నన్ను క్షమించు ప్రియా..

25 Nov, 2019 15:43 IST|Sakshi

ఆ మధ్య శతమానం భవతి సినిమా టి.వి లో చూస్తుంటే చిన్ననాటి ప్రియురాలిని కలిసే సీన్ ఒకటి చూశా. కాకతాళీయంగా నేను నా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి తొంగి చూసాను. ఒక అమాయకమైన ముగ్ధమనోహర మొహం, అల్లరితో చిలిపితనాన్ని కలగలిపి కళ్ళలో పలికించే భావాలు, నాకోసం వేచి చూసి పరితపించే తన అడుగులు. నేను ఎప్పుడెప్పుడు కనిపిస్తాను అని ఆత్రుత గా ఎదురుచూసే తన మనస్సు. నేను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా..తన కళ్లతో నా మనసును వెంటాడేవి.  ఆ కళ్ళలో ఎన్నో ఊసులు ..మరెన్నో మౌన ప్రేమ లేఖలు.

కానీ ఆలాంటి స్వచ్ఛమైన ప్రేమ నాకు ఎందుకో రుచించలేదు. ప్రేమ , కెరియర్ అని ఆలోచించే పరిస్థితుల్లో కెరియర్‌కే ఓటు వేసి తనఅమూల్యమైన ప్రేమను చేజేతులా కాదనుకున్నాను. కాల గర్భంలో అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి . ఒక నెల క్రితం అకస్మాత్తుగా తను కనపడింది.. ఎన్నో యుగాల నుండి విలువైన వస్తువు కోసం వెతికి ,విసిగి  ఆశలు వదులుకునే సమయానికి అది దొరికితే ఎలా ఉంటుందో అలా నన్ను చూడగానే తన కళ్ళలో ఒక మెరుపు కనిపించింది.

ఇద్దరం కలిసి ఒక హోటల్ లో కూర్చొని కాఫీ తాగుతుంటే నా కళ్ళ-ల్లోకి సూటిగా చూస్తూ కళ్ళను చెమర్చింది. ఆ కళ్ళలో కొన్నివేల సూటి ప్రశ్నలు. నేను ఎందుకు నచ్చలేదు ? నా ప్రేమని అపహాస్యం ఎందుకు చేసావు? ప్రేమిస్తున్నావో లేదో ఏదో ఒకటి చెప్పి ఉండాల్సింది కదా..ఇలా నన్ను ఎందుకు దారి మధ్య లోనే వదిలేసావు? నీ ప్రేమ పొందటానికి నీ గురించే కాదు, నీ వాళ్ళ గురించి, నీ స్నేహితుల గురించి అందరి గురించి చదివి..నిన్ను అనునిత్యం వెతికే వెతుకులాట లో నా నుండి నన్ను దూరం చేసుకొని ఒంటరి దాన్ని అయ్యాను.

ఎవరో చెప్పినట్లు స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికి దొరకదంట. నిజమే కాబోలు...! అయినా ఈ ఎడబాటుకు ఎవరిని  నిందించను? నిన్నా? లేక  నిన్ను గుడ్డిగా ప్రేమించిన నా మనసూనా....? తప్పు దానిది కాదులే ఎందుకంటే అది చేయాలిసిన పని అది చేసింది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేశావు.  దానికి సర్ది చెప్పలేక, నీ ప్రేమ పొందలేక నరకయాతన అనుభవించాను. నా చెక్కిళ్ళను ఎరుగని అశ్రువులు. నా హృదయ వేదనను ఎగబాకిన ఆక్రందనలు..నీ తలంపుల ప్రవాహంలో ఆవినైన ఆశలెన్నో...ఇలా ఎన్నో ప్రశ్నలు!

 ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ప్రేమ అనే అపురూపమైన భావానికి నా జీవితంలో చోటు కల్పించలేకపోయాను. మానసిక పరిపక్వత లేని వయసు లో ప్రేమ వద్దనుకున్నాను. కానీ అదే స్వచ్ఛమైన ప్రేమ అని తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జీవితంలో ఏదో సాదిద్దామనుకున్నా కానీ...ప్రేమను పొందలేని కెరియర్‌లో ఇంకేమి సాధించినా తక్కువే అవుతుంది. చివరగాఒక్కమాట....నిన్ను వద్దనుకొని చాలా కోల్పాయా..నన్ను క్షమించు ప్రియా.

 రుక్మిణికాంత్...

మరిన్ని వార్తలు