ఇష్టం వేరు ప్రేమ వేరని తెలిసింది

18 Dec, 2019 13:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అప్పుడు నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. అతను డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌. మా ఇళ్లు రెండూ ఎదురెదురుగా ఉండేవి. నేను వాళ్ల ఇంటికి డైలీ క్యారంబోర్డు ఆడటానికి వెళ్లేదాన్ని. ఒకరోజు అతడు నాకు ప్రపోజ్‌ చేశాడు. నాకిష్టం లేదని చెప్పా. ఓకే చెప్పమంటూ నాకోసం ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. పిచ్చిగా చేస్తే మీ వాళ్లకు చెప్తా’  అని వార్నింగ్‌ ఇచ్చా. కొన్ని రోజుల తర్వాత నాకు తెలియకుండానే నేనతన్ని ఇష్టపడటం మొదలుపెట్టాను. అతను ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పకుండా వెళ్లేవాడు కాదు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. నేను నా ఫ్రెండ్‌ అతనితో సినిమాకు వెళ్లాము. తర్వాత కొన్ని రోజులకు అనుమానం స్టార్ట్‌ అయ్యింది. వాళ్లతో మాట్లాడకు.. వీళ్లింటికి వెళ్లకు అని ఇబ్బంది పెట్టేవాడు. ‘నాపైన నమ్మకం లేదా’ అని అడిగాను. అలా ఓ సంవత్సరం పాటు మాట్లాడుకోలేదు.

తర్వాత అతనే సారీ చెప్పాడు. మళ్లీ మా ప్రేమ కంటిన్యూ అయ్యింది. నిన్నే పెళ్లి చేసుకుంటా లేకుంటే లేదు. జీవితాంతం ఇలానే ఉంటా అని చెప్పాడు. చాలా నమ్మాను. మా ప్రేమ గురించి వాళ్ల చెల్లెలితో కూడా చెప్పాడు. మా కులాలు వేరువేరు. వాళ్ల ఇంట్లో వాళ్లకు తెలిసింది. నాతో మాట్లాడటం మానేశాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. మా వాళ్లు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేయటం మొదలుపెట్టారు. ఏం చేయాలి’ అని అడిగాను. కులాలు వేరు కదా ఒప్పుకోరని అన్నాడు. ‘మరి ఏం చేస్తావ్‌?’ అని అడిగా. తర్వాత చెప్తానన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఫోన్‌ చేసి ‘నేను రెండు పెళ్లిళ్లు చేసుకుంటా. ముందు మా వాళ్లు చూసిన అమ్మాయిని చేసుకుంటా. తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా’ అని చెప్పాడు. నో చెప్పా. ఇలాంటి వాడినా నేను ఇంతకాలం ప్రేమించింది అని చాలా బాధపడ్డాను.

తన ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత నాకు చెప్పాడు. డిసెంబర్‌ 31న పెళ్లికి నన్ను తప్పకుండా రమ్మన్నాడు. నేను మ్యారేజ్‌కు వెళ్లా. అతడి కళ్లలో నా మీద ఇసుమంత కూడా ప్రేమ కనిపించలేదు. ఇష్టం వేరు ప్రేమ వేరు అని తెలుసుకున్నా. ప్రేమ, నమ్మకం లేకుంటే ఎన్ని సంవత్సరాలైనా జీవితం వృధా. ఇప్పుడు జాబ్‌ చేస్తున్నా. అతడికి పెళ్లై ఒక సంవత్సరం అవుతోంది. మళ్లీ ఫోన్‌ చేస్తున్నాడు ‘నువ్వు నా ప్రాణం రా! నాతో ఉన్న రోజులు గుర్తుకు వస్తున్నాయి. నేను నీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను’ అని చెబుతున్నాడు. నేనతనితో కలిసి ఉండాలనుకోవటం లేదు. ప్రేమను ఈ సృష్టిలోని ఏ వస్తువుతోనూ సరిపోల్చలేము.
-  మౌనిక, హైదరాబాద్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు