ఇలాంటి వారిని అస్సలు పెళ్లి చేసుకోరు

4 Oct, 2019 11:48 IST|Sakshi

ఓ వయసు వచ్చిన తర్వాత, నూటికి తొంభై శాతం మంది తమకు కాబోయే జీవిత భాగస్వామి గురించి కలలు కంటుంటారు. జీవితాంతం తమకు తోడుగా ఉండబోయే వారు అన్ని విధాలా తగినవారై ఉండాలని కోరుకోవటం మామూలే. ప్రేమ విషయంలో ఎదుటి వ్యక్తిలో నచ్చిన కొన్ని విషయాలు పెళ్లి దగ్గరకు వచ్చే సరికి నచ్చకపోవచ్చు. అందుకే చాలామంది ప్రేమికులు పెళ్లి చేసుకోకుండానే విడిపోతుంటారు. ముఖ్యంగా పెళ్లివిషయంలో ఎదుటివ్యక్తి స్వభావం.. చాలా ప్రభావం చూపుతుంది. ఇబ్బంది పెట్టే స్వభావం కలిగిన వ్యక్తులతో పెళ్లికి వెనకాడుతారు. ముఖ్యంగా ఈ క్రింది నాలుగు రకాల వ్యక్తులను పెళ్లిచేసుకోవటానికి మగాళ్లు/ఆడవాళ్లు అస్సలు ఇష్టపడరు. కొన్ని సర్వేలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

1) నిత్య దుఃఖితులు : ఏదో కోల్పోయిన వారిలా ఎప్పుడూ బాధపడుతూ ఉండే వాళ్లను జీవిత భాగస్వామిని చేసుకోవటానికి ఎ‍వ్వరూ ఇష్టపడరు. చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ.. ఎదుటి వారిని బాధపెట్టడం వీరి లక్షణం. వీరు సంతోషంగా ఉండలేరు, తమ భాగస్వామనికి సంతోషపెట్టలేరు.

2) నియంతలు : ఇలాంటి వారు మేమే గొప్ప అన్న భావనలో ఉంటారు. తాము చెప్పిందే వేదమని, ఎదుటివారు అదే చేయాలని ఒత్తిడి తెస్తారు. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఏమి చేయాలన్నా దానిపై పూర్తి నిర్ణయాధికారం వీరిదే అయ్యిండాలని అనుకుంటారు. భాగస్వామి తమ మాటలు వినకపోతే తట్టుకోలేరు. ఎదుటి వారికి అస్సలు మర్యాద ఇవ్వరు. వీరి కారణంగా భాగస్వాములు అందరి ముందు చులకన అవుతుంటారు.

3) సైకోలు : ఇలాంటి వారు అందంగా ఉండటం సాధారణం. చూడగానే ఎదుటివారికి ఇట్టే నచ్చేస్తారు. వీరికి దగ్గరయ్యే కొద్ది వీరి స్వభావం బయటపడుతుంది. ఓ క్షణం నవ్వుతారు.. మరో క్షణం ఏడుస్తారు.. ఏడిపిస్తారు. మనల్ని ఏడిపిస్తూ సంతోషపడిపోతారు. తరుచూ చేయిచేసుకుంటూ పిచ్చి వారిలా ప్రవర్తిస్తారు. మానసిక రోగాలు(ముఖ్యంగా పర్సనాలిటీ డిశార్డర్స్‌) ఉన్న వారు ఎక్కువగా ఇలాంటి స్వభావం కలిగి ఉంటారు.

4) ఆధారపడి బ్రతికేవారు : వీరు తమ అవసరాల కోసం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి జీవిస్తుంటారు. ఎల్లప్పుడూ ఎదుటి వ్యక్తిని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటారు. భాగస్వామి తమ చేయిదాటి పోతాడేమోనని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయంలో ఎదుటి వారి సలహాలు, సహాయం ఆశిస్తుంటారు. భాగస్వామి ఇతరులతో సన్నిహితంగా ఉంటే తట్టుకోలేరు. ప్రతిక్షణం భాగస్వామితోటే గడపాలని ఆశిస్తుంటారు. ఒకవేళ భాగస్వామి వీరిపై శ్రద్ధ చూపించటం లేదని వారికి అనిపిస్తే.. ఏదో ఒకటి చేసి తమ వైపు దృష్టిని మళ్లించుకుంటారు.

మరిన్ని వార్తలు