ఇద్దరం చస్తూ బ్రతుకుతున్నాం..

17 Dec, 2019 14:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తను నా మరదలు! చాలా బ్యూటిఫుల్‌, తెలివైనది. అప్పుడు తను పదవ తరగతి చదువుతోంది, నేను డిగ్రీ. కొంచెం పెద్దవాడిని కానీ, పెద్ద ఏజ్‌ గ్యాప్‌ ఏమీ కాదు! దాదాపు 6 ఏళ్లు. బయటి వాళ్లను కాకుండా సొంత వాళ్లను చేసుకోవాలని నాకు చిన్నప్పటినుంచి ఉండేది. ఓ రోజు ఓ అందమైన అమ్మాయి మా ఇంటికి వచ్చింది. ఎవరో తెలియదు. బాగుంది అనుకున్నా! కానీ, లైట్‌ తీసుకున్నా. కొద్దిరోజుల తర్వాత తను నా మరదలని తెలిసింది. ఆ తర్వాత తన మీద పిచ్చి ప్రేమ పుట్టింది. నాకు తెలియకుండానే తన మీద గౌరవం పెరిగింది. ప్రేమ, ఆరాధన పెరిగాయి. తనను నాకివ్వమని దేవుడ్ని అడిగా. కొద్దిరోజుల తర్వాత ప్రపోజ్‌ చేశా. రిజెక్ట్‌ చేసింది. ఇలాంటివి తనకు ఇష్టం ఉండవని తెలిసికూడా మళ్లీ ప్రపోజ్‌ చేశా! తిట్టింది. సర్లే అని సైలెంట్‌ అయిపోయా.   

ఆ తర్వాత కొన్ని రోజులకు తను ఫోన్‌ చేసింది. ‘ఏంటి? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావ్‌’ అని. ఏం లేదని చెప్పా. అప్పుడు తను ‘నాకు ఏదో అయ్యింది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఐ లవ్‌ యూ’ అని. నేను గాల్లో తేలిపోయాను. డ్యాన్స్‌ చేశా. అలా మా ప్రేమ మొదలైంది. కొద్దిరోజుల తర్వాత చెప్పుడు మాటలను విని నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను ఎంత బ్రతిమాలినా వినలేదు. నేను బాధతో వేరే దేశానికి వెళ్లిపోయా. తను నా మీద కోపంతో వేరే వాడు ప్రపోజ్‌ చేస్తే ఒప్పేసుకుంది. కేవలం నామీదున్న కోపంతో. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. ఏదో బ్రతకాలని బ్రతుకుతున్నా. ఇంతలో వేరే దేశంలో ఉన్న నాకు ఓ ఫోన్‌ వచ్చింది. ‘హలో’ అన్నా. ‘నేను నీ మరదల్ని’ అంది తను. ఎందుకు ఫోన్‌ చేశావని తనను అడిగా. నిన్ను మర్చిపోలేకపోతున్నా. వేరే వాళ్లతో ఉన్నా. నువ్వు గుర్తుకు వస్తున్నావు. నిన్ను మర్చిపోలేక బ్రతుకుతున్నా’ అంది.   

నాదీ అదే పరిస్థితి. కానీ, అప్పటికే తనకు ప్రపోజ్‌ చేసిన వ్యక్తితో పెళ్లి కుదిరింది. మేము విడిపోయి బ్రతకలేమని తెలిసినా పెద్దల గౌరవం కోసం తను ఆ పెళ్లి చేసుకుంది. మేము ఏడ్చాం. చచ్చిపోదామని అనుకున్నాం. కానీ, అలా చేసినా తను దూరం అవుతుందని, చావలేక, మందుకు బానిసై రోజూ చస్తూ బ్రతుకుతున్నా. ఇక్కడ నేను అక్కడ తను ఇద్దరం చస్తూ బ్రతుకుతున్నాం.. బ్రతుకుతాం.. అలా చచ్చేదాకా!
- విజయ్‌, విజయవాడ


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు