నేను, బావా..మధ్యలో తను

13 Jan, 2020 15:57 IST|Sakshi

బావా అనే పదంలో ఉండే ప్రేమ, అనుభూతే వేరు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. నా స్టడీ అయిపోయింది. ఉద్యోగం వచ్చాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అలా జాబ్‌ సెర్చింగ్‌లో ఉండగా కొన్ని రోజులు బావని దూరం పెట్టాను. ఆ దూరం మమ్మల్ని ఇలా విడదీస్తుందని కల్లో కూడా ఊహించలేదు. మా ఇద్దరి జీవితంలో తుఫానులా వచ్చింది ఒక అమ్మాయి. తను నా చిన్ననాటి స్నేహితురాలు. తనకు కూడా తెలుసు బావకి నేనంత ఇష్టమో, నాకు బావంటే ఎంత ఇష్టమో. అన్నీ తెలిసి కూడా తను నా బావను ఇష్టపడింది. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని మా ఫ్రెండ్స్‌ చెప్పారు. అయినా  నేనే నమ్మలేదు. ఎందుకంటే నా బావ మీద నాకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే బావతో పెళ్లి గురించి మా ఇంట్లో చెప్పాను. మొదట్లో ఒప్పుకోకపోయినా నా బలవంతంతో ఒప్పుకునేలా చేశాను అంత ఇష్టం నాకు బావంటే. అలాంటిది బావ నన్ను మోసం చేసి వెళ్లిపోయాడని తెలిసి తట్టుకోలేకపోయా. ఎంతో నరకం అనుభవించా ఇప్పటికీ అనుభవిస్తున్నా. 

 మా అమ్మ చనిపోయినప్పుడు తను నాకు బాసటగా నిలిచాడు. అమ్మ లేని బాధను దూరం చేసేంత ప్రేమ కురిపించాడు. ఇప్పుడు నన్ను పిచ్చిదాన్ని చేసి వెళ్లిపోయాడు. ఎందుకు? నా ప్రేమలో లోటుందా? బావా...నువ్వు నన్ను మోసం చేసి ఆ అమ్మాయిని పెళ్లిచేసుకొని వెళ్లిపోయినా నీమీద నాకు కోపం రావట్లేదు ఎందుకు? నిన్ను మర్చిపోలేక వేరే వాళ్లను పెళ్లిచేసుకోలేక ఇటు నాన్నని బాధపెడుతున్నా. ఇష్టం లేకున్నా..బాధనంతా గుండెల్లో పెట్టుకొని బతకాలా? ఎవరికోసం బతకాలి? తనే నా సర్వస్వం అనుకున్నా. అందరిలో తననే చూసుకున్నా. కానీ తను మాత్రం​ అందరిలా నన్ను చూశాడు. నా ప్రేమతో ఆడుకున్నాడు. నా మనసుతో ఆడుకున్నాడు. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రాణం అని భావించా. అలాంటి నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది బావా?

--అఖిల (పేర్లు మార్చాం)

మరిన్ని వార్తలు