చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దు!

16 Oct, 2019 12:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జంటల మధ్య గొడవలు చోటుచేసుకోవటం అన్నది సహజం. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలే గాలివానలా మారి బంధాలను తుడిచిపెట్టేస్తుంటాయి. కలిసుండలేక, అలాగని విడిపోలేక ప్రతి క్షణం మనస్పర్థలతో, గొడవలతో బంధాన్ని నిత్య నరకకూపం చేసుకుంటుంటారు కొందరు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అన్న పరిస్థితి బంధంలో ఎప్పుడూ రాకూడదు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరన్న సంగతిని గుర్తుంచుకోవాలి. బేషజాలకు పోకుండా జంట తమ గొడవలకు కారణాలను అన్వేషించాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మసలుకోవాలి. ముఖ్యంగా ఈ క్రింది సూత్రాలను తప్పక పాటించాలి. 

1) భూతద్దం పెట్టి వెతక్కండి 
ఎవరితోనైనా గొడవ పడినపుడు వారి లోపాలు మనకు త్రీడీలో కన్పిస్తుంటాయి. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి వెతకటం ప్రారంభిస్తాము. ఇలాంటప్పుడే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా కన్పిస్తాయి. ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరుస్తాయి. గొడవ ఎవరి వల్ల, ఎందుకు మొదలైందని ఆలోచించకుండా దాన్ని ప్రారంభంలోనే తుంచివేయటం ముఖ్యం. అహాలను సంతృప్తి పరుచుకునేందుకు గొడవ సరైన వేదిక కాదని గుర్తించాలి.

2) అంగీకరించటం నేర్చుకోండి
గొడవ జరిగినపుడు ఆ గొడవకు కారణం మీరయితే తప్పకుండా దాన్ని అంగీకరించండి. మీ తప్పును ఎదుటి వారి మీదకు నెట్టుదామనే ఆలోచన చేయకుండా, గొడవను పెంచకుండా మీ తప్పును అంగీకరించి వీలైతే క్షమాపణ కోరండి. 

3) ఓర్పుగా ఉండండి 
బంధాలను కలకాలం నిలుపుకోవాలంటే ఓర్పుగా ఉండటం ముఖ్యం. ఏదైనా ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కోపం మనల్ని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి, గొడవల సమయంలో ఓర్పుగా ఉండటం ముఖ్యం.

4) అతిగా అంచనాలు వేయోద్దు
జంటల మధ్య గొడవలకు ప్రధాన కారణం అతి అంచనాలే. మనం ఎదుటి వ్యక్తిపై పెట్టుకున్న అంచనాలను వారు చేరుకోలేనపుడే అసంతృప్తి మొదలవుతుంది. ఆ  అసంతృప్తి కోపంగా మారి, ఆ కోపం గొడవలకు దారి తీస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరన్న సంగతి మరోసారి గుర్తు చేసుకోవాలి. ఎవరికి వారి వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవటం మంచిది.  

5) గెలవటం ముఖ్యం కాదు!
జంటల మధ్య గెలుపు, ఓటముల ప్రసక్తి పనికిరాదు. ప్రతి విషయంలో మనదే పైచెయ్యి అవ్వాలన్న ధోరణి పనికిరాదు. ఎక్కడ నెగ్గాలో కాదు! ఎక్కడ తగ్గాలో తెలిసినపుడే బంధం కలకాలం నిలుస్తుంది. 

6) సర్దుకుపోవద్దు.. అర్థం చేసుకోండి
సర్దుకుపోవటమన్నది బంధాల విషయంలో అస్సలు పనికి రాదు. ఎదుటి వ్యక్తితో మనం సర్దుకు పోయినపుడు వారి వల్ల మనకు కలిగిన అసంతృప్తి మనసులో గుట్టలుగా పేరుకుపోతుంది. ఏ క్షణంలోనైనా ఎదుటి వారిపై తిరగబడేలా చేస్తుంది. భాగస్వామిని అర్ధం చేసుకోవటం వల్ల వారి మనసేంటో, ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలుస్తుంది. వారి వల్ల మనకు అసంతృప్తి కలిగినా అది మనసుపై ఎలాంటి ప్రభావం చూపించదు.  

7) జరిగిన దాని గురించి ఆలోచించవద్దు
ముందు చెప్పినట్లుగానే జంటల మధ్య గొడవలు చోటుచేసుకోవటం సహజం. జరిగిన గొడవ గురించే ఆలోచిస్తూ బాధపడకుండా ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించటం మంచిది. గొడవలకు కారణాలను అన్వేషించి, ఇక మీదట అలా జరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అది మీకెంత ముఖ్యమో దాన్ని వల్ల ఎదుటి వారికి ఏదైనా సమస్య రావచ్చా అన్న దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు