అతడో రౌడీ.. ఆమె ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

17 Dec, 2019 16:06 IST|Sakshi
‘కాదలుమ్‌ కాదంతు పోగుమ్‌’ చిత్రంలోని ఓ దృశ్యం

సినిమా : కాదలుమ్‌ కాదంతు పోగుమ్‌
తారాగణం : విజయ్‌ సేతుపతి, మడోన్నా సెబాస్టియన్‌
డైరెక్టర్‌ : నలన్‌ కుమారస్వామి
భాష : తమిళం

కథ : కధిరవన్‌(విజయ్‌సేతుపతి) ఓ గూండా. ఎప్పటికైనా ఓ బార్‌కు ఓనర్‌ అవ్వాలనేది అతడి ఆశయం. అక్కడి కౌన్సిలర్‌ అతడికి దారి చూపుతాడనే ఉద్ధేశ్యంతో అతడికి సహాయపడుతుంటాడు. యాలినీ భక్తిరాజన్‌(మడోన్నా సెబాస్టియన్‌) తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఉద్యోగం చేయటానికి చెన్నై వస్తుంది. ఐదు నెలల తర్వాత తను పనిచేసే ఐటీ కంపెనీ మూసేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. తన బడ్జెట్‌కు తగ్గట్లుగా స్లమ్‌ ఏరియాలోని ఓ ప్లాట్‌లో దిగి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అప్పుడే ఆమెకు ఎదురింట్లోని కధిరవన్‌తో పరిచయం ఏర్పడుతుంది. అతడు వీధి రౌడీ అని తెలిసి ఆమె భయం భయంగానే అతడితో స్నేహం చేస్తుంది.

కానీ, కొద్ది కాలానికే ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుంటారు. ఈ సమయంలోనే యాలినీ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమంటూ ఆమెపై ఒత్తిడి తెస్తారు. దీంతో కధిరవన్‌ను తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళుతుంది. అతడు ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అని అబద్ధం చెబుతుంది. ఇద్దరి పెళ్లికి వారు ఒప్పుకుంటారు. యాలినీ, కధిరవన్‌ కోరుకున్నట్లు వారి పెళ్లి హ్యాపీగా జరిగిపోతుందా? లేక కధిరవన్‌ ఓ రౌడీ అన్న విషయం యాలినీ తల్లిదండ్రులకు తెలుస్తుందా? తర్వాత ఏం జరుగుతుందన్నదే మిగితా కథ.

విశ్లేషణ : 2016లో విడుదలైన కాదలుమ్‌ కాదంతు పోగుమ్‌ ఓ రొమాంటిక్‌ కామెడీ సినిమా. రౌడీగా విజయ్‌, స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిగా మడోన్నా నటన ఆకట్టుకుంటుంది. నవరసాలు కలగలిసిన సినిమా ఇది. ఎక్కడా బోర్‌ కొట్టకుండా సాగిపోతుంది. 2010లో విడుదలైన ‘మై డియర్‌ డెస్పరాడో’ అనే కొరియన్‌ సినిమాను ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించారు. క్లైమాక్స్‌ మనకు కచ్చితంగా గుర్తుండిపోయేలా ఉంటుంది. 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు