మా ప్రేమను కాలం కూడా విడదీయలేదు

18 Oct, 2019 20:26 IST|Sakshi

ప్రేమ.. వెల్లువెత్తే ఉత్సాహానికి చిరునామా. ఉత్తేజానికి ప్రతిరూపం. యువతకు పర్యాయపదం. కొందరి జీవితాల్లో అది విషాదాన్ని నింపింతే.. మరికొందరికి మాత్రం మరిచిపోలేని జ్ఞాపకాలను, అనుభూతులను పంచుతుంది.  సృష్టిలో స్వచ్చమైన ప్రేమ  కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. అందులో నేనూ ఒకడిని. రెండేళ్ల  మా ప్రేమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నాం. కానీ అందరికీ ఎదురైనట్లే మాకూ కొన్ని అవాంతరాలు, అభ్యంతరాలు, అడ్డంకులూ ఎదురవుతున్నాయి. మా ఇద్దరి ఆలోచలు, అభిప్రాయాలు ఒకటే అయినప్పటకీ.. ఇద్దరి ప్రాంతాలు, కులాలు, మతాలు కుటుంబ నేపథ్యాలు వేరు. వాటిని ఎదుర్కొని నిలబడి జీవితాంతం ఒకటిగా నిలబడాలనేదే మా ఇద్దరి ఆశా, ఆకాంక్ష, ఆశయం.

నా పేరు సూర్య. మాది ఖమ్మం. తనది ఆదిలాబాద్‌ (శైలజా)‌.  ఓ యూనివర్సిటీలో సీటు రావడంతో భాగ్యనగరానికి బయలెళ్లి వచ్చా. తనూ అంతే. కాలేజీలో చేరిన తొలి  ఆరు నెలలు తనకూ నాకు అస్సలు పడేదికాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువుల్లా ఉండేవాళ్లం. మొదటి సంవత్సరం మధ్యలోనే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో యూనివర్సిటీ ఖాళీ చేసి నేను వెళ్లిపోయాను. కానీ పరీక్షలకు హాజరవుతూ.. చదువును అలాగే కొనసాగించా. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. అదే ప్రేమ గొప్పతనం. దానికి నేనే పెద్ద ఉదాహరణ. నేను ఆమె నుంచి దూరంగా ఉన్న సమయంలోనే ఎందుకో తెలియని ఆలోచనలు ఆమెపై కలగడం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు కాలేజీకి పోయిన సందర్భాల్లో ఆమెతో మాటలు కలపడం ప్రారంభించాను. రోజులు గడుస్తున్న కొద్ది నాకు తెలియకుండానే ఆమె గురించి ఆలోచించడం హద్దులు దాటింది. ఫోన్లో చాటింగులు నడుస్తున్నాయి. తనపై నాకున్న ఇంట్రస్ట్‌ని వ్యక్త పరస్తూ ఉండేవాన్ని. నా మాటలను ఆమె చాలా త్వరగా అర్థం చేసుకుంది. ఒక రోజు ఉన్నట్టుండి.. నాపై ఎందుకంత ఇంట్రస్ట్‌ చూపిస్తున్నావు.. ప్రేమిస్తున్నావా? అంది. అంతే ఇక ఆలస్యమైందనుకుని అవునూ అనేశా.

‘‘ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుందాం’’ అని ప్రపోస్‌ చేశా. అంతే ఇక నా నెంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది‌. ఆరు నెలల పాటు చుక్కలు చూపెట్టింది. ఎంతో బతిమలాడినా.. అస్సలు మాట్లాడేదికాదు. తనతో మాట్లాడం కోసం నేను చేయని పనిలేదు. వేయని వేషం లేదు. చాలా చిరాకు పెట్టేవాడిని. వారంవారం తన కోసమే యూనివర్సిటీకి వెళ్లేవాడిని. అలా తన పరిచయంలో తొలి ఎనిమిది నెలలు గడిచిపోయాయి. ప్రేమ దేవత కరునించినట్లు కొంతకాలం తరువాత తను నాతో మాట్లాడ్డం మొదలుపెట్టింది. తొలుత తను స్నేహం అంది. కానీ నేను నా ప్రపోజల్‌కి  కట్టుబడే ఉన్నా. రోజూ గంటలకొద్ది ఫోన్లో చాటింగ్‌లు, టాకింగ్‌లు. ఎంత ఇష్టపడుతున్నానో రోజూ చెప్పేవాడిని. అలా తొమ్మిది నెలల తరువాత నా ప్రేమను అంగీకరించింది. ఇక ఆ తరువాత మా ప్రేమకు హద్దులు లేవు. ఈ ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం. నేను కోరుకున్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చిందని  ఆనందం. తను ఓకే చెప్పిన కొద్ది కాలంలోనే చాలా దగ్గర అయ్యాం.

నేను కాలేజీకి వచ్చానంటే ఆమె కళ్లల్లో ఆనందం, తిరిగి వెళ్తున్నానంటే అవే కళ్లల్లో కన్నీళ్లు. గడిచిన రెండేళ్లలో మేము మాట్లాడకుండా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదు. నేను ముద్దుగా లవ్‌ యూ మమ్మీ అంటే.. తను ప్రతిగా లవ్‌ యూ డాడీ అనేది. రెండేళ్ల మా ప్రేమ ప్రయాణం మాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను, ఆనందాలను పంచింది. ఒకరిని విడిచి మరొకరం ఉండలేని స్థితికి చేర్చింది. ఇద్దరం కలిస్తే మూడో వ్యక్తితో మాకు సంబంధమేలేదు. చిన్న చిన్న సర్‌ఫ్రైజ్‌లకు చాలా సంతోష పడుతూ.. తనకు నేను, నాకు తనే ప్రపంచంగా అనుకునే వాళ్లం.  తను వెంట ఉంటే మా అమ్మ దగ్గర ఉన్న ఫీలింగ్‌ నాలో కలిగేది. నాకు ఏమైనా అయిందంటే విలవిల్లాడేది తను. నా సంతోషాల్లోనే కాదు కష్ట సమయంలోనూ నాకు తోడుగా ఉండేది. ఆమె నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. అందరిలా మా మధ్య కూడా అప్పడప్పుడు చిన్నచిన్న మనస్పర్థలు వచ్చేవి. కానీ అవన్నీ కొద్ది క్షణాలు మాత్రమే.

తనెప్పుడూ నాతో ఓ మాట చెప్పేది ‘‘యూ ఆర్‌ ఈక్వల్‌ టూ మై ఫాదర్‌. లవ్‌ యూ డాడీ’’  అని. ఈ క్రమంలోనే మూడేళ్లు గడిచాయి. మా చదువు కూడా అయిపోయింది. డిగ్రీ చేతికి వచ్చింది. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయాం. ఇక్కడే మాకు అసలైన కఠిన పరీక్ష ఎదురైంది. సమయం కూడా తెలియకుండా రోజూ గంటలకొద్ది ఫోన్లో ముచ్చట్లు పెట్టే మాకు కాలం అడ్డుతగిలింది. తను ఇంటికి వెళ్లిపోవడంతో చాటింగ్‌, టాకింగ్‌ బంద్. ఎప్పుడో ఒకసారి హాయ్‌. తిన్నావా. జాగ్రత్త నాన్న. ఇవే తన నుంచి వచ్చే వాట్సప్‌ మెసెజ్‌లు. అంతకుమించి ఒక్కమాట కూడా మాట్లాడటానికి తనకు ఇంట్లో వీలు ఉండదు. సమయం దొరికితే ఫోన్‌ చేసి ఐదు నిమిషాలు మాట్లాడేది. ఇద్దరి మధ్య మైళ్ల దూరం ఉండొచ్చేమో కానీ.. మా మనసుల మధ్య మాత్రం దూరం శూన్యం. గత జ్ఞాపకాలను తలుచుకుంటూ కాలం గడుపుతున్నాం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ‘‘ఎన్నాళ్లు ఇలా ఒకరికొకరం దూరంగా ఉంటాం. ప్రేమ విషయం ఇంట్లో చెబుదాం’’ అని తనతో అన్నా. ‘‘ కొంత సమయం ఆగు.. ఇద్దరం సెటిల్‌ అయ్యాక చెబుదాం’’  అంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఆమె న్యాయవాద వృత్తిలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తోంది, ఉన్నత విద్యనూ కొనసాగిస్తోంది. నేను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా.

మరో రెండేళ్ల తరువాత పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటి కావాలనేదే మా లక్ష్యం. అంతలోపు సెటిల్‌ అవ్వాలని కూడా. అయితే మా ఇద్దరి కులాలు, మతాలు వేరు. ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారా? లేదా? అనేది మమ్మల్ని కలిచివేస్తున్న ప్రశ్న. ఆమెకు మరో ఏడాదిలో పెళ్లి చేసే ఆలోచనలో ఇంట్లో వాళ్లు ఉన్నారు. తను మాత్రం నన్నే నమ్ముకుని ఉంది. పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకునే తెగువా, ధైర్యం మాకుంది. కానీ ‘‘తల్లిదండ్రుల పరువును బజారుపాలు చేయకూడదు, ఎలాగైనా సరే పెద్దల్ని ఒప్పించిన తరువాతే పెళ్లి చేసుకుందాం’’  అంటూ ఎప్పూడూ నాతో చెప్పుతూ ఉంటుంది. అంత పెద్ద మనసు తనది. ప్రస్తుతం ఇద్దరం సెటిల్‌ అయ్యే పనిలోఉన్నాం. త్వరలోనే పెద్దలకు మా ప్రేమ గురించి చెప్పబోతున్నాం. వాళ్ల మమ్మల్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతోనే ఇద్దరంఉన్నాం. లేని ఎడల రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని, కష్టమైనా సుఖమైనా కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నాం. మా ప్రేమను కాలం కుడా విడదీయలేదని, కనుమూసేంత వరకు అస్తమించనిదని మా నమ్మకం. - సూర్య (పేర్లు మార్చాం)

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు