శబ్దాన్ని ఆపండి..

7 Mar, 2019 14:40 IST|Sakshi

విద్యార్థుల ఏకాగ్రత సన్నగిల్లే ప్రమాదం

కాజీపేట: పరీక్షల కోసం విద్యార్థులు ఎంతో ఏకాగ్రతతో చదువుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఇబ్బందికలిగితే వారి ఏకాగ్రత దెబ్బతిని చదువుకోవాలనే ఆసక్తిని కోల్పోతారు.  ప్రధానంగా పదోతరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల బంగారు భవితవ్యానికి మార్గం చూపే వార్షిక పరీక్షల సమయంలో ఈ పరిస్థితులు ఎక్కువగా కన్పిస్తుంటాయి.  అయితే మారుతున్న కాలాన్నిబట్టి వాహనాల రణగొనధ్వనులు ఎక్కువవుతున్నాయి. ఈ ప్రభావం పరీక్షల సమయంలో విద్యార్థులపై ఎక్కువగా ఉంటోంది. 


కాలనీల్లో ఆగని మైక్‌ల గోల...

ఉదయం 6గంటలకే ఉల్లిపాయలోయ్‌.. ఉల్లిపాయలంటూ ఆటోలో మైక్‌ సెట్‌తో ఒకరు రెఢీ. గ్యాస్‌ స్టవ్‌లు బాగు చేస్తామంటూ ఇంకొక్కరు సిద్దం. ఇవన్నీ వెరసి ప్రశాంత వాతావరణంలో చదువుకునే విద్యార్థుల ఏకాగ్రతను భగ్నం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న మైకులతో వచ్చే శబ్దంతో అటు విద్యార్థులు, ఇటు వృద్ధులతోపాటు సామాన్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులు మానసిక ఆందోళనతో పాటు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. 


కల్యాణ మండపాల్లో హోరు..

పెళ్లిళ్లు, చిన్న చిన్న వినోద కార్యక్రమాలు నిర్వహించే కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు ఊరికి దూరంగా విశాలమైన ప్రాంతాల్లో ఉండేవి. కాలక్రమేణా ఇవి నివాసాల మధ్యలోకి వచ్చేశాయి. పెళ్లంటే ఒకప్పుడు సన్నాయి, మేళతాళాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు సంగీత్‌ పేరుతో రెండు రోజుల ముందు నుంచే ఆర్కెస్ట్రా, మ్యూజిక్, తీన్‌మార్‌లతో హోరెత్తించేస్తున్నారు.

రకరకాల  బ్యాండ్లతో కిలో మీటర్ల మేర వినిపించే మోతకు తోడు, బాణాసంచా పేలుళ్లతో బెంబేలెత్తిస్తూ సరికొత్త సమస్యలకు కేంద్రాలుగా మారుస్తున్నారు. దీనికితోడు  ఆటోలు, మోటారు సైకిళ్లు, లారీలు, బస్సుల హారన్ల మోత భరించలేనిదిగా మారింది. చిన్నచిన్న వ్యాపారులు తోపుడు బండ్లు, ఆటోల్లో మైకుల ద్వారా చేస్తున్న ప్రచారం చికాకు తెప్పించేదే. 

40 డెసిబుల్స్‌ దాటకూడదు..

శబ్ధ తీవ్రతను డెసిబల్స్‌లో కొలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ధ్వని తీవ్రత 40 డెసిబుల్స్‌ లోపు ఉండాలి. అయితే వరంగల్‌ నగరంలోనే గాక రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో ధ్వని తీవ్రత 55 డెసిబుల్స్‌ వరకూ నమోదవుతున్నట్లు తెలుస్తోంది.  

ఎక్కడ ఎలా.. డెసిబల్స్‌లో
గ్రంథాలయాలు 45
దుకాణాలు, రెస్టారెంట్లు  65
పారిశ్రామిక ప్రాంతం  70
ఆసుపత్రులు     40
కార్యాలయాలు  50
నివాసప్రాంతాలు  55
నిశబ్ద జోన్‌  10 

నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

శబ్ద కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలి?, నివాసప్రాంతాలు, వ్యాపారకూడళ్లు, పారిశ్రామిక వాడల్లో ధ్వనితీవ్రత ఎలా ఉండాలి?, పరిమితికి మించి శబ్దంతో ఏమవుతుంది?, చదువు, ప్రశాంతతకు భంగం కలిగించే రణగొణ ధ్వనులు వేధిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి లాంటి ప్రశ్నలకు సమాధానాలివే...

అనుమతి తప్పనిసరి..!

మన ఇంట్లో అయినా సరే పరిమితికి మించి శబ్దం బయటకు రాకూడదు. ఉదాహరణకు టీవీ, టేప్‌రికార్డు సౌండు, చుట్టుపక్కల వారి ప్రశాంతతకు భంగం కలిగించకూడదు. భజనల పేరిట నిర్వహించే పూజల్లో మైకులు వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి.

రాత్రి 9గంటల తర్వాత మైకులు వినియోగిస్తే చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల సీజన్‌ కావడంతో పగలు, రాత్రి వేళల్లో మైకుల మోతలపై నిషేదం విధిస్తున్నారు. మైకులు వినిఝెగించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఎక్కడ, ఏ రోజు ఎప్పటినుంచి ఎప్పటి వరకు మైకు వినియోగిస్తారో తదితర వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ఇక్కడ.. 

జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా అనుమతి కోసం దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. వాటిని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తారు. అక్కడి సీఐ దాన్ని పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఏసీపీ స్థాయి అధికారికి పంపిస్తారు. ఆయన క్షుణ్నంగా పరిశీలించి అనుమతిస్తారు. ఒక్కోసారి కొంతమంది ప్రార్ధనా మందిరాలు, పాఠశాలలు, ఆసుపత్రులకు సమీపంలో మైకు పెట్టేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తారు. వీటిని ఆయా అధికారులు పరిశీలించి అనుమతిని తిరస్కరించేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతారు. 

ఇలా చేస్తే మేలు... 

నివాస ప్రాంతాల్లో మైకుల ప్రచారాన్ని కట్టడి చేయాలి. పగటి వేళల్లో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాటిని నియంత్రించాలి. పాఠశాలకు సమీపంలో ఎలాంటి ధ్వనులు, గోల లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.  

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా