‘ఆరేడుగురితో డేటింగ్‌.. ఇంకో లైఫ్‌ కావాలి’

22 Oct, 2019 16:23 IST|Sakshi

నేటి యువతరం యమ స్పీడు గురు!

నేటి తరం పట్ల పెద్దలకు అసూయ

సాక్షి, న్యూఢిల్లీ: ‘నేటి యువతరం యమ స్పీడు గురు!’ అని పెద్దలు అనుకోవడం పరిపాటి. వారు ఎవరి గురించి, ఎందుకు ఈ వ్యాఖ్య చేశారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. వారు మాట్లాడుతున్నది సహస్రాబ్దుల గురించి. ముఖ్యంగా ‘దిల్‌వాలే దుల్హాహానియా లే జాయెంగే’ బాలీవుడ్‌ సినిమా విడుదలైన 1995 తర్వాత పుట్టిన వారి గురించి. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరికొకరు అంటుకు తిరగడమే కాకుండా డేటింగ్‌లంటూ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం పట్ల చేస్తున్న వ్యాఖ్య. వారి వ్యాఖ్యలో ఆందోళనకంటే తమకూ అలాంటి అవకాశం లేకుండా పోయెనే అన్న అసూయనే ఎక్కువగా కనిపిస్తుంది.

వాట్సప్, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మీడియాలే కాకుండా డేటింగ్‌ యాప్‌గా ముద్రపడిన ‘టిండర్‌’ లాంటి యాప్‌లు యువతీ యువకులు కలిసి తిరగడానికి, సన్నిహితంగా మెలగడానికి పెళ్లికి ముందే లైంగిక అనుభవాలు చవి చూడడానికి దోహదపడుతున్నాయనడంలో సందేహం లేదు. ‘ఈ తరం వారిని చూసి నేను ఎంతో అసూయ పడుతున్నాను. నా జూనియర్‌ సహచరులు నెలకు ఆరేడుగురితో తిరుగుతున్నారు. నేను పెళ్లికి ముందు ఒక్కసారి కూడా ఎవరితో లైంగిక అనుభం లేదు’ అని ఓ బెంగుళూరులో పనిచేస్తున్న 40 ఏళ్ల ఐఐటీ గ్రాడ్యుయేట్‌ వాపోయారు.

‘సోషల్‌ మీడియా, మీటింగ్‌ యాప్‌లు లేని మా తరంలో ఆడ, మగ కలుసుకునేది చదువుకునే చోట, పనిచేసే చోట మాత్రమే. ఆడ, మగ కలుసుకునే అవకాశం తక్కువగా కూడా ఉండేది. 2000 సంవత్సరంలో మా ఆఫీసులో కలుసుకున్న వారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాకే అశ్చర్యం కలిగించింది’ అని ‘ఎట్‌ మేక్‌ మై ట్రిప్‌’ సహ వ్యవస్థాపకులు సచిన్‌ భాటియా వ్యాఖ్యానించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే 2013లో తమ సంస్థ డేటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ట్రూలీమ్యాడ్లీ’ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఒకప్పుడు తమ ఆఫీసులో పపిచేసే స్త్రీలు, పురుషులే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకునే వారని, ఇప్పుడు అలాంటి ఉదంతాలు బాగా తగ్గి పోయాయని, బయట ఇతరులను కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉండడమే అందుకు కారణం కావచ్చని ఆయన అన్నారు.

‘నేటి తరానికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంది. సమాజంలో రిస్కులు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. కెరీర్‌ విషయంలో, రిలేషన్‌షిప్‌లో వారికంటూ ఓ క్లారిటీ ఉంది’ అని ఓ లాజిస్టిక్‌ సంస్థలో పనిచేస్తున్న 38 ఏళ్ల రాజేష్‌ చౌదరి అభిప్రాయపడ్డారు. ‘బెడ్‌రూమ్‌లో నా పర్సనాలిటీ గురించి నేను ఏదీ దాచకుండా నీకు చెబుతాను’ అని నాలుగంటే నాలుగు రోజుల క్రితమే పరిచయమైన ఓ 28 ఏళ్ల యువతి తనతో చెప్పడం తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని ఢిల్లీకి చెందిన రచయిత్రి అంకిత ఆనంద్‌ తెలిపారు. ‘మా తరంలో స్నేహానికే సమయం ఉండేది కాదు. కలుసుకునేందుకు కాఫీడేలు కూడా లేవు. ఈ తరాన్ని చూస్తే కొంత అసూయ వేస్తోంది’ అని 36 ఏళ్ల సౌమ్యా బైజాల్‌ అన్నారు. ఈ తరం సంబంధాలను చూసి అసూయ పడుతున్న ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ‘నాకు ఇంకో జీవితం ఉంటే బాగుండు’ అని వ్యాఖ్యానించగా, ఆయన పక్కనే ఉన్న ఈ తరానికి చెందిన ఆయన కుమారుడు ‘తరం తరానికి తేడా ఎప్పుడూ ఉంటుంది. నా భవిష్యత్‌ తరాన్ని చూసి నేను కూడా అసూయ పడే రోజు వస్తుంది. అది తప్పదు!’ అని వ్యాఖ్యానించడం సబబే కావచ్చు.

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు