షేక్‌ చేస్తున్న 'నో షేవ్‌ నవంబర్‌'

1 Nov, 2019 08:37 IST|Sakshi

గడ్డం.. ఒకప్పుడు ఏ కొంచెం  పెరిగినా అది అందానికి అడ్డంగా ఉందని భావించేవారు యువతరం. నున్నగా షేవ్‌ చేసుకుని కనిపించేవారు. కానీ ఇప్పటి యూత్‌ అలా కాదు గడ్డం పెంచుకుని నయాలక్స్‌కు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. వెండితెరపై హీరోలు పెంచుకున్న గడ్డాలకు ప్రేక్షాభిమానుల నుంచి ఎన్ని చప్పట్లు వస్తాయో.. బయట తమకు సైతం అదే రీతిలో కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయంటూ గడ్డం బాబులు తెగ మురిసిపోతున్నారు. ఈ గడ్డాల గోల ఇప్పుడెందుకనుకుంటున్నారా?. నేటినుంచి నవంబర్‌ నెల ప్రారంభమవుతోంది. ఈ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది.

ఈ నెలను ‘నో షేవ్‌’గా పిలుస్తారు. నవంబర్‌లో యువత గడ్డాలను డిఫరెంట్‌గా పెంచుకుంటూ కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేస్తూ.. ఫాలో అవుతున్నారు. ఈ సందర్భంగా నవంబర్‌ నో షేవ్‌పై ప్రత్యేక కథనం. నవంబర్‌ నెలను కుర్రకారు ‘నో షేవ్‌’గా అభివర్ణిస్తారు. వాస్తవానికి ఇది అమెరికన్‌ స్టైల్‌. అక్కడ ఈ నెల మొత్తం యూత్‌ గడ్డం గీసుకోరు. ఒక నెలలో గడ్డానికి పెట్టే డబ్బులను నెల పూర్తయ్యాక కేన్సర్‌ పేషెంట్లకు అందజేస్తారు. తద్వారా వారు ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. స్టైల్‌కి స్టైల్‌.. హెల్ప్‌కి హెల్ప్‌ అనే ఫార్ములాకి అక్కడివారి మైంట్‌ సెట్‌ కావడం విశేషం.  

సిటీలో ఇదో వెరైటీ..
అమెరికాలో అలా ఉంటే.. మన సిటీలో మాత్రం డిఫ్‌రెంట్‌. 16 ఏళ్లు దాటిన ప్రతి బాయ్‌కి ఈ రోజుల్లో గడ్డం వచ్చేస్తోంది. ఇదే నవంబర్‌ నెలని వారు స్టైల్‌గా మలుచుకుంటున్నారు. తమకిష్టమైన కట్స్‌ని అక్టోబర్‌ చివరి వారంలోనే సెట్‌ చేసుకుంటున్నారు. నవంబర్‌ 1వ తేదీనే కొత్త తరహా గడ్డంతో దర్శనమిస్తున్నారు. ఇలా నెల మొత్తం నో షేవ్‌ అంటూ స్టైల్‌ని ప్రెజెంట్‌ చేయడమే కాకుండా.. వీరు కూడా ఈ గడ్డానికి పెట్టే డబ్బులను ఇక్కడ స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం గమనార్హం. 

లయన్‌ ఈజ్‌ నయా


ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జయసింహ గౌడ్‌. ఉప్పల్‌లోని ‘సిమ్‌ లయన్‌ ఫిట్‌నెస్‌’ అధినేత. పదేళ్లుగా ప్రతి నవంబర్‌ నెలలో ఈయన ‘నో షేవ్‌’ని పాటిస్తున్నారు. డిఫరెంట్‌ స్టైల్స్‌లో కనిపిస్తారు. ఈ ఏడాది సైతం ఓ కొత్త స్టైల్‌కి శ్రీకారం చుట్టారు. అది ‘లయన్‌ స్టైల్‌’. లయన్‌(సింహం)కి గడ్డం ఎలా ఉంటుందో.. అంతే రీతిలో ఈయన గడ్డాన్ని పెంచుకున్నారు. ఈ నెల మొత్తం గడ్డం గీయకుండా ఈ స్టైల్‌ని మరింత పదును పెట్టేందుకు సిద్దంగా ఉన్నానంటున్నారు జయసింహగౌడ్‌. 

బంద్‌లోజ్‌ భలే 


ఈయన సిద్ధార్థ్‌రెడ్డి. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇతనికి గడ్డమంటే మహాపిచ్చి. ప్రతి ఏటా ఓ కొత్త స్టైల్‌తో గడ్డాన్ని పెంచుకుని ఫ్రెండ్స్, కొలీగ్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఈ నవంబర్‌ నెలలో ‘బంద్‌లోజ్‌’ స్టైల్‌కి శ్రీకారం చుట్టారు. నెలరోజుల పాటు ఈ గడ్డంలో కనిపించడమే కాదు.. లుక్‌ని కాపాడుకోవడం కూడా సవాల్‌ అంటున్నారు. స్టైల్‌ని క్యారీ  చేయడమే నవంబర్‌ నో షేవ్‌ అంటూ మురిసిపోతున్నారీయన.   

మరిన్ని వార్తలు