ఆరోజు జాబ్‌ లేదని కాదంది.. ఇప్పుడు..

23 Jan, 2020 15:21 IST|Sakshi

ఓ ఫంక్షన్‌లో చూశా తనని. చూడగానే నచ్చింది. ఎవరా అని ఆరా తీయగా తను మా మమయ్య కూతురు సంధ్య అని తెలిసింది. మా కుటుంబాల మధ్య నెలకొన్న గొడవల కారణంగా నా చిన్నప్పటి నుంచే మామయ్య వాళ్లతో మాకు మాటల్లేవు. సంధ్యని చూడటం అదే మొదటిసారి. తొలిచూపులోనే నచ్చేసింది.  సంవత్సరం అయ్యాక తన నుంచి కాల్‌ వచ్చింది. బావా నువ్వంటే నాకిష్టం అంది. నేను కూడా నా ప్రేమను వ్యక్తపరిచాను.

మా కబుర్లకు గంటలు కూడా సెకన్లలా గడిచిపోయేవి. అలా ఐదు సంవత్సరాలు చాలా సంతోషంగా గడిచాయి. నిన్ను చూడాలనిపిస్తుంది బావా అనగానే క్షణాల్లో తన ముందు వాలిపోయేవాడ్ని. అంతా సరదాగా గడిచిపోతుందనుకున్న  సమయంలో తనలో మార్పు కనిపించింది. నన్ను కావాలనే దూరం పెట్టడం, ఫోన్‌ చేస్తే మాట్లాడకపోవడం లాంటివి చేసేది.

ఇలా ఎందుకు చేస్తున్నావ్‌ అని అడిగితే..నాకు పెళ్లి ఫిక్స్‌ అయ్యింది. ఇక నాతో మాట్లాడకు అంది. మామయ్య వాళ్లింటికి వెళ్లా. సంధ్యాని నాకిచ్చి పెళ్లి చేయండి. మేమిద్దం ప్రేమించుకుంటున్నాం అని చెప్పాను. నీకు ఏముందని ఇవ్వాలి రా నా కూతుర్ని అని చాలా అవమానించారు. ఆ టైంలో నాకు జాబ్‌ లేదు. తండ్రి కోణంలో ఆయన కోపం సరైందే అనుకున్నా. సంధ్యని కలిశా. నీకు నామీద నమ్మకం ఉంటే నాతో వచ్చెయ్‌ అన్నా. నీకసలు జాబ్‌ లేదు. నీతో వచ్చి ఏం చెయ్యాలి? ఇప్పుడు మా అమ్మానాన్న చూసిన అబ్బాయికి గవర్నమెంట్‌ ఉద్యోగం ఉంది. తను కానిస్లేబుల్‌, ఒక జాబ్‌ సెక్యురిటీ ఉంది. నీతో వస్తే అడుక్కుతినాల్సిందే అంది.

తను మాట్లాడిన మాటలకి నా గుండె ఆగినంత పనైంది. ప్రేమించే అమ్మాయే ఇలా మాట్లాడితే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించాను. సంధ్య చేసిన గాయాల నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టింది. తనకి పెళ్లయ్యింది. ఎంతో కష్టపడి సివిల్స్‌ రాశా. ఎస్‌ఐ ఉద్యోగం వచ్చింది. ఏమీ లేనప్పుడు తను నా పక్కన ఉంది. ఇప్పుడు నాకు జాబ్‌ వచ్చాక తను నాతో లేదు అని బాధపడని రోజు లేదు.

ఉద్యోగరీత్యా ఒకరోజు ఓ ఏరియాలో పెట్రోలింగ్‌కి వెళ్లా. మా పీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ సురేశ్‌ వాళ్ల ఇళ్లు అక్కడే కావడంతో నన్ను కాఫీ తాగడానికి వాళ్లింటికి పిలిచాడు. సరే అని వెళ్లా. ఆశ్చర్యం ఏంటంటే నేను ప్రేమించిన సంధ్య వాళ్ల భర్త సురేశే కావడం. తనని చూడగానే షాక్‌ అయ్యా. సురేశ్‌ నన్ను ..మా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్‌ అని  సంధ్యకి పరిచయం చేశాడు. అవమాన భారంతో నన్ను తలెత్తి చూడలేకపోయింది. ఆరోజు ఏ జాబ్‌ కోసం నన్ను వదులుకుందో.. నేడు దాని కంటే పైస్థాయిలో నేనున్నాను. ప్రేమంటే స్థాయి, అంతస్తులు చూసి లెక్కలేసుకోవడం కాదు. ఏమీ లేకున్నా, ఏమీ ఆశించకుండా నేనున్నాను అనే భరోసా ఇవ్వడం.

- అనిల్‌కుమార్‌ (జహీరాబాద్‌)

మరిన్ని వార్తలు