ప్రేమకు ‘కలమే’ బలం

13 Feb, 2020 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ ప్రేమనే శాస్త్రవిజ్ఞాన పరిభాషలో సంక్లిష్ట భావోద్వేగ ఆలోచన అంటారు. ఒకప్పుడు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి పాటలు, పద్యాలు, కవిత్వం, ఉత్తరాలు, చిత్రలేఖనం, డైరీలు, గ్రీటింగ్‌ కార్డులు తోడ్పడ్డాయి. వీటిలో ప్రధాన పాత్ర ఉత్తరాలదే. కాలగమనంలో ప్రముఖుల కాలం తీరిపోయినా వారి ప్రేమ లేఖలకు మాత్రం కాలం చెల్లలేదనే విషయం వేలం పాటల ద్వారా ఇప్పటికీ వెల్లడవుతూనే ఉంది. నేటి స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో మెసేజ్‌లు, వాట్సప్‌లు, డేటింగ్‌ ఆప్‌లు, వీడియోల ద్వారానే కాకుండా స్క్రీన్‌పై ముఖాముఖి చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకునే అవకాశం వచ్చింది. అయితే పరస్పర ప్రేమ వ్యక్తీకరణకు ఓ బలమైన సందర్భం కూడా కావాలి. 

అలాంటి గొప్ప సందర్భమే ‘వాలంటైన్స్‌ డే’. అంటే ప్రేమికుల రోజు. రోమన్‌ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చిన ఈ రోజు, కొంతకాలం క్రితం వరకు యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యక్తీకరణకే పరిమితమైంది. గత కొంతకాలంగా తల్లీ తండ్రీ, అన్నా చెల్లీ అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులతోపాటు బంధు, మిత్రులంతా పరస్పరం ప్రేమను వ్యక్తీకరించుకునే పరిపూర్ణ ప్రేమకుల రోజుగా మారింది. ఉత్తర, ప్రత్యుత్తరాల ద్వారా ప్రేమను వ్యక్తీకరించుకోవడం అనేది ఎప్పుడో ప్రారంభమైనా, వాటి స్థానంలో 1913లో ‘హాల్‌మార్క్‌’ ప్రచురణలతో వాణిజ్యపరంగా ‘వాలంటైన్స్‌ గ్రీటింగ్‌ కార్డుల’ యుగం ప్రారంభమయింది. ఇప్పుడు డిజిటల్‌ కార్డులు కూడా వచ్చాయి. 

ఎలక్ట్రానిక్‌ మీడియా ఎంత అభివృద్ధి చెందినా ప్రేమ వ్యక్తీకరణకు ప్రేమ లేఖలే ఇప్పటికీ ఉత్తమమైనవని చరిత్రకారుల నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ చెబుతున్నారు. పెన్ను పట్టుకొని ప్రేమ లేఖలు రాస్తున్నప్పుడు భావోద్వేగం వల్ల మెదడులో కలిగే ప్రకంపనల అనుభూతి ఎంత మాధుర్యంగా ఉంటుందో, అది చదివే వారికి కూడా ఆ అనుభూతి కలుగుతుంది. అందమైన పియానో సంగీతం వినాలన్నా చేతులు, చేతి వేళ్లే కదలాలి. సర్జరీలో వైద్యుడికి చేతులు ఎంత ముఖ్యమో, పర్వతారోహకుడికి అవి అంతే ముఖ్యం. అందమైన బొమ్మ గీయాలన్నా, భరత నాట్యం చేయాలన్నా చేతుల కదలిక ఎంతో ముఖ్యం. పెన్ను పట్టాలన్నా చేతులే ముఖ్యం.

అంటే చేతికి, మెదడుకు అవినాభావ సంబంధం ఉందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. మానవ పరిణామ క్రమంలో చేతులకున్న ప్రాధాన్యతను ‘ది హ్యాండ్‌’ అనే పుస్తకంలో  ప్రముఖ న్యూరాలజిస్ట్‌ ఫ్రాంక్‌ ఆర్‌. విల్సన్‌ తెలియజేశారు. చేతుల కదలికతో మెదడులో న్యూరాన్లు సర్కులేట్‌ అవుతాయట. అందుకేనేమో గొప్ప నవలా రచయితల నుంచి చిన్న కథా రచయితల వరకు, సినిమా కథా రచయితల నుంచి సినీ గేయ రచయితల వరకు చేతిలో పెన్ను పట్టుకుని రాయడానికే నేటికి ఇష్ట పడుతున్నారు. కాగితం, కలం పట్టనిదే ఆలోచనే రాదనే మేధావులు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు