వీటితో చర్మ, జలుబు సమస్యలు దూరం

19 Nov, 2019 09:10 IST|Sakshi

చలికాలంలో చిన్నపిల్లల ఆహారం ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి

విటమిన్‌ ‘సి’ పళ్లతో చర్మ, జలుబు సమస్యలు దూరం

సాక్షి, చింతలపాలెం(హుజూర్‌నగర్‌) : చలికాలంలో పిల్లలు తరుచూ జబ్బుల బారిన పడుతుంటారు. దీనికి కారణం పిల్లల్లో వాతావరణ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు తగినంత రోగ నిరోధక శక్తి లేకపోవడం. దీనికితోడు తినే పదార్థాలు ఇవి ఇష్టంలేదు.. అవి ఇష్టం లేదు అంటూ తినకుండా మొండికేస్తుండడం అందరి ఇళ్లలో చూస్తుంటాం. దీంతో కలిగే చెడుప్రభావాన్ని కూడా శరీరంతోపాటు చర్మం కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చలికాలంలో చర్మానికి కాంతిని, ఆరోగ్యాన్ని అందించే విటమన్‌ ‘సి’ ఉన్న పళ్లను ఇతర పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించగల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించుకుని చలి కాలంలో వచ్చే రుగ్మతలను దూరం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

నీటిని ఎక్కువగా తాగాలి 
అన్నింటికంటే ముందుగా చలికాలంలో నీటిని ఎక్కువగా తాగే అలవాటు చేసుకోవాలి. వేసవికాలంలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో అందులో 20 శాతం నీటిని కూడా తాగం. ఈ కాలంలో వాతావరణంలో తేమ కూడా ఉండదు. దీని దుష్ప్రభావం శరీర ఆరోగ్యంపై చూపుతుంది. అంతే కాకుండా చర్మం మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. 

అల్లం: చలికాలంలో ఎక్కువగా అల్లం టీని ఇష్టపడతారు. ఈకాలంలో గొంతుకు ఉపశమనం కలిగించే అద్భుతమైన మందు అల్లం. పిల్లలు దగ్గు, శ్లేషంతో బాధపడుతుంటే వాళ్లకు అల్లం టీ తాగించాలి. దీని ప్రభావంతో రక్త ప్రసరణ కొంత మెరుగుపడుతుంది. చలి కారణంగా జీవ క్రియ మందగించడం లాంటి శారీరక క్రియల్లోనూ కూడా వేగం పుంజుకుంటుంది. 

బెల్లం: చలికాలంలో బెల్లం తినాలి. బెల్లం తింటే శరీరంలో వేడి పుట్టి అవసరమైన ఉష్ణం నిలిచి ఉంటుంది. బెల్లంలో ప్రొటీన్, మెగ్నీషియం, మినరల్స్, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్‌ మొదలైనవి తగినంత మోతాదులో ఉంటాయి. చల్లదనంతో మందగించిన రక్త ప్రసరణకు ఇది చురుకుదనం కలిగిస్తుంది. జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. సాధారణంగా పిల్లలు బెల్లం తినడానికి ఇష్ట పడరు. కాబట్టి వారికి బెల్లం హల్వా ఇతర వంటకాలను చేసి తినిపించాలి. 

సూప్‌.. చలికాలంలో అందరూ ఎక్కువగా ఇష్టపడే పానీయం సూప్‌. మీరు కూడా రకరకాల సూప్‌లను తయారు చేసుకోవచ్చు. సాధారణంగా అందరూ ఎక్కువగా ఇష్టపడేది టమాట సూప్‌. ఇంట్లో తయారు చేసుకునే టమాటా సూప్‌ చర్మానికి ఆరోగ్యానికి ఆశ్చర్యకరమైన ఫలితాలను అందిస్తుంది. మీ పిల్లల కోసం దీనిని మీరు తయారు చేసేటప్పుడు అందులో వెన్న మిరియాలు తప్పనిసరిగా కలపాలి. మిరియాలు జీర్ణ శక్తికి, దగ్గుకు బాగా పనిచేస్తాయి. టమాటా సూప్‌తో పాటు బఠాణీలు, పప్పులు, మొక్కజొన్న పిండి, కూరగాయల సూప్‌లను తయారు చేసుకోవచ్చు. 

ఉసిరి రసం: ఉసిరిలో విటమిన్‌ ‘సి’ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది.  స్వభావ రీత్యా విటమిన్‌ ‘సి’ ని వేడిచేస్తే అది నశించిపోతుంది. కాని ఉసిరిలో ఉండే విటమిన్‌ ‘సి’ వేడిచేసినా మరే విధంగా నశించిపోదు. ఉసిరితో పచ్చడి చేసో, మురబ్బా చేసో పిల్లలకు తినిపించవచ్చు. దీంతో పిల్లలకు జీర్ణ శక్తి బాగు పడుతుంది. చర్మం, శిరోజాలలో కూడా నిగారింపు వస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్‌ కూడా.

బత్తాయి: చలికాలంలో దొరికే అద్బుతమైన పండ్లలో బత్తాయి కూడా ఒకటి. ఇందులో విటమిన్‌ ‘సి’ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని చలికాలంలో వాడితే చర్మ, జలుబు లాంటి సమస్యలు దూరమవుతాయి. ఈపండుకు చలువ చేసే స్వభావం ఉంటుంది. రాత్రి, ఉదయం లాంటి చల్లని వాతావరణంలో కాకుండా ఎండలో దీన్ని తినడం మంచిది. మీరు రోజుకు రెండు బత్తాయి పండ్లు తినగలిగితే అది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

నిమ్మ ‘టీ’: చలికాలంలో టీ వాడకం ఎక్కువగా ఉంటుంది. చలి కాలంలో మీరు నిమ్మ టీ తాగి చూడండి. శక్తి లభిస్తుంది. నిమ్మ కారణంగా లభించే విటమిన్‌ ‘సి’ తో చాలా లాభం కలుగుతుంది. పిల్లలకు ఇచ్చే సలాడ్‌లలో కూడా నిమ్మ రసం కలిపి సర్వ్‌ చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది.

ఆహారం ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి
చలి కాలంలో చిన్న పిల్లల ఆహారం ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్‌ ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. చలి కాలంలో గోరు వెచ్చని నీరు తాగాలి. స్వెట్టర్లు, మఫ్లర్‌లు, మాస్క్‌లు ధరించాలి. చలి గాలిలో తిరగవద్దు. ఎంపిక చేసిన ఆహారం తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి మంచిది. ఆకు కూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ అవసరానికి తగినట్లు తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తిని అందజేస్తాయి. 
– డాక్టర్‌ ప్రేమ్‌సింగ్, మండల వైద్యాధికారి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు