నిద్రలేమికి మందేంటో తెలుసా?

19 Feb, 2020 12:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నిద్రపట్టకపోవటానికి మానసిక, భావోద్వేగ సమస్యలు ఏవైనా కారణం కావచ్చు! మీ భాగస్వామి ధరించిన దుస్తుల వాసన మీకు దివ్య ఔషదంలా పనిచేయనుంది. అవును! కెనడాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిటీష్‌ కొలంబియా పరిశోధకులు ఈ విషయాన్ని నొక్కివక్కానిస్తున్నారు. రొమాంటిక్‌ పార్ట్‌నర్‌ మన నిద్ర క్వాలిటీని పెంచడానికి ఉపయోగపడతారని చెబుతున్నారు. భాగస్వామి ధరించిన టీషర్ట్‌ను తలగడకు చుట్టి దానిపై నిద్రిస్తే చక్కగా నిద్రపడుతుందని వారు జరిపిన పరిశోధనలో తేలింది. స్లీప్‌ క్వాలిటీ, లవర్స్‌ స్మెల్‌ మధ్య సంబంధాలను తెలుసుకోవటానికి ఓ భిన్నమైన ప్రయోగం చేశారు.

భాగస్వాములున్న ఆడ,మగలను 24 గంటల పాటు నిర్విరామంగా టీషర్ట్‌ వేసుకునేలా చేశారు. వారు శరీరపరిమళాలు వాడకూడదని, ఘాటైన వాసనలు కలిగిన ఆహారపదార్థాలు తినకూడదని నిబంధన విధించారు. ఆ తర్వాత ఓ జంటలోని ఓ వ్యక్తికి భాగస్వామి టీషర్టుతో పాటు ఇతర వ్యక్తి టీషర్టును కూడా ఇచ్చారు. ఆమె/అతడు ఆ టీషర్టులపై నిద్రపోయేలా చేశారు. ఇతర వ్యక్తి టీషర్టుపై నిద్రించినప్పటికంటే భాగస్వామి టీషర్టుపై నిద్రించినపుడు వారు ఎక్కువ సేపు నిద్రపోయినట్లు కనుగొన్నారు.

భాగస్వామి శరీర వాసనలకు దగ్గరగా నిద్రించినవారు నిద్ర మధ్యలో మేల్కోవటం, కదలటం లాంటివి చేయకపోవటం గమనించారు. ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవారు భాగస్వామి శరీర వాసల్ని బంధించిన వస్త్రాన్ని తీసుకెళ్లటం ఉత్తమమని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. ‘ భాగస్వామి శరీరవాసనలు నిద్ర పట్టడానికి ఉపయోగించే స్లీపింగ్‌ ట్యాబ్లెట్లలా పనిచేశాయి. మన ప్రియమైనవారి శరీర వాసన మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంద’ని పరిశోధకుడు మార్లిసే హోఫర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు