ఆసుపత్రిలో ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు

11 Oct, 2019 16:43 IST|Sakshi

రోజులు గడుస్తున్న కొద్ది మైల్స్‌ హ్యారీసన్‌ గుండెల్లో వ్యధ ఎక్కువ అవుతోంది. ఎందుకంటే హ్యారీ అందరిలా దర్జాగా సమయాన్ని వృధా చేయడానికి లేదు! బ్రతికేది కొన్ని రోజులే... అనే విషయం గుర్తుకు వచ్చిన ప్రతిసారి అతడి కళ్లు చెమర్చేవి. అసలు ఈ బాధంతా తను చనిపోతున్నందకు కాదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన లిజ్‌ను విడిచి శాశ్వతంగా వెళ్లిపోతున్నందుకు. 18 సంవత్సరాల వయస్సులో బ్రెయిన్‌లో ట్యూమర్‌ ఉన్నట్లు అతడికి తెలిసింది. అయితే అప్పటి వరకు అదుపులో ఉన్న పరిస్థితులు ఇప్పుడు అదుపు తప్పాయి.

వీల్‌ఛైర్‌లో హ్యారీని తీసుకెళుతున్న లిజ్‌

ఏళ్ల తరబడి చికిత్స చేసిన తర్వాత డాక్టర్లు చేతులెత్తేశారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆసుపత్రి బెడ్‌ మీదే హ్యారీ ఓ నిర్ణయం తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత లిజ్‌ అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే అతడిలో కొత్త ఉత్సాహం నిండింది. ఆమెతో జీవితాంతం బ్రతికేయాలనే ఆశ మొదలైంది. లిజ్‌ను తొలిసారి ఆరేళ్ల క్రితం చూశాడు. అప్పుడే అనిపించిందతనికి ‘‘తను నా కోసమే పుట్టింది’’ అని. ఇంతలో మళ్లీ బాధ. లిజ్‌ అతడికి దగ్గరగా వచ్చి ‘‘ ఏమైంది హ్యారీ? ఎందుకలా ఉన్నావ్‌?’’ అడిగింది. ‘‘ మనిద్దరమూ పెళ్లిచేసుకుందామా?’’ మరో మాట మాట్లాడకుండా మోకాళ్లపై కింద కూర్చుని అడిగాడు అతడు.

పెళ్లి అనంతరం స్నేహితులు, శ్రేయోభిలాషులతో లిజ్‌, హ్యారీ

ఇంకొకళ్లయితే ఆలోచించేవారేమో. బ్రెయిన్‌ ట్యూమర్‌తో కొద్దిరోజుల్లో చనిపోయేవాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని. కానీ, ఆమె  అలా చేయలేదు. ‘‘సరే, చేసుకుందాం’’ అంది. ఆసుపత్రిలోని నర్సులే ఆత్మబంధువులయ్యారు. హ్యారీ స్నేహితులు, శ్రేయోభిలాషుల సహాయంతో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. రెండు వారాల్లోనే హ్యారీ, లిజ్‌ల పెళ్లి ఘనంగా జరిగింది. అతడో పేషెంట్‌ అన్న భావన కలగకుండా, ఆరోగ్య పరంగా అతడికి ఇబ్బంది ఎదురు కాకుండా ఆగస్టు 11న ఇంగ్లాండ్‌ నార్త్‌ డేవన్‌, కాసిల్‌ హిల్‌లో అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిపించారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు