. ఒక పొర గ్రాఫీన్‌ను చూస్తే... అందమైన డిజైన్‌తో కూడిన ఇనుప ఫెన్సింగ్‌  మాదిరిగా ఉంటుంది. ఈ ఆకారం కారణంగానే గ్రాఫీన్‌కు కొన్ని అద్భుతమైన లక్షణాలు అలవడతాయి.

అదలా ఉంచితే.. దీంట్లో మూడు ఎలక్ట్రాన్లు గట్టిగా బంధం ఏర్పరచుకుని ఉంటే.. నాలుగో ఎలక్ట్రాన్‌ విడిగా ఉంటుంది. ఇది కూడా ఇంకో కార్బన్‌ పరమాణవుతో ముడిపడితే... గ్రాఫీన్‌ కాస్తా వజ్రంగా మారుతుంది! ఈ నేపథ్యంలో సిటీ యూనివర్శిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ శాస్త్రవేత్తలు.. తగినంత బలంతో కొడితే రెండు పొరల గ్రాïఫీన్‌ కాస్తా వజ్రం వంటి దృఢమైన పదార్థంగా మారిపోయేలా చేశారు. అకస్మాత్తుగా వచ్చిపడే బలం కారణంగా గ్రాఫీన్‌లో విడిగా ఉన్న ఎలక్ట్రాన్లు ఇతర పరమాణవులతో బంధం ఏర్పరచుకోవడం దీనికి కారణం. ఇప్పుడు... రెండు గ్రాఫీన్‌ పొరల పూత ఉన్న ఓ జాకెట్‌ను ఊహించుకుందాం. దాని పైకి రయ్యిమని ఒక బుల్లెట్‌ దూసుకొచ్చిందనుకుందాం. ఆ శక్తి కాస్తా గ్రాఫీన్‌ పొరలను దృఢంగా మార్చేస్తుంది కాబట్టి... బుల్లెట్‌ లోపలికి దిగకుండా అక్కడే ఆగిపోతుంది! అతి పలుచగా ఉండటమే కాకుండా బుల్లెట్లను కూడా తట్టుకోగల జాకెట్‌ రెడీ అవుతుందన్నమాట! సూపర్‌ ఐడియా కదూ!

మరిన్ని వార్తలు