అతడిది బట్టతల.. అందమైన అమ్మాయి కావాలి

16 Nov, 2019 16:44 IST|Sakshi
‘ఒందు మొట్టేయ కథే’ చిత్రంలోని ఓ దృశ్యం

లవ్‌ సినిమా

సినిమా : ఒందు మొట్టేయ కథె 
తారగణం : రాజ్‌ బి శెట్టి, అమృత నాయక్‌, శ్రేయ అంచన్‌, శైలేశ్‌ శ్రీ ముల్కి
డైరక్టర్‌ : రాజ్‌ బి శెట్టి
భాష : కన్నడ 

కథ : జనార్థన్‌( రాజ్‌ బి శెట్టి) కన్నడ లెక్చరర్‌. అతడి బట్టతల, పుల్లలాంటి రూపం కారణంగా వచ్చిన పెళ్లి సంబంధాలు అన్ని తప్పిపోతుంటాయి. అయినప్పటికి అందమైన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని జనార్థన్‌ నిశ్చయించుకుంటాడు. దానికి తోడు ఓ సంవత్సరంలో పెళ్లి కాకపోతే సన్యాసం తీసుకోవల్సి వస్తుందని ఓ జ్యోతిష్యుడు అతడ్ని భయపెడతాడు. దీంతో తనకు పెళ్లి చూపులు వర్కవుట్‌ అవ్వవని భావించి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తను పనిచేసే కాలేజీలోని తోటి లెక్చరర్‌ను ఆకర్షించటానికి ప్రయత్నించి విఫలమవుతాడు. మరో ప్రయత్నంలో ఓ అందమైన అమ్మాయి చేతిలో భంగపడతాడు. ఇలా అయితే కుదరదనుకుని ఫేస్‌బుక్‌లో తన చిన్నప్పటి క్లాస్‌మేట్‌ సరళ(శైలేశ్‌ శ్రీ ముల్కి) ప్రేమలోకి దించటానికి ట్రై చేస్తాడు.

ఓ రోజు ఇద్దరు పార్కులో కలుసుకుంటారు. సరళ లావుగా ఉండటంతో ఆమెను జనార్థన్‌ అసహ్యించుకుంటాడు. సరళ కూడా మొదట అతడి రూపాన్ని చూసి ఇష్టపడదు. ఆ తర్వాత చోటుచేసుకునే సంఘటనలతో సరళ అతడిని ప్రేమించటం మొదలు పెడుతుంది. జానార్థన్‌కు నచ్చకపోయినా ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిపోతుంది. అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్న జనార్థన్‌ సరళను పెళ్లి చేసుకుంటాడా? సరళతో పెళ్లి క్యాన్సిల్‌  చేసి అందమైన అమ్మాయి కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెడతాడా? లేదా? అన్నదే మిగితా కథ. 

విశ్లేషణ : 2017లో విడుదలైన ‘ఒందు మొట్టేయ కథే’ రొమాంటిక్‌ కామెడీ మూవీ. ఫీల్‌ గుడ్‌ ప్రేమ కథా చిత్రం కాకపోయినా వాస్తవ జీవితాలను అద్దం పట్టే కథాంశం దీని సొంతం. గాల్లో మేడలు కట్టే నేటి యువతరానికి జనార్థన్‌ ప్రతీకగా నిలుస్తాడు. నిజమైన ప్రేమలో బాహ్య సౌందర్యాలకు చోటు లేదని చెప్పే సినిమా. రాజ్‌ బి శెట్టి దర్శకత్వంతో పాటు లీడ్‌ రోల్‌ చేసిన ఈ ఇన్నర్‌ బ్యూటీ కాన్సెప్ట్‌ చిత్రం మనల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు