ఎన్నేళ్లయినా తనను మర్చిపోలేకపోతున్నా..

26 Nov, 2019 18:35 IST|Sakshi

 గతాన్ని తవ్విన కొద్దీ కొన్ని జ్ఞాపకాలు బయట పడ్తూనే వుంటాయి. అందులో నా ప్రేమ ఎప్పటికీ మరిచిపోలేని వెలతి లానే మిగిలిపోయింది. ఎంత హఠాత్తుగా నా జీవితంలోకి ప్రవేశించిందో..అంతే హఠాత్తుగా వెళ్ళిపోయింది. తను దూరమైనప్పటి నుంచి మనసులో ఏదో తెలియని బాధ, వెలతి. తర్వాత ఎంతమంది అమ్మాయిలను చూసినా..తనే గుర్తుకొచ్చేది. తను నాకు దూరమై ఎన్నేళ్లయినా తనను మర్చిపోలేకపోతున్నా. అవి నేను ఇంటర్మీడియట్ చదివే రోజులు. అయిష్టంగానే కాలేజీలో అడుగుపెట్టాను. కొన్ని రోజులు గడిచిపోయాయి. తనను చూసిన ఆ క్షణం వరకు ప్రేమంటే ఇంత అద్భుతంగా ఉంటుందని తెలీదు. తనను చూడడానికి  పదేపదే వాళ్ళ క్లాస్ వైపు వెళ్తూ తనను చూడటం..ఆమె చూస్తే వెంటనే తల తిప్పేయడం... అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. 


అప్పుడు దసరా సెలవులు.  అందరూ హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నేను మాత్రం తనతో ఎలాగైనా మాట్లాడాలి. మనసులో మాట చెప్పేయలి అని అనుకొని ధైర్యం చేసుకొని ముందడుగు వేశాను. భయంతో కూడిన ధైర్యమది. ఎదో చెప్పాలన్న ఆరాటం అయితే వుంది కానీ తను ఎలా రెస్పాండ్ అవుతుందనే భయంతోనే... భయంతోనే నీతో మాట్లాడాలి అన్నాను. కానీ నా మదిలోంచి మాటలు వచ్చేలోపే కాలేజీ బెల్‌ మోగింది. తను వెళ్లిపోయింది.

సెలవులు ముగిశాక మళ్లీ ఎన్నో ప్రయత్నాలు చేశా తనతో మాట్లాడ్డానికి. ఎలా మాట్లాడాలో కూడా ప్రియేర్‌ అ‍య్యేవాడిని కానీ సాధ్యపడలేదు. చివరికి ఎక్జామ్స్‌ వచ్చాయి. ఇక ఎలాగైనా మాట్లాడాలి లేదంటే ఎప్పటికీ ఛాన్స్‌ రాదని చాలా ట్రయల్స్‌ చేశా. తన కోసం ఎక్జామ్‌సెంటర్‌ దగ్గర పడిగాపులు కాసాను. చివరి ఎక్జామ్‌ వరకు కూడా చాలా ప్రయత్నించాను తనకి లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి. కానీ ఆ ఎదురుచూపులు.. జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. అప్పుడు చెప్పలేకపోయానన్న బాధ నన్ను ఇప్పటికీ బాధిస్తుంది. ఇప్పటికీ చెప్పకపోతే ఇంకెలా తెలుస్తుంది నీకోసం పరితపించే వాడు ఒకడున్నాడని. 

కానీ  నీకు గుర్తుందో  లేదో మన చూపులు చాలా సార్లు కలిశాయి. నువ్వు నాకోసం ఎదురుచూడటం మొదలెట్టావని అప్పుడే అర్థమైంది... ఇంకా ఎదో చెప్పాలని ఉన్నా...చెప్పడానికి మనసు దైర్యం చేయట్లేదు.  ఒక్కసారి మాట్లాడాలి. నువ్వు నా ప్రేమను అంగీకరిచకపోయినా పర్వలేదు. కనీసం  నా మనసులో మాట చెప్పాను అనే తృప్తి అయిన మిగులుతుంది. జానూ..ఒక్క సారి మాట్లాడవు..

సాయిచరణ్‌

మరిన్ని వార్తలు