చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నాం!

27 Nov, 2019 14:20 IST|Sakshi

 నా పేరు రాజా సాఫ్ట్‌వేర్‌ కోచింగ్ కోసమని హైదరాబాద్ కు వచ్చాను.  ఒక రోజు  సాయంత్రం హాస్టల్ పైకి వెళ్లి చల్ల గాలిలో హాయిగా అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో  నా మొబైల్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. ఏదో ఎస్‌టీడీ నెంబర్ నుండి వచ్చింది ఆ ఫోన్. హలో ఎవరు అన్నాను, హలో ప్రసాద్ గారు అని ఒక అమ్మాయి గొంతు, కాదండి అని అన్నాను. మరి ఎవరు అని అడిగింది ఆ అమ్మాయి.  ఇంతకీ మీరు ఎవరు ? అన్నాను మీరు ప్రసాదా అంది మళ్ళీ... కాదండీ బాబు, ఒకసారి నెంబర్ చెక్ చేసుకొండి అన్నాను. ఆ అమ్మాయి నమ్మలేదు, సరే మీ పేరేంటి అంది ఆ అమ్మాయి, ముందు మీ పేరు చెప్పండి అన్నాను. నా పేరు అమ్మాయి అంది.  అబ్బా చా... ఫోన్ పెట్టెయ్‌ అన్నాను. కాల్ కట్ చేసింది. మళ్ళీ కాల్ చేసింది. మళ్ళీ ఫోన్ పెట్టెయ్‌ అని గట్టిగా అరిచాను. 

తరువాత రోజు మళ్ళీ అదే టైమ్‌కు మొబైల్ ట్రింగ్ ట్రింగ్ అంది.మళ్లీ అదే ప్రశ్న ప్రసాదా అని? చెప్పాను కదా నేను ప్రసాద్‌ను కాదు అని అన్నాను. అప్పుడు ఆమె తెలుసు బాబు నాకు, ఎందుకు అంతా చిరాకు అంది. ఫోన్ చేసింది నేనే కదా మాట్లాడండి, నాకే కదా బిల్లు అని అంది (సరే అనుకున్నాను. అసలే కొత్తగా మార్కెట్ లో కి మొబైల్ ఫోన్ వచ్చింది. అప్పుడు మొబైల్ ఫోన్ లో మాట్లాడడము అంటే ఒక సరదా గా ఉండేది). సరే ఓకే చెప్పండి అని మాటలు కలిపాను. 

 ఆ పరిచయం కాస్తా ఇష్టంగా మారింది. ఒక సారి కలుద్దామని అనుకున్నాము. అంత వరకు ఒకరినొకరం చూసుకోలేదు. ఇంత మంచి అమ్మాయిని ఒకసారి చూడాలి అనుకున్నాను. ఒక డేట్ ఫిక్స్ చేసుకొని కలుద్దాం అనుకున్నాం. కానీ అదే టైమ్‌లో నాకు జాబ్ వచ్చి వెళ్లలేక పోయాను. అలా ఫోన్లోనే వన్ఇయర్ గడిచింది. 

ఆ తరువాత శాంతి వాళ్ళ ఇంట్లో, శాంతి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అన్న విషయం తెలిసింది.తనకి మొబైల్ ఫోన్ లేదు. ఒక ఎస్‌టీడీ బూత్‌ నుంచి రోజూ ఫోన్‌ చేసేది. తరువాత చాలా రోజులు తను ఫోన్ చేయలేదు. ఏదో తెలియని బాధ మొదలైంది. నా మనస్సు అంతా శాంతి కోసమే తపించిపోయింది. తరువాత ఒక రోజు ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు వచ్చి మాట్లాడు అంది.తన పేరు, ఊరు తప్ప ఇంకేమీ తెలియదు. నిన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంది.వచ్చి నన్ను తీసుకెళ్లు లేదంటే చచ్చిపోతాను అంది. ఏమి ఆలోచించకుండ సరే అన్నాను. ఆలస్యం చేయకుండా వాళ్ల ఊరు వెళ్లాలి అని నిర్ణయించుకున్నాను. శాంతి ఫోన్ కాల్ కోసం ఎదురుచూశాను. ఫోన్ వచ్చింది. పెళ్లి చేసుకుందాం నీకోసం వస్తాను... నువ్వువస్తావా అని అడిగాను. శాంతి వస్తాను అంది.

మరుసటి రోజు విజయవాడ బస్స్టాండ్ లో తన కోసం ఎదురు చూశాను. వస్తాను అన్న టైమ్ కి రాలేదు. ఫోన్ కూడా చేయలేదు.టైమ్ గడిచి పోతుంది, టెన్షన్ పెరిగి పోతుంది. చాలా సమయం ఎదురు చూశాను. ఏమో చేయాలో అర్ధం లేదు. శాంతికి ఫోన్ చెద్దాం అంటే మొబైల్ ఫోన్ లేదు. ఎలా ఎలా.. చాలా సమయం తరువాత తను వచ్చింది. తొందరగా వెళ్ళి పోదాం పదా అంది. సరే అని ఇద్దరం తిరుపతి బస్ ఎక్కాము. నా ఫ్రెండ్స్ సాయం తో మా పెళ్లి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి సమక్షమంలో జరిగింది. తరువాత ఇంట్లో వాళ్ళ ని ఒప్పించాము. ఇప్పుడు హ్యపీగా ఉన్నాం. ఒకవేళ నేను వెళ్లకపోయినా, తాను రాక పోయినా, లైఫ్ లో ఒక మంచి అమ్మాయిని మిస్ అయ్యే వాణ్ని...అలా ఒకరిని ఒకరము చూసుకోకుండానే, మనసులు కలసి పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు అందరూ మా జంట బాగుంది అంటున్నారు. మా ఇద్దరి ని ఇలా కలిపినా ఆ దేవుడికి జీవితాంతం రుణపడి ఉంటాను.

రాజా(హైదరాబాద్‌)

మరిన్ని వార్తలు