మీ పార్ట్‌నర్‌ సెల్‌ఫోన్‌ చెక్‌ చేస్తున్నారా? జాగ్రత్త!

24 Oct, 2019 11:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కెనడా : అనుమానమో.. అతి ప్రేమో లేక తమ భాగస్వామి ఎక్కడ దూరమైపోతాడనే భయమో చాలామంది వారిని ఎల్లప్పుడు ఓ కంట కనిపెడుతుంటారు. ముఖ్యంగా వారి సెల్‌ఫోన్ల మీద ఎక్కువ దృష్టి సారిస్తుంటారు. తమ భాగస్వామి సెల్‌ఫోన్‌లోని రహస్యాలను ఛేదించటానికి నానా తంటాలు పడుతుంటారు. కొంతమంది సెల్‌ఫోన్‌ పాస్‌వర్డ్‌లను తెలుసుకోవటానికి గొడవలు పెట్టుకుంటే! మరికొంతమంది తమ భాగస్వామికి తెలియకుండా పాస్‌వర్డ్‌లను దొంగలించి వారి కంట పడకుండా ఫోన్లను శోధిస్తుంటారు. అయితే చాలామంది ఈర్శ్య, తమ భాగస్వామి పక్కవారితో చనువుగా ఉండకుండా చేయాలన్న ఉద్ధేశ్యంతోటే వారి సెల్‌ఫోన్లను తరుచుగా శోధిస్తుంటారని యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిటీష్‌ కొలంబియా, యూనివర్శిటీ ఆఫ్‌ లిస్‌బన్‌ నిర్వహించిన సర్వేలలో వెల్లడైంది. చాలామంది తమ భాగస్వాముల సెల్‌ఫోన్‌ శోధనకు అడ్డుచెప్పటంలేదని తెలిపారు. మరికొంతమందికి ఎదుటివారి ప్రవర్తన చాలా బాధకల్గించేదిగా ఉందని  వెల్లడించారు.

45 శాతం బంధాలు భాగస్వామి సెల్‌ఫోన్‌ శోధన, దొంగబుద్ధి కారణంగానే ముక్కలవుతున్నాయని పేర్కొన్నారు. భాగస్వామిపై పెట్టుకున్న నమ్మకం వమ్మవటంతో బంధానికి స్వప్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. భాగస్వామికి తెలియకుండా వారి సెల్‌ఫోన్లను శోధించటం గూఢచర్యంలాంటిదేనని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. అదో అలవాటుగా మారుతుందని, ఆ అలవాటే తర్వాత హద్దులు దాటుతుందని చెబుతున్నారు. అదో జబ్బుగా మారి భాగస్వామి ప్రతి కదిలికపై అనుమానాలు కలిగేలా చేస్తుందని అంటున్నారు. చాలా మంది విషయంలో ఆ అలవాటును ఎంతమానుకుందామని ప్రయత్నించినా అది సాధ్యపడటంలేదని తెలిపారు. ఒక వేళ భాగస్వామికి తెలియకుండా వారి సెల్‌ఫోన్లను శోధిస్తున్నట్లుయితే వెంటనే ఆ అలవాటును మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు