ఆమె కళ్లలో కొన్ని వేల సూటి ప్రశ్నలు

21 Nov, 2019 10:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆ మధ్య శతమానం భవతి సినిమా టి.విలో చూస్తుంటే చిన్ననాటి ప్రియురాలిని కలిసే సీన్ ఒకటి నా మనసును తాకింది. కాకతాళీయంగా నా చిన్నప్పటి జ్ఞాపకాలలోకి తొంగి చూశాను. ఒక అమాయకమైన ముగ్ధమనోహర మొహం, అల్లరితో చిలిపితనాన్ని కలగలిపి కళ్లలో పలికించే భావాలు.. నా కోసం వేచి చూచి పరితపించే తన అడుగులు.. నేను ఎప్పుడెప్పుడు కనిపిస్తానని ఆత్రుతగా ఎదురుచూసే తన మనస్సు.. చకోర పక్షిలా ఎప్పుడు నా కోసం ఎదురుచూసే రెండు కళ్లు వెరసి ‘’తను’’. ఒక రోజు నేను కనిపిస్తే చాలు తన రోజు గడిచి పోతుంది. నేను ఎక్కడికి వెళ్లినా ఏమి చేసినా ఓ రెండు కళ్లు మనసుతో వెంటాడేవి. ఆ కళ్లలో ఎన్నో ఊసులు. మరెన్నో మౌన ప్రేమ లేఖలు. కానీ, ఆలాంటి స్వచ్ఛమైన ప్రేమ నాకు ఎందుకో రుచించలేదు. ప్రేమ, కెరీర్‌ అని ఆలోచించినపుడు కెరీర్‌కే నా ఓటు వేసి తన అమూల్యమైన ప్రేమను చేజేతులా కాదనుకున్నాను.

కాల గర్భంలో ఒక పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక నెల క్రితం అకస్మాత్తుగా తను కనపడింది. ఎన్నో యుగాల నుండి ఒక అమూల్యమైన వస్తువు కోసం వెతికి వెతికి విసిగి వేసారిపోయి ఆశలు వదులుకునే సమయానికి దొరికితే ఎలా ఉంటుందో అలా తన కళ్లలో ఒక మెరుపు కనిపించింది. ఇద్దరం కలిసి ఒక హోటల్లో కూర్చొని కాఫీ తాగుతుంటే నా కళ్లలోకి సూటిగా చూస్తూ కళ్లను చెమర్చింది. ఆ కళ్లలో కొన్ని వేల సూటి ప్రశ్నలు.‘‘ నేను ఎందుకు నచ్చలేదు? నా ప్రేమని అపహాస్యం ఎందుకు చేసావు? ప్రేమించావనో లేక ప్రేమించలేదనో ఎదో ఒకటి చెప్పి ఉండాల్సింది. నన్ను ఎందుకు దారి మధ్యలోనే వదిలేశావు. పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకుంటావు. సుస్వాగతం సినిమాలో హీరోయిన్ వెంట నాలుగు సంవత్సరాలు స్వచ్ఛమైన ప్రేమ కోసం వెంట పడతాడు.

కానీ నువ్వు ఏండ్ల తరబడి ఆరాధిస్తే నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయావు. నీ ప్రేమ పొందటానికి నీ గురించే కాదు, నీ వాళ్ల గురించి, నీ స్నేహితుల గురించి అందరి గురించి చదివి.. నిన్ను అనునిత్యం వెతికే వెతుకులాటలో నన్ను నేను దూరం చేసుకుని ఒంటరి దాన్ని అయ్యాను. ఎవరో చెప్పినట్లు స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికి దొరకదంట. నిజం కాబోలు...! ఇంకా నా పిచ్చి కాకపోతే నిన్ను ప్రేమించాను. ఇన్నేళ్ల మన ఎడబాటులో ఒక్క క్షణమైనా నిన్ను తలుచుకోని క్షణం ఒక్కటి కూడా లేదంటే ఎవరిని నిందించను. నిన్నా.. లేక నిన్ను గుడ్డిగా ప్రేమించిన నా మనసునా.. తప్పు దానిది కాదులే ఎందుకంటే అది చేయాలిసిన పని అది చేసింది! నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసావు. దానికి సర్ది చెప్పలేక, నిన్ను అందుకోలేక నిత్యం నరకయాతన అనుభవించాను. నా చెక్కిళ్లను ఎరుగని అశ్రువులు. నా హృదయ వేదనను ఎగబాకిన ఆక్రందనలు.. నీ తలంపుల ప్రవాహంలో పడి ఆవిరైన ఆశలెన్నో’’

నేను ఏమి చెప్పాలో.. ఎలా చెప్పాలో అర్థం కాలేదు.. ఏమి చెప్పగలను.. ప్రేమ అనే అపురూపమైన పదానికి నా జీవితంలో చోటు కల్పించలేకపోయానని చెప్పనా.. మానసిక పరిపక్వత లేని వయసులో ప్రేమ వద్దనుకున్నాను అని చెప్పనా! కానీ, అదే స్వచ్ఛమైనదని తెలిసే లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. కెరీర్‌లో ఏదో సాధిద్దామని జబ్బలు చరుచుకుంటూ నిన్ను వదిలేసి వెళ్లాను. కానీ ప్రేమను పొందలేని వాడు జీవితంలో ఏది సాధించినా ప్రేమ ముందు దిగదుడుపే. మనం కలవని క్షణాలు ఇక లేవని.. మనం గడిపిన క్షణాలను ఒక జీవితకాలానికి సరిపోయే జ్ఞాపకాలుగా మార్చుకుందామని.. ఇంక ఏమి చెప్పగలను ఒక్క మాట తప్ప... క్షమించు ప్రియా.. !!!! 
ఇట్లు.. 
నీ రుక్మిణి కాంత్


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

>
మరిన్ని వార్తలు