నా జీవితంలో అదే గొప్ప విజయం..

22 Jan, 2020 20:22 IST|Sakshi

మా అక్కవాళ్ల ఇంట్లో ఫంక్షన్‌లో చూశా తనని. చూసిన క్షణమే పడిపోయా. ఎవరా ఈ అమ్మాయి అని ఆరాతీస్తే మా బందువుల అమ్మాయే వరుసకు నాకు మరదలు అవుతుంది అని చెప్పగానే గాల్లో తేలియాడినంత సంతోషం కలిగింది. తన పేరు చిన్నూ. నేనే కల్పించుకొని తనతో మాట్లాడా. అప్పట్నుంచి నాతో చాలా సరదాగా ఉండేది. బావా బావా అంటూ నా వెంటే తిరిగేది. ఫోన్లో చాటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. నాతో అన్ని విషయాలు పంచుకునేది. ఇద్దరికి ఒకరంటే ఒకరకి చాలా ఇష్టం ఏర్పడింది. కానీ ప్రేమిస్తున్నా అని చెబితే తను ఎలా రియాక్ట్‌ అవుతుందో అని చాలా మధనపడేవాడ్ని.

ఒకరోజు తనకి లవ్‌ ప్రపోజ్‌ చేశా. ఈ క్షణం కోసమే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అని చిన్నూ అనేసరికి నా ఆనందానికి అవధుల్లేవు. తనను కలవడానికి అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్లేవాడిని. అత్తయ్య ఎంతో ఆప్యాయత చూపించేది. అసలు విషయం చెబితే అత్తయ్య ఏమనుకుంటారో అనుకునేవాడ్ని. ఒకసారి ధైర్యం చేసి చిన్నూని నేనింత ప్రేమిస్తున్నానన్నది అత్తయ్యకి చెప్పాను. చిన్నూ వాళ్ల నాన్న ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదని చెప్పింది. హమ్మయ్య..ఒక గండం గడిచింది. ఇక మామయ్యని ఒప్పిస్తే సరి అనుకున్నా. అది అంత ఈజీ కాదని తర్వాత అర్థమైంది.

ఆయన మా పెళ్లికి ససేమీరా అన్నారు. అమ్మానాన్న లేనివాడికి కూతుర్ని ఇచ్చే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేశారు. నా గుండె బద్దలైనంత పనైంది. బయటికి వెళ్లి పెళ్లిచేసుకోవాలా అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ నాకు తల్లిదండ్రులు లేరు, ఇలా చేస్తే వాళ్లెంత బాధపడతారో ఊహించగలను. అందుకే ఎలా అయినా మామయ్యని ఒప్పించి వాళ్ల అంగీకారంతోనే చిన్నూని పెళ్లాడాలనుకున్నా. నేనే చిన్నూని ఎంత బాగా చూసుకోగలనో వివరించాను. చిన్నూపై నాకున్న ప్రేమను వ్యక్తపరిచాను. కొన్నాళ్లకు రంగంలోకి మా అక్క,బావ దిగారు. మూడు సంవత్సరాలు యుధ్ధం చేశాక మామయ్య ఒప్పుకున్నారు. మా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పుడు చిన్నూ 9 నెలల గర్భవతి. నేనే త్వరలో నాన్నను కాబోతున్నాను. నీ జీవితంలో నేను సాధించిన గొప్ప విజయం ఏదైనా ఉందంటే అది నా ప్రేమను సాధించడమే.

--అన్ను మహేశ్‌ (వనపర్తి)

మరిన్ని వార్తలు