ప్రైవేట్‌ జాబ్‌ అయితే నాన్న ఒప్పుకోరు అంది

16 Nov, 2019 15:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మేమిద్దరం చిన్నప్పటినుంచి కలిసే పెరిగాం. వాళ్లు మా ఇంట్లోనే అద్దెకు ఉండేవాళ్లు. అప్పటినుంచే ఒకరంటేఒకరికి ఇష్టం. తను ఎంఎస్‌సీ చదవటానికి హైదరాబాద్‌ వచ్చేసింది. అప్పుడు తనకు నేను ప్రపోజ్‌ చేశా. ఆ మరుక్షణమే తను నా ప్రేమను అంగీకరించింది. మా ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం సాఫీగా సాగిపోయేది. మొదట్లో నేను ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేసేవాడిని. ‘ప్రైవేట్‌ జాబ్స్‌ అయితే మా నాన్న పెళ్లికి ఒప్పుకోరు. గవర్నమెంట్‌ జాబ్‌కోసం ట్రై చెయ్‌’  అంది. నేను వెంటనే ఆ ఉద్యోగం మానేసి గవర్నమెంట్‌ జాబ్‌కోసం ప్రిపేర్‌ అవ్వటం మొదలుపెట్టాను. ప్రస్తుతం నా చేతిలో మూడు గవర్నమెంట్‌ జాబ్‌లు ఉన్నాయి. మా అక్కకు మూడేళ్ల మా ప్రేమ విషయం తెలిసింది. దీంతో తను వాళ్ల ఇంటికి వెళ్లి నా గర్ల్‌ఫ్రెండ్‌కు అంతా వివరించి చెప్పింది. కొద్దిరోజుల తర్వాత ఆమె ఇంట్లో వాళ్లు తనకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఓ అబ్బాయితో సంబంధం ఖాయం అయ్యింది. తను ఆ అబ్బాయి వివరాలు నాకు చెప్పింది. ‘నా చేతుల్లో ఏమీ లేదు. నేనేమీ చేయలేను. నన్ను వదిలేయ్‌’ అంది. నేను ధైర్యం చేసి మా అమ్మానాన్నలతో మాట్లాడాను.

వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి అంతా వివరించారు. వాళ్లు ఒప్పుకోలేదు. చాలా సినిమాల్లో విన్న డైలాగే.. ‘ నువ్వు వాడ్ని పెళ్లి చేసుకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం’ అని తనను బెదిరించారు. తను ఏమీ అనలేకపోయింది. మౌనంగా ఏడ్చింది. ఇదేమీ వర్క్‌అవుట్‌ కాదని అర్థమైంది. అందుకని, ఆమెను చేసుకోవటానికి ఒప్పుకున్న అబ్బాయివాళ్ల సైడ్‌నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాను. నేను ఆ అబ్బాయికి జరిగిందంతా చెప్పాను. అతడు కూడా నేనేమీ చేయలేను అని చేతులెత్తేశాడు. మేమిద్దరం ఒకే ఊళ్లో ఉంటున్నాం. మా మధ్య 100 మీటర్ల దూరం ఉంది. నేనేమి చేయాలో అర్థం కావటంలేదు. రోజురోజుకు పిచ్చి వాన్నవుతున్నా.
- వాసు

చదవండి : అతడ్ని మర్చిపోవడానికి పూజలు చేయించారు
ఆ బాధ వర్ణనాతీతం


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు