మోసం చేశాడు.. అంత అర్హత లేదు

28 Oct, 2019 20:08 IST|Sakshi

గుడిమెట్లు ఎక్కుతుంటే మనసులో చిన్న అలజడి మొదలైంది. మనసు భారమవ్వసాగింది. ఎందుకో అర్థం కాలేదు. అక్కడే నిలబడిపోయి చుట్టూ చూశాను. దూరంగా అమ్మ! బాగా చిక్కిపోయింది. ఏదో పిచ్చి చీర కట్టుకుంది. తననలా చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. పరిగెత్తుకుపోయి తనను వాటేసుకోవాలని, తన గుండెపై తలవాల్చి భోరున ఏడవాలని అనిపించింది. కానీ ఆ ధైర్యం చేయలేకపోయాను. ఎలా చేస్తాను? తను అలా అయిపోవడానికి కారణమే నేను. పెళ్లైన పదేళ్లకు పుట్టాను అమ్మానాన్నలకి నేను. పైగా డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది అయ్యిందట. ఒక ప్రాణమే దక్కుతుంది అని డాక్టర్లు అంటే, ‘నా బిడ్డనే బతికించండి’ అందట అమ్మ. అలాంటి అమ్మని బతికుండగానే చంపేశాను నేను.

ఆ రోజు పురుట్లో నేనే చనిపోయినా బాగుండేదేమో.  కళ్లలో పెట్టుకుని పెంచారు నన్ను. ఆడింది ఆట, పాడింది పాట. దాంతో గారం ఎక్కువైంది. ప్రతిదానికీ మారాం చేయడం అలవాటైంది. ఆ మారాం కాస్తా మొండితనమై కూర్చుంది. అందుకే, కృష్ణతో ప్రేమలో పడినప్పుడు అమ్మ వారిస్తే వినిపించుకోలేదు. ఆ అబ్బాయి గురించి ఎంక్వయిరీ చేశాను, అంత మంచివాడు కాదని తెలిసింది అని నాన్న మొత్తుకున్నా చెవికెక్కించు కోలేదు. పైగా వాళ్ల అంగీకారం లభించదని అర్థమై ఓ అర్ధరాత్రి పూట చెప్పకుండా కృష్ణ దగ్గరకు వెళ్లిపోయాను. రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నాను. నాలుగు నెలల పాటు అతని ప్రేమలో మునిగి తేలాను. ఆ మత్తులో అమ్మానాన్నల్ని పూర్తిగా మర్చిపోయాను.  

ఓరోజు బయటకు వెళ్లి వస్తానన్న కృష్ణ ఎంతకీ తిరిగి రాలేదు. రాత్రయింది. ఉదయం అయ్యింది. మళ్లీ రాత్రి అయ్యింది. అలా ఎన్ని రాత్రులో, ఎన్ని ఉదయాలో! అతను మాత్రం రాలేదు. అతని ఫ్రెండ్స్ దగ్గర ఎంక్వయిరీ చేస్తే... ఇంట్లో చూసిన సంబంధం చేసుకుని విదేశాలకు వెళ్లిపోయాడని తెలిసింది. నాతో పెళ్లయిన సంగతి ఎవరికీ చెప్పనేలేదని అర్థమైంది. మోసపోయాను. ఎవరికీ ముఖం చూపించలేకపోయాను. స్నేహితుల దగ్గర చిన్నబోయాను. చివరికి అమ్మానాన్నలు ఎదురుపడినా పలకరించే అవకాశం లేకుండా చేసుకున్నాను. ప్రేమలో పడి చదువు కూడా మధ్యలోనే ఆపేశానేమో, మంచి ఉద్యోగం కూడా దొరకలేదు. ఓ చిన్న స్కూల్లో టీచరుగా పని చేస్తూ కడుపు నింపుకుంటున్నాను. అమ్మానాన్నల దగ్గరకు వెళ్తే ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. కానీ ఆ పని చేసే ధైర్యం మాత్రం లేదు. అంత అర్హతా లేదు. అమ్మానాన్నల అనురాగాన్ని కాలదన్నుకుని వెళ్లిపోయే ఏ అమ్మాయికి ఆ అర్హత ఉంటుంది చెప్పండి!
- సంధ్య, తెనాలి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు