ప్రేమ అన్నాడు..తన పెళ్లికి రమ్మని పిలిచాడు

23 Jan, 2020 11:39 IST|Sakshi

నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు సాగర్‌ (పేరు మార్చాం) నాకు ప్రపోజ్‌ చేశాడు. అప్పుడు తను డిగ్రీ చదువుతున్నాడు. వాళ్లది మా ఇంటి పక్కనే. అప్పుడప్పుడు క్యారమ్స్‌ ఆడటానికి వాళ్లింటికి వెళ్లేదాన్ని. అలా నాపై ఇష్టం పెంచుకున్నాడు. కానీ నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్‌ లేవు. వెంటనే నో అని తెగేసి చెప్పాను. కొన్ని రోజులకి తను ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్స్‌ వేసుకున్నాడు. నేను ఒప్పుకోకపోతే చనిపోతానన్నాడు. ఆ టైంకి ఏం చెయ్యాలో తెలియక సరే అన్నాను. తర్వాత తనని కన్విన్స్‌ చెయ్యొచ్చు అని. ఆ తర్వాత సాగర్‌ చూపించే ప్రేమకి నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడిపోయా.

 అబ్బాయిలు.. లవ్‌ ఒప్పుకునేంత వరకు ఒకలా ఉంటారు. ఒప్పుకున్నాక తర్వాత ఒకలా  ఉంటారు అని సాగర్‌ని చూశాక అర్థమైంది. మెల్లిమెల్లిగా నాపై ఆంక్షలు విధించడం మొదలైంది. అక్కడికి వెళ్లొద్దు, వాళ్లతో మాట్లాడొద్దు అని ఆంక్షలు పెట్టేవాడు. అయినా భరించా. కానీ తను నన్ను చాలా డామినేట్‌ చేసేవాడు. తను చెప్పేదే వినాలనకునేవాడు. గొడవలు మొదలయ్యాయి. దాదాపు సంవత్సరం అయ్యింది మా మధ్య మాటల్లేవ్‌.

తర్వాత తనే సారీ, నాదే తప్పు అని బతిమాలాడు. ప్రేమించాను కదా, అందుకే కరుణించా. మళ్లీ మాట్లాడుకోవడం మొదలైంది. తను లేకపోతే నేను ఉండలేనేమో అనిపించేలా ఉండేది జీవితం. నాకు అన్నీ తనే. సాగర్‌తోనే నా జీవితం అనుకున్నా. కానీ తను అలా అనుకోలేదు. నేనే లేకపోయినా పర్వాలేదనుకున్నాడు. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. వచ్చి మా వాళ్లతో మాట్లాడు అంటే ధైర్యం చెయ్యలేదు. మెల్లిగా నన్ను అవాయిడ్‌ చేయడం ప్రారంభించాడు. ఇంకా షాకింగ్‌ వార్త ఏంటంటే..మా అమ్మావాళ్లు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్‌ చేశారు. ఇంకేమీ చెయ్యలేను. నువ్వు నన్ను మర్చిపోయి వేరే వాళ్లని పెళ్లిచేసుకో అన్నాడు. అసలు ప్రేమించిన వాళ్లు చెప్పే మాటలేనా అని బాధేసేది. తన పెళ్లికి వెళ్లాను. ఎంత హ్యాపీగా ఉన్నాడో స్పష్టంగా కనిపించింది. అసలు నన్ను కోల్పోయానన్న బాధ..ఏ కోశాన కనబడలేదు. ఇతని కోసమో నేను ఇంతలా ఆరాటపడ్డాను అనిపించింది.

ఆరోజే అర్థమైంది. ప్రేమిస్తున్నా అని చెప్పగానే అది ప్రేమ అవ్వదు. ప్రేమకి, ఆకర్షణకి ఉన్న తేడా ఏంటో తెలుసుకున్నాను. ఇలాంటి వ్యక్తిని ప్రేమించి తప్పు చేశాననిపించింది. చాలా రోజులు బాధపడ్డా. మళ్లీ తన నుంచి ఫోన్‌ వచ్చింది. నువ్వు లేకుండా నేను ఉండలేను, నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇలాంటి కపట ప్రేమ చూపించేవాళ్లని ఏం చేసినా తప్పు లేదనిపించింది. అసలు ఇలాంటి వాడినా నేను ప్రేమించింది? ఇతని కోసమా నేను ఇన్నాళ్లు బాధపడింది అనిపించింది. ప్రేమ నేర్పిన గుణపాఠాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినంత మాత్రానా..జీవితం అక్కడే ఆగిపోకూడదు. మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. 

స్వాతి (పేర్లు మార్చాం) 

మరిన్ని వార్తలు