నీలాంటి వాడు దొరికితే అస్సలు వదులుకోను

25 Oct, 2019 20:42 IST|Sakshi

నేను ఒక మధ్య తరగతి కుటుంబంలో పెరిగినవాన్ని. కొన్ని కారణాల వల్ల నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడు నేను చిన్న వ్యాపారం మొదలుపెట్టాను (డ్రెస్సెస్ షాప్ ). నా దృష్టిలో ప్రేమ ఎంతో గొప్పది. ప్రేమించి పెద్దలు ఒప్పుకోక విడిపోయి బాధ పడకూడదు. అందుకే పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించి, సంతోషంగా చూసుకోవాలి అనేది నా అభిప్రాయం.  కేవలం పెళ్లి అనే దారిలోనే నేను వెళ్ళాలి అనుకున్నాను. అందుకే ప్రేమ అనే దారిలో నేను వెళ్ళలేదు.అందుకని నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి ప్రపోజల్‌తో ఒప్పించాలి అని అనుకున్నాను. కానీ మనం అనుకున్నవన్నీ కావు కదా...! పెళ్లిళ్లు అన్నీ స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అని ఊరికే అనలేదుగా పెద్దలు. మా షాప్‌లో తరచుగా డ్రెస్సెస్ కొనడానికి వచ్చిన లక్కీ అనే అమ్మాయిని చూశాను. తను నాకు తగిన అమ్మాయి అని అనిపించింది. పెళ్లి చేసుకోవాలనుకున్నాను, వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడి ఒప్పించాలి అనుకున్నాను.

అదే సమయంలో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అదే మంచి సమయం అనుకున్నాను. అదే క్రమంలో అమ్మాయి వాళ్లకి ఏమి కావాలో తెలుసుకున్నాను (ఆ అమ్మాయిని ఎలాంటి లక్షణాలున్న అబ్బాయికి ఇవ్వాలి అనుకుంటున్నారో ). వాళ్లకి కావలసిన వాటిలో నా దగ్గర ఉన్నది మంచితనం ఒక్కటి మాత్రమే . అది ఒక్కటి సరిపోదు కదా, అని తెలుసుకుని ఊరుకున్నాను. ఇక అంతలోనే నా జీవితంలోకి ఇంకో అమ్మాయి రానే వచ్చింది. తరచుగా మా షాప్‌కి వచ్చే మరో అమ్మాయి స్వాతి. తను షాప్‌కి వచ్చినా ఎక్కువగా మాట్లాడేది కాదు, తన పని చూసుకుని వెళ్ళిపోయేది అంతే. కొన్ని రోజుల తర్వాత వాళ్ల అక్క పెళ్లి ఉందని, తనకి షాపింగ్‌లో సహాయం కావాలని అడిగింది. తనకి పెళ్లి షాపింగ్‌లో సహాయం చేశాను. ఆ క్రమంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఎక్కువ అయింది. తను మొబైల్ నెంబర్ ఇచ్చింది. రోజూ మాట్లాడొచ్చని చాలా సంతోషపడ్డాను. అలా రోజూ మెసేజ్‌లు చేసుకునే వాళ్లం, ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళం. 

అలా కొన్ని రోజుల తర్వాత మా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చాయి. నాకు తన మాటల్లో అప్పుడప్పుడు నా పైన ప్రేమ కనిపించేది. తర్వాత ఒక రోజు తనని అడిగాను, ‘నిన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలి’ అని, తను చెప్పిన సమాధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇదే మంచి సమయం అనుకుని కొంచెం భయపడుతూనే అడిగాను, ‘నాలాంటి వాడు దొరికితే ఏమి చేస్తావ్’ అని. అప్పుడు తను ‘నీలాంటి వాడు దొరికితే అస్సలు వదులుకోను’ అని చెప్పింది. ‘అయితే వదులుకోకు’ అని అన్నాను. వెంటనే తను ఆశ్యర్యంతో ఏంటి అని అడిగింది. ‘నాలాంటి వాణ్ణి వదులుకోను అన్నావ్ కదా అందుకే వదులుకోకు అన్నాను. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాను. తను నాకు ఏమి చెప్పాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తనని పెళ్లి గురించి అడిగాను. ‘ప్రేమించి ఇంట్లో వాళ్లు ఒప్పుకోక విడిపోయి బాధపడడం ఎందుకు’ అని చెప్పింది.

ఆ తర్వాత ‘మా ఇంట్లో వాళ్లని ఒప్పించు’ అని అడిగింది. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొన్ని రోజులు గడిచాక వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి మా పెళ్లి గురించి అడిగాను. అప్పుడు వాళ్ల నాన్న సమాధానం ఇంకోలా వచ్చింది. ‘నేను నా కూతురిని అంత కష్టపడి ఇంత పెద్ద చదువులు చదివించి ఒక షాప్ వాడికి ఇచ్చి పెళ్లి ఎలా చేస్తా అనుకుంటున్నావ్’ అని అన్నాడు. తన కూతురిని కూడా బెదిరించాడు నన్ను మర్చిపొమ్మని. స్వాతి వాళ్ల నాన్న ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పాడు, తన కూతురికి నాతో మాత్రం పెళ్లి చెయ్యను అని. ఆ తర్వాత ఒక సంవత్సరం తను నేను చాటింగ్‌లోనే మాట్లాడుకునే వాళ్లం. ఎలాగైనా పెళ్లి చేసుకుందాం అని అనుకుని, వాళ్ల నాన్నతో మరొకసారి మాట్లాడి ఒప్పించడానికి వాళ్ల ఇంటికి వెళ్లాను. వాళ్ల నాన్నని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేశాను. అయినా వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. చివరికి ఒక మాట చెప్పాను. ‘‘మీ కూతురిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం నాకు పెద్ద విషయం కాదు! కానీ, మీ కూతురుకి మీ కుటుంబం కావాలి, నాకు మీ కూతురి సంతోషం కావాలి. నా స్వార్ధం కోసం చూసుకుంటే ఒక్క రోజు చాలు మీ కూతురిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవటానికి.

కానీ, నేను అలా చెయ్యలేను’’ అని చెప్పి వెళ్ళిపోయాను. నేను చెప్పిన మాటలకి స్వాతి తండ్రికి ఆ రోజు రాత్రి గుండెపోటు వచ్చింది. మాటలకే ఇలా అయితే ఇంక నిజంగానే తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే జరగకూడనిది ఏదైనా జరిగితే!! దానికి కారణం నేనే అవ్వడం ఇష్టం లేదుకుని స్వాతి దగ్గరికి వెళ్లి మాట్లాడాను. ఇద్దరం పరిస్థితులను అర్థం చేసుకుని అందరిని బాధ పెట్టి మనం ఎలా సంతోషంగా ఉండగలం అని విడిపోయాం. అలా కొన్ని రోజులు స్వాతి జ్ఞాపకాలతో గడుపుతూ, బాధ పడుతూ ఉన్న.. ఆరు నెలల తర్వాత నేను మొదట పెళ్లి చేసుకోవాలనుకున్న లక్కీ అనే అమ్మాయి సంబంధం నాకు లక్కీగా వచ్చింది. నేను చాలా సంతోష పడ్డాను . అనుకున్నట్టుగానే లక్కీతో నాకు పెళ్లి జరిగింది. ఇప్పుడు మా జీవితం చాలా సంతోషంగా ఉంది. ఇదే నా జీవితంలో జరిగిన ఒక అందమైన చిన్న ప్రేమ కథ. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అంటే ఇదేనేమో. ఎందుకంటే నేను మొదట్లో ఇష్టపడ్డ, కోరుకున్న లక్కీ! నా జీవిత భాగస్వామి అవ్వడం చాలా లక్కీగా అనిపించింది. 
- లక్కీశ్రీనివాస్


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు