మీ పార్ట్‌నర్‌లో ఈ ఐదు లక్షణాలు ఉంటే!..

4 Jan, 2020 11:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లు మనషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కో వ్యక్తి ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయి. భిన్న ఆలోచనా విధానాలతో బంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేప్పుడు చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కుదరక గొడవపడటం సర్వసాధారణం. అయితే బంధంపై క్లారిటీ ఉండి, ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండి గొడవలు పడేవారితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, బంధంపై క్లారిటీ లేకుండా ఎదుటి వ్యక్తిపై ప్రేమ లేకుండా ఏదో మొక్కుబడిగా బంధంలోకి అడుగుపెట్టే వారితోనే అసలు చిక్కు.

ముఖ్యంగా కమిట్‌మెంట్‌ ఫోబియా ఉన్న వ్యక్తులతో రిలేషన్‌లో ఉన్నట్లయితే జీవితం నిత్యం నరకప్రాయంగా మారుతుంది. అయితే మనం రిలేషన్‌లో ఉన్న వ్యక్తికి కమిట్‌మెంట్‌ ఫోబియా ఉందోలేదో తెలుసుకోవటమే పెద్దపని. ఈ క్రింది లక్షణాలు గనుక మీ భాగస్వామిలో ఉన్నట్లయితే వారికి కమిట్‌మెంట్‌ ఫోబియా ఉన్నట్లు గుర్తించాలి! వారితో జాగ్రత్తగా ఉండాలి.

1) దాటవేసే ధోరణి
కమిట్‌మెంట్‌ ఫోబియా ఉన్నవారు బంధానికి సంబంధించిన విషయాల్లో దాటవేసే ధోరణిని అవలంభిస్తుంటారు. ఎప్పుడైనా బంధం గురించిన చర్చకు తెరతీసినపుడు వారు దానికి సుముఖత వ్యక్తం చేయరు. బంధానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతున్న ప్రతిసారి టాపిక్‌ను డైవర్ట్‌ చేయటానికి ప్రయత్నిస్తారు. వారి వద్ద రిలేషన్‌కు సంబంధించిన ఏ విషయంపైనా సరైన సమాధానం ఉండదు. సరదాగా బయటికి వెళదామని అడిగితే ‘ చూద్దాం!’  అంటూ ఇష్టంలేని సమాధానాలు ఇస్తారు. 

2) భవిష్యత్తు ప్రశ్నార్థకం
రిలేషన్‌లో ఉన్నపుడు, దాన్ని కలకాలం కొనసాగించాలనుకున్నపుడు భవిష్యత్‌ గురించిన చర్చ తప్పని సరిగా వస్తుంది. ఓ జంట తమ భవిష్యత్‌ను గురించి మాట్లాడుకోవటంలో సిగ్గు పడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. అయితే కమిట్‌మెంట్‌ ఫోబియా ఉన్న వ్యక్తులు భవిష్యత్తును గురించిన విషయాలు మాట్లాడినపుడు విముఖత వ్యక్తం చేస్తారు. ‘ ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు. ముందు ప్రస్తుతం గురించి ఆలోచిద్దాం.’ అంటూ విసుక్కుంటారు.

3) చిన్న చిన్న విషయాలకే బ్రేకప్‌
కమిట్‌మెంట్‌ ఫోబియా ఉన్న వారు రిలేషన్‌ మీద సరైన క్లారిటీ లేకపోవటం వల్ల చిన్న చిన్న విషయాలకే గొడవపడి బ్రేకప్‌ చెప్పేస్తారు. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వరు. వారి అభిప్రాయాలకు, ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. బంధాన్ని ముందుగా తీసుకెళదామా? వద్దా? అన్న చోటే ఆగిపోతారు. భాగస్వామి ఎడ్డెం అంటే వీరు తెడ్డెం అంటూ గొడవలకు నాంది పలుకుతారు.

4) గోప్యత పాటించటం
కమిట్‌మెంట్‌ ఫోబియా ఉన్న వారు తమ బంధాన్ని నలుగురి ముందు బహిర్గతం చేయటానికి ఇష్టపడరు. ముఖ్యంగా సోషల్‌ మీడియాకు సంబంధించిన వాటిల్లో. ఏళ్లు గడుస్తున్నా తమ బంధాన్ని గోప్యంగా ఉంచాలని చూస్తుంటారు.

5) ప్రేమను వ్యక్తీకరించకపోవటం 
 మీరు చాలా కాలం నుంచి రిలేషన్‌లో ఉంటున్నప్పటికి మీ పార్ట్‌నర్‌ మీతో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పకపోయినట్లయితే వారు కచ్చితంగా కమిట్‌మెంట్‌ ఫోబిక్‌ అని గుర్తించాలి. కమిట్‌మెంట్‌ ఫోబియో ఉన్నవారు ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమను డిసైడ్‌ చేసుకోలేరు. ప్రేమను వ్యక్తపరిచినట్లయితే అంతా ముగిసిపోతుందని భావిస్తుంటారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు