మళ్లీ తన ప్రేమ దొరకదా.. ?

17 Nov, 2019 13:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దగ్గరగా ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదంటారు.. ఒకసారి బంధం నుంచి బయటకు వచ్చాక ఎదుటి వాళ్లను ఎంత మిస్‌ అవుతున్నామో అప్పుడు అర్థం అవుతుంది. అప్పటి వరకు అన్ని ఉన్న నా లైఫ్‌లోకి లైఫ్‌లైన్‌లా వచ్చాడు. మరో కొత్త ప్రపంచాన్ని చూపించాడు. నాకు ప్రాణంలాగా మారాడు. ఎంత త్వరగా దగ్గరయ్యాడో.. అంతే త్వరగా నానుంచి దూరమయ్యాడు. కానీ తనతో ఉన్న ప్రతిక్షణం నాకు మధురమే! అది ప్రేమైనా.. బాధ అయినా. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కొన్ని గోల్డెన్‌ మూవ్‌మెంట్స్‌ ఉంటాయి. బట్‌ నా లైఫ్‌లో వాడే ఒక గోల్డ్‌. నా దురదృష్టం కొద్దీ నాకు తను పరిచయం ​అయ్యేలోపే నా లైఫ్‌లో వేరే వ్యక్తి ఉన్నాడు. నా స్టడీస్‌ అయిపోయాక ప్రాజెక్ట్‌ వర్క్‌ మీద ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యాను. అక్కడ జాయిన్‌ అయిన ఒక నెలకి సూర్య పరిచయం అయ్యాడు. నేను ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయిన మొదటి రోజే చూశాడట కానీ నాకు తెలియదు. పేరు సూర్య. ముద్దుగా నానా అని పిలిచే దాన్ని. అందరిలాగే ఫ్రెండ్‌లా మాట్లాడేవాడు. కానీ తను మాట్లాడుతుంటే నాలో ఏదో కొత్త ఫీలింగ్‌.

తనకు నేనంటే చాలా ఇష్టం. మేం మాట్లాడటం మొదలెట్టిన ఒక వారం తర్వాత నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. అప్పటికే నాకు లవర్‌ ఉన్నాడని చెప్పేశాను. అయినా పెద్దగా రియాక్ట్‌ అవ్వలేదు. ‘నేనంటే ఇష్టం ఉంటే మాట్లాడు’ అని సైలెంట్‌ అయిపోయాడు. సరే అని ఓ ఫ్రెండ్‌లా మాట్లాడేదాన్ని. బట్‌ తనతో మాట్లాడుతుంటే ఏదో ఫీలింగ్‌. నావాడు అన్న ఫీలింగ్‌ రోజురోజుకీ తన మీద ఇష్టం పెరిగిపోయింది. ఒక రోజు ప్రపోజ్‌ చేశాడు. నేను యస్‌ అని చెప్పలేదు కానీ తనతో క్లోజ్‌గానే మూవ్‌ అయ్యాను. అలా మా ప్రేమకు తొలి అడుగులు పడ్డాయి. రోజూ చాటింగ్‌, కాల్స్‌ చేసుకునేవాళ్లం. తనతో మాట్లాడుతున్నంత సేపు ఏదో తెలియని సంతోషం. తను ముందే ఎందుకు పరిచయం కాకూడదు.. అనుకోని రోజు లేదు. అలా ఒక ఆరు నెలలు గడిచిపోయాయి. చెప్పాను కదా ఇది వరకే నా లైఫ్‌లో ఒక వ్యక్తి ఉన్నాడని. అతని విషయంలో గొడవలు మొదలయ్యాయి. నిజానికి తన గురించి సూర్య దగ్గర కొన్ని నిజాలు దాచాను.

అవి తెలిసిన రోజున సూర్య చాలా ఫీల్‌ అయ్యాడు. అలా మా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అయినా మా మధ్య ఉన్న ప్రేమ వల్ల మళ్లీ కలిసే వాళ్లం. మళ్లీ గొడవ.. మళ్లీ మాట్లాడటం.. ఇలా సంవత్సరం గడిచిపోయింది. తను నన్ను పెళ్లి చేసుకుంటా అని అడిగాడు. ఆ రోజు లైఫ్‌లో ఎంతో సంతోషంగా ఫీల్‌ అయ్యా అయితే రిటర్న్‌లో సమాధానం చెప్పలేకపోయా. అలా అని వాడంటే ఇష్టం లేక కాదు.. వాడంటే నాకు ప్రాణం. కానీ.. నా లైఫ్‌లో ఉన్న వ్యక్తి గుర్తొచ్చి ఆగిపోయా. ఆ వ్యక్తిని చేసుకుంటే నా జీవితంలో సంతోషంగా ఉండలేను అన్న విషయం తెలిసినా నేను చేస్తున్నది తప్పు అని తెలిసినా తప్పని పరిస్థితి నాది. నన్ను నేను మరిచే అంతగా నచ్చాడు సూర్య. కానీ కాలం మమ్మల్ని ఎక్కువ రోజులు కలిసి ఉండనివ్వలేదు. తుంపరిలా వచ్చిన వాన ఎడతెరిపి లేని వర్షంలా మారింది. తనకు నా మీద నమ్మకం పోయింది. నేనేం చేసినా మళ్లీ ఆ నమ్మకాన్ని దక్కించుకోలేకపోయాను.

ఎంతో సంతోషంగా ఉన్న రోజులని మరిచిపోయి గొడవలే మా మధ్య గుర్తుకు వచ్చే పరిస్థితికి పోయాం. అందులో తప్పులేదు. అలా అవ్వడానికి కారణం నేను. ఎన్ని గొడవలు అయినా తన మీద నాకు తొందరగా కోపం పోయి మాట్లాడేదాన్ని. తను మాట్లాడేవాడు. కానీ అంతంతమాత్రమే. రోజులు గడిచాయి. ఇప్పుడు ఆ మాటలు కూడా కరువయ్యాయి.. పూర్తిగా మాట్లాడటం మానేశాడు. అలా కాలం గడిచిపోయింది. తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. కొద్ది రోజులకు తనకు ఒకమ్మాయితో పెళ్లి ఫిక్స్‌ అయింది. కానీ నేను రోజు తన గురించి ఆలోచిస్తూ.. తనతో మాట్లాడకుండా ఉండలేకున్నా. రోజూ తననే తల్చుకుంటూ రోజులు గడుపుతున్నా.. బట్‌ తన లైఫ్‌లోకి మళ్లీ వెళ్లి డిస్టర్బ్‌ చేయాలని లేదు. జీవితాంతం తనను ప్రేమిస్తుంటాను అన్న ఒక్క మాట తనకి గుర్తుంటే చాలు. తను హ్యాపీగా ఉంటే చాలనిపిస్తోంది. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ సూర్య...
- ఆధ్య, కదిరి


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు