ఓ తల్లి శోకం.. ఓ తండ్రి దుఃఖం

30 Nov, 2019 08:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ.. అజరామరం.. అనంతం.. అమృతం.. కానీ, ఆ ప్రేమ దక్కకపోతే..చాలామంది కాల గర్భంలో కలిసిపోతూ.. కన్న వారికి కన్నీలను మిగుల్చుతూ.. తిరిగి రాని లోకాలకు ప్రయాణం అవుతున్నారు. ఇది ఓ తల్లికి ప్రేమ మిగిల్చిన శోకం!  తండ్రికి మిగిల్చిన  దుఃఖం. ఇది నా స్నేహితురాలి ప్రేమకథ.. ప్రేమ కథ అనటం కన్నా కన్నీటి కథ అనాలేమో..

వర్షపు చినుకులు.. మది కోరే వెచ్చని ఊహలు.. ప్రాయం రాని వయసు.. పరువం తెచ్చిన సొగసు కలగలిపితే షాహీన్‌. మేము పదవ తరగతి చదువుతున్న రోజులవి.  ఇద్దరం స్కూలుకి నడుచుకుని వెళ్లి వస్తూ ఉండేవాళ్లం. ఉదయాన్నే ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న సమయంలో ఓ చోట తన కళ్లు.. కాళ్లు కాసేపు ఆగిపోయేవి. వేణు కోసం అని మాకు తెలియలేదు చాలా రోజుల వరకు. వేణు ఒక కరెంట్ పని చేసే కుర్రాడు. ఎందుకు ఇష్టపడిందో తెలీదు కానీ చాలా ఇష్టం చూపేది. ప్రతి నోట్‌ బుక్‌ మీద వీళ్ల పేర్లే! ఒక రోజు మాకు పరీక్షలకు హాల్ టికెట్స్ ఇచ్చారు. ఆ రోజు ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఓ షాప్ దగ్గర ఆగింది. అది వేణు పనిచేసే షాపు. తను అతడి దగ్గరికి వెళ్లింది. నేను సైకిల్ పట్టుకుని రోడ్ మీదే నిల్చున్నా. ఓ 10 నిమిషాల మాటలు తర్వాత తను ఏడ్చుకుంటూ వెనక్కు వచ్చింది. నాకర్థం కాలేదు. ‘ఏమైంది’ అని అడిగితే సమాధానం లేదు. మౌనమే తన భాష. నేను ఎంత అడిగినా సమాధానం రాలేదు. 10 నిమిషాల మా నడకలో నోరు మెదపలేదు. తన ఇల్లు వచ్చింది.. వెళ్ళిపోయింది. నేను తను ఇంట్లోకి వెళ్లేవరకు చూస్తూనే వున్నా. ఇంటికి వచ్చినా కానీ మనసు ఎందుకో బాలేదు. నాకు తన బాధకి బాధ అనిపించింది.

కానీ, తన మనసులో బాధ తెలియలేదు. పరీక్షల కోసం చదువుకుంటుంటే ఓ రోజు మధ్యాహ్నం మా నాన్న వచ్చి ‘ఆ నవాజ్‌ గారి అమ్మాయి ఉరి వేసుకుని చనిపోయింది’ అన్నారు అమ్మతో. నా కాళ్లలో ఒణుకు! అది షాహీన్‌ కాదు కదా? వెంటనే నాన్నని మళ్ళీ అడిగా. ‘హా’అన్నారు. నన్ను వాళ్ల ఇంటికి వెళ్లనీయలేదు. కొన్ని రోజులకు వాళ్ల ఇంటికి వెళ్లా. వాళ్ల అమ్మగారు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ల నాన్న గారు సూన్యంలోకి చూస్తూనే ఉన్నారు. ఇది జరిగి 20 సంవత్సరాలు అవుతోంది. మొన్న మళ్ళీ వాళ్ల ఇంటికి వెళ్లా. వాళ్ల నాన్న గారికి పక్షవాతం వచ్చి మంచం మీద  ఉన్నారు. అలా సూన్యంలోకి చూస్తూనే.
- నాగభూషణ్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు