ప్రేమసౌథం ‘‘తాజ్‌మహాల్‌’’

1 Oct, 2019 12:11 IST|Sakshi

ప్రేమికులకు పరిచయం అక్కర్లేని కట్టడం ‘‘తాజ్‌ మహాల్‌’’. రెప్పవేయనీయని సౌందర్యం ఈ ప్రేమ మహాల్‌ సొంతం. సామాన్యులైనా.. దేశాధినేతలైనా ప్రేమసౌథం అందాలకు దాసోహం అనకమానరు. ఆ పాలరాతి అందాలను ఎన్నిసార్లు చూసినా తనివితీరదు.. మక్కువ చావదు. భార్యాభర్తల ప్రేమ బంధానికి చిరునామా.. షాజహాన్‌ ప్రేమికులకు అందించిన వీలునామా ‘‘తాజ్‌ మహాల్‌’’. ప్రేమ చిహ్నంగా ప్రేమికులను.. ప్రపంచ ఏడో వింతగా పర్యటకులను ఆకర్షిస్తోంది వెండి వెలుగుల సోయగం.

భార్య ఆఖరికోరికకు రూపమే తాజ్‌మహాల్‌
షహాబుద్ధీన్‌ మహమ్మద్‌ షాజహాన్‌ చక్రవర్తిగా పరిపాలన సాగిస్తున్న కాలంలో మొఘల్‌ సామ్రాజ్యం సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. షాజహాన్‌కు మూడవ భార్య ముంతాజ్‌ మహాల్‌ అంటే ఎంతో ప్రేమ. ముంతాజ్‌ 14వ సంతానమైన గౌహరా బేగానికి జన్మనిస్తూ కన్నుమూసింది. ఆమె మరణంతో షాజహాన్‌ తీవ్రంగా కృంగిపోయాడు. ముంతాజ్‌ తన మరణానికి ముందు రోజుల్లో.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఓ అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరింది. భార్య కోరిక మేరకు షాజహాన్‌ సమాధిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. స్వతహాగా కళాపిపాసి అయిన షాజహాన్‌ తన భార్యకు అంకితమివ్వబోయే కట్టడం కనీవినీ ఎరుగని రీతిలో ఉండాలని శిల్పులను ఆదేశించాడు.

ఆనాటి ప్రముఖ శిల్పులు ఉస్తాద్‌ అహ్మద్‌ లహోరీ, ఉస్తాద్‌ అబ్దుల్‌ కరీమ్‌లు తాజ్‌మహాల్‌ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. 1932లో యమునా నది తీరంలోని ఆగ్రాలో తాజ్‌మహాల్‌ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 22 వేలమంది కార్మికులు 22 సంవత్సరాల పాటు శ్రమించి తాజ్‌ మహాల్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పర్షియన్‌, భారతీయ, ఇస్లాం నిర్మాణ శైలిలో పాలరాయితో రూపుదిద్దుకున్న తాజ్‌మహాల్‌ ఓ అద్భుతం.

మరిన్ని వార్తలు